వార్తలు

ఆకాశమంటనున్న ఎరువుల ధరలు..

0

పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరల అదనపు భారం వ్యవసాయరంగంపై మరో గుదిబండగా మారుతోంది. ఫెర్టిలిలైజర్స్ ఉత్పత్తి కంపెనీలు ఇష్టారాజ్యాంగ ధరలు పెంచి రైతుల నెత్తిన భారం మొపుతున్నాయి. రసాయనిక ఎరువులు 50కిలోల బస్తాకు సగటున రూ.200 పెంచుతున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. ఎరువుల ధరల పెంపుతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం నెత్తిన ఏటా రూ.650 కోట్లు అదనపు భారం పడనుంది. అంతర్జాతీయంగా రసాయనిక ఎరువుల తయారీకి అవసరమయ్యే ముడిసరుకుల ధరలు పెరిగిన కారణంగానే ఎరువుల ధరలు పెంచాల్సివస్తోందని కంపెనీలు ధరల పెంపును సమర్ధించుకుంటున్నాయి. యూరియా మినహా మిలిగిన అన్ని రకాల రసాయనిక ఎరువుల ధరలు పెంచివేశారు. కాంప్లెక్స్ ఎరువులు ఏకంగా 50 కిలోల బస్తాకు సగటున రూ.250 పెరగనున్నాయి.
రాష్ట్రంలో వచ్చేనెల నుంచి కొత్తధరలకే ఎరువులు విక్రయించనున్నట్టు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రతిఏటా ఆర్ధిక సంవత్సరం ముగింపులో ఎరువుల దిగుబడికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు జరుగుతాయి. ఈ ఏడాది జరిగిన ఒప్పందాల మేరకే పెరిగిన ధరల ప్రకారం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల తయారీకి అవసరమైన పాస్పరిక్ యాసిడ్, అమ్మోనియా తదితర ముడిసరుకును ప్రధానంగా చైనా, సౌదీ అరేబియా దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పాస్పరిక్ యాసిడ్ టన్ను ధర 689 డాలర్లు నుంచి 795 డాలర్లకు పెరిగింది. అమ్మోనియా ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఎరువుల ధరలు పెంచక తప్పలేదని చెబుతున్నారు. డిఏపి టన్ను ధర రూ.25528 నుంచి రూ.30800 కు పెరగనుంది. టన్నుపైన ఏకంగా రూ.5275 పెరగనుంది. యూరియా మాత్రమే కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంది. ప్రస్తుతానికి యూరియా ధరలు పెంచలేదని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతూ రావటంతో ఆ మేరకు రసాయనిక ఎరువుల వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో డిఏపి 2.51 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 12.43 లక్షల టన్నులకు చేరింది. ఈ రబీ సీజన్ లోనే సాగులో ఉన్న పంటలకు 10 లక్షల టన్నుల యూరియా, 5 లక్షల టన్నుల డిఏపి అవసరం అని వ్యవసాయ అధికారుల అంచనానుబట్టి తెలుస్తోంది. పక్కచూపుల్లో ఎరువుల వ్యాపారం ధరల పెరుగుదల కారణంగా ఎరువుల వ్యాపారం పక్కచూపులు చూస్తోంది. రాష్ట్రంలో పలు చోట్ల ఎరువుల షాపుల వద్ద అప్పుడే నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంకా ఎరువుల ధరలు పెంచకపోయినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాకటలో పెరిగిన ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఎరువుల వ్యాపారులు ఇక్కడ ఉన్న నిల్వ ఎరువులను పొరుగు రాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Leave Your Comments

రిపోర్టు 2021 ప్రకారం ఏటా ఒక భారతీయుడు సగటున 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నాడని నివేదికలో వెల్లడి

Previous article

పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like