Post-Harvest Safety Measures in Mango and Cashew: సాధారణంగా మామిడి, జీడి మామిడి తోటల్లో పూత ప్రారంభం అయినప్పటి నుంచి యాజమాన్య పద్ధతులు చేపట్టి రైతులు కోతలు పూర్తవగానే మళ్లీ వచ్చే సీజన్ వరకు తోటలను అశ్రద్ద చేస్తూ ఉంటారు. దీంతో తోటల్లో ఎండు పుల్లలు పెరిగి చీడపీడలు పెచ్చరిల్లుతాయి . అలా కాక కాపునిచ్చి అలసిన చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతిని ఇచ్చి తరువాత కొమ్మ కత్తిరింపు చేసి, సరైన పోషక, సస్యరక్షణ యాజమాన్యాన్ని చేపడితే వచ్చే సీజన్ కు చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తిని ఇస్తాయి.
కోత అనంతరం మామిడి, జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన చర్యలు గురించి తెలుసుకుందాం.
మన రాష్ట్రంలో మామిడి, జీడి మామిడి తోటలను చాలా విస్తారంగా సాగు చేస్తున్నారు. కోస్తా ప్రాంతంతో పాటు గిరిజన ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు.కోత అనంతరం తీసుకోవాల్సిన చర్యలలో మొదటగా నీటి వసతి ఉన్న చోట ఒక నీటి తడి ఇవ్వాలి దీని వలన ఏమిటంటే వేరుకుళ్ళు తెగులు ప్రత్యేకించి వేసవిలో బాగా వృద్ధి చెందుతుంది కాబట్టి నీటి తడి ఇచ్చిన వెంటనే ఆ వేరుకుళ్ళు తెగులు తాలూకు వుదృతిని తగ్గించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ మామిడి తోటలలో కస్కూట అనే పరన్నాజీవి చెట్ల మీద, కొమ్మలకు అనుకొని పెరుగుతూ, కొమ్మల నుండి పోషకాలను తీసుకోవటం వలన కొమ్మలు మొత్తం బాగా ఎండిపోతాయి.ఎక్కడైతే ఈ పరాన్నాజీవి కస్కూట ఉందో ఆ కొమ్మల ను కత్తిరించిన వెంటనే బోర్డియాక్స్ మిశ్రమం లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ గాని చెట్లపై పిచికారి చేసినట్లైతే ఆ కత్తిరించిన భాగాలలో ఏ రకమైన తెగుళ్ళు సోకకుండా చూసుకోవచ్చు.
అలాగే పిండినల్లి కూడా మామిడి తోటలలో ప్రధానమైన సమస్య. ఈ పిండినల్లి తో పాటు చీమలు కూడా రావటం వల్ల కాయలు కోయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.పిండినల్లి నివారణకు కోత అయిన తరువాత ప్రోఫెనొఫాస్
2 ml ఒక లీటరు నీటికి కలిపి చెట్లు బాగా తడిచెలా పిచికారి చేయాలి. తొలకరి వర్షాలు పడినప్పుడు అనగా జూన్ జూలై మాసాలలో వర్షాలు పడతాయి. తోటలు కోత అయిపోయిన తర్వాత తోటల మధ్య నిలువుగా, అడ్డంగా దున్నడం వలన కలుపు నియంత్రణ బాగా జరిగి, తగినంత తేమ మొక్కలకు అంది చెట్లు చిగురించి ఆరోగ్యంగా వుంటాయి. చెట్ల పాదులలో ఎండుగడ్డి గానీ, ఎండినటువంటి ఆకులు గాని, వరిపొట్టు గానీ, వేరుశనగ పొట్టు గానీ, కొబ్బరి పీచు వేసి మల్చింగ్ లా చేస్తే నేలలో తేమ సంరక్షిoన్చబడుతుంది. అలాగే కలుపు కూడా నివారించబడుతుంది.జూన్ జూలై మాసాలలో తొలకరి వర్షాలకు సిఫారసు చేసిన ఎరువులను వేసుకోవాలి.
Also Read: Vannamei Prawns: వర్షాకాలంలో వెన్నామీ రొయ్యల చెరువులలో జాగ్రత్తలు, చెరువుల తయారీ మరియు నీటి నాణ్యత
కాండం తొలిచే పురుగు ఆశించిన చెట్లు గమనిస్తే, ముఖ్యంగా ఎండు కొమ్మలను తొలగించి, చెట్టుపై రంధ్రాలు గమనిస్తే ఇనుపతీగ లోపలికి చొప్పించి లోపల వున్న పురుగును తీసివేసి రంధ్రాన్ని బంక మట్టితో కప్పాలి. ఈ విధంగా చేయడం వల్ల కాండం తొలిచే పురుగును సమర్ధవతంగా నివారించవచ్చు. ఎండు కొమ్మలను చెట్టు నుండి తొలగించి నాశనం చేయాలి.1-5 సo|| వయస్సు వున్న మామిడి , జీడి మామిడి తోటల్లో మద్యలో ఎక్కువగా ఖాళీ ప్రదేశం ఉంటుంది కాబట్టి పచ్చిరొట్ట ఎరువులను కూడా మద్యలో పెంచుకోవచ్చు. దీనికోసం జూన్ జూలై మాసాలలో ఈ పచ్చిరొట్ట ఎరువులైన జనుము లాంటివి వేసుకుని 60 రోజులు అప్పుడు అనగా పూత దశలో కలియ దున్నినట్లైతే నేల సారాన్ని పెంచవచ్చు. అలాగే చెట్లు కూడా బాగా పెరిగే అవకాశం కలదు.
ఎండు కొమ్మలు, భూమికి దగ్గరగా ఉన్న కొమ్మలు, అదేవిధంగా ఇతర చెట్లపైకి వెళ్లిన కొమ్మలును జాగ్రతగా కత్తిరించి, కత్తిరించిన భాగాలలో బోర్డో పేస్ట్ గాని,మాంకోజెబ్ పేస్ట్ గాని పుయాలి.బోర్డియాక్స్ మిశ్రమం లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ గాని చెట్లపై పిచికారి చేసినట్లైతే ఆ కత్తిరించిన భాగాలలో ఏ రకమైన తెగుళ్ళు సోకకుండా చూసుకోవచ్చు. అధికంగా ఉన్న కొమ్మలను కత్తిరించడం వలన సూర్యరశ్మి , గాలి బాగా సోకి క్రొత్త కొమ్మలు వచ్చి పూత కూడా బాగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.
Also Read: Kharif Rice Cultivation: ఖరీఫ్ వరి నారుమడి యాజమాన్యం, తయారీలో మెళకువలు.!