వార్తలు

గ్రీన్ కార్పెట్ గ్రాస్ .. గోల్డెన్ క్రాప్

0

పచ్చని గడ్డి నేలంతా పరచివుంటే మనసుకు ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ ఇస్తుంది. ఒకప్పుడు భారీ భవనాలు, పెద్ద పెద్ద హోటళ్లు, పార్కులకే, పరిమితమైనా ఇప్పుడు సాధారణ గృహాలు, ఫ్యాక్టరీల్లోనూ పచ్చదనం దర్శనమిస్తున్నది. అంతేకాకుండా దాన్ని పెంచే రైతుకు కూడా ఆర్థిక భరోసా వస్తుంది. తక్కువ పెట్టుబడితో పరిమిత శ్రమతో అద్భుతమైన లాభాలను అందిస్తున్నది. పచ్చదనాన్ని సృష్టించడం ఇప్పుడు క్షణాల్లో పని.. చాపలా పరిచేయవచ్చు. కాబట్టే కొరియన్ కార్పెట్ గ్రాస్ కు ఏడాదంతా భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేయడమూ తేలికే. చీడపీడల బెడద లేదు. క్రిమిసంహారక మందులేయాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా కొంత భూమి, కాస్తంత పెట్టుబడి మాత్రమే. అందుకే ఈ రకం గడ్డిని సాగు చేసేందుకు అనేకమంది మక్కువ చూపుతున్నారు.
కొరియన్ కార్పెట్ గ్రాస్ ను సాగుచేయడం ఎంతో తేలిక. భారీగా పెట్టుబడి అవసరం ఉండదు. మొదటిసారి పంట వేయాలంటే ఎకరానికి దాదాపు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. రెండోసారి ఎకరానికి రూ. 30 వేలు సరిపోతుంది. ఎందుకంటే తర్వాత కొత్తగా విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎకరానికి 30 వేలు పెట్టుబడి పెడితే, ఆరు నెలల తర్వాత రూ.2 లక్షల దాకా రాబడి పొందవచ్చు. కొరియన్ కార్పెట్ ను సాగు చేయమంటూ ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. దీన్ని “గోల్డెన్ క్రాప్” గా అభివర్ణిస్తున్నారు. కొరియన్ కార్పెట్ సాగు చేయడానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. కాబట్టి ఎకరానికంటే కొంత ఎక్కువ భూమిని ఎంచుకోవాలి. ముందుగా పొలాన్ని చదును చేసి కలియదున్నాలి. ఆ తర్వాత భూమిఅంతా తడిసేలా నీళ్లు పెట్టి, మరోసారి దున్నాలి. ఆ తర్వాత భూమి మొత్తం సమానంగా ఉండేలా చూసుకోవాలి. గడ్డిని విత్తడానికి ముందే పశువుల పేడను ఎరువుగా వేయాలి. తర్వాత గ్రోమోర్, డీఏపీ లాంటి రసాయన ఎరువులను వేసుకోవాలి. ఆపైన కొరియన్ గ్రాస్ మొక్కలను బాగా కడిగి, నాటు మాదిరిగా వేసుకోవాలి. ఈ పంట సాగుకు నీటి అవసరం కూడా ఎక్కువ ఉండదు. చలికాలం, వర్షా కాలంలో వారానికి రెండుసార్లు నీళ్లు పడితే చాలు. ఎండాకాలంలోనైతే రెండురోజులు ఒకసారి నీళ్లు పట్టాల్సి ఉంటుంది. రైతుకు సంతోషాన్నిచ్చే మరో విషయం ఏమిటంటే దీనికి చీడపీడల బెడద ఉండదు. చెదలు వచ్చే ప్రమాదం మాత్రం లేకపోలేదు. చెదలు నివారణకు “టిమెట్” మందులను కొడితే సరిపోతుంది. ఆరు నెలల తర్వాత పంట చేతికొస్తుంది. దీన్ని కటింగ్ మెషీన్ ద్వారా తీసి అమ్ముకోవడమే. మార్కెటింగ్ వ్యవస్థ కూడా బలంగానే వుంది. కొరియన్ కార్పెట్ గడ్డి రైతులకు మంచి లాభాలను అందిస్తుంది. ఆరు నెలల్లోనే పంట చేతికి వచ్చే వస్తుంది. ఎకరానికి దాదాపు 35 వేల షీట్ల కొరియన్ కార్పెట్ గ్రాస్ వస్తుంది. మార్కెట్ లో ఒక షీటు గడ్డిని నాణ్యతను బట్టి రూ. 6 నుంచి రూ.8 వరకూ అమ్ముకోవచ్చు. అంటే ఒక ఎకరం పంటకు రూ. 2 లక్షలకు పైగా ఆదాయం, పెట్టుబడి మాత్రం ఎకరానికి రూ.30 వేలే, ఇక రైతులే రవాణా చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా కొరియన్ కార్పెట్ గ్రాస్ కు భారీ డిమాండ్ ఉన్నది. మెట్రో నగరాల్లో స్టార్ హోటళ్లు, భారీ భవనాలు, పార్కులకు పచ్చదనమే ప్రాణం కాబట్టి వీటి వాడకం అనివార్యం. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల ప్రాంగణంలో 30 శాతం మేర పచ్చదనం ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉన్నది. ఫంక్షన్ హాళ్లు, ఏంటి పెరట్లతో పాటు ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాల్లోనూ గ్రీన్ కార్పెట్ వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో కొరియన్ గ్రాస్ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లోని “కొలన్” కుటుంబం దాదాపు 23 ఎకరాల్లో కొరియన్ కార్పెట్ గ్రాస్ ను సాగు చేస్తున్నది. అప్పట్లో బాలాపూర్ కు చెందిన ఓ రైతు దుబాయ్ నుంచి కొరియన్ కార్పెట్ గడ్డిని తీసుకొచ్చారు. ఆయన దగ్గర విత్తనాలు తీసుకొని వీళ్ళు సాగు ప్రారంభించారు. మంచి డిమాండ్, భారీ లాభాలు ఉండటంతో నేటికీ కొరియన్ గ్రాస్ సాగును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొలన్ తిరుపతి రెడ్డి 11 ఎకరాల్లో ఆయన సోదరులు మరో 12 ఎకరాల్లో పంట వేశారు. హైదరాబాద్ తో పాటు గోవా, మహారాష్ట్ర, నాగపూర్, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ గడ్డిని సరఫరా చేస్తున్నారు. నష్టభయంలేని రాబడిని కండ్ల చూడాలనుకునే రైతులకు ఇదో మంచి ఎంపిక.

Leave Your Comments

విటమిన్ బి12 లోపం వలన కలిగే నష్టాలు..

Previous article

Vegetable Cultivation: షేడ్ నెట్ లో ప్రోట్రేష్ ద్వారా కూరగాయల నారు పెంపకం.!

Next article

You may also like