Selection and Sowing of Seeds: తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలం దాదాపుగా కోటి ఇరువై లక్షల ఎకరాలలో వివిధ వ్యవసాయ పంటలు సాగు అవుతాయి. అందులో ప్రధానంగా ప్రత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు వంటి పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతాయి. కావున రైతులు విత్తనాలు ఎంపిక చేసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. లేనట్లైతే పంటలకు చీడపీడలు, తెగుళ్ళు సోకి దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.
నాణ్యమైన విత్తనాల ఎంపిక :
విత్తనం మంచి సైజు కల్గి, అన్ని గింజలు ఒకే ఆకారంలో ఉండాలి. మంచి బీజగర్భం కలిగి, మొలకెత్తే శక్తిని అధికంగా కలిగి ఉండాలి. విత్తనాలు పరిశుభ్రంగా ఉండి కలుపు మొక్కల విత్తనాలు, ఇతర పంటల విత్తనాలు లేకుండా ఉండాలి. చీడపీడల రహితమై నాణ్యమైనదన్నట్లుగా ఉండాలి. మొలకెత్తే శక్తి ఎంతకాలం ఉన్నదో చీటి పైన వ్రాసి ఉన్నది లేనిది కూడా రైతులు గమనించాలి. నాణ్యమైన విత్తనాలకు ప్రధానంగా నాలుగు లక్షణాలు ఉంటాయి.
జన్యుస్వచ్ఛత :
ఒక స్వచ్ఛమైన రకం వేసి 100 శాతం అదే విత్తనం పొందడాన్ని జన్యుస్వచ్ఛత అంటారు. విత్తన రకానికి ఉండాల్సిన సహజమైన ప్రత్యేక లక్షణాల్ని కలిగి ఉండాలి. ఆ విత్తనం సాగుచేసినప్పుడు అదే రకమైన పంట రావాలి.
భౌతికస్వచ్ఛత :
విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండాలి. తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. మట్టిబెడ్డలు, ఇసుక, దుమ్ము, పంట వ్యర్ధాలు మొదలైన జడ పదార్ధాలు ఉండకూడదు. కలుపు విత్తనాలు, వేరే రకాల విత్తనాలు ఉండకూడదు.
Also Read: Vermiwash: వర్మీవాష్ తయారీ మరియు వ్యవసాయంలో వర్మీవాష్ యొక్క ప్రాముఖ్యత
తేమశాతం :
12-13 శాతం తేమ ఉన్నపుడు విత్తనం బాగా మొలకెత్తుతుంది. 14 శాతానికి మించి ఉంటే నిల్వ చేయడానికి పనికి రాదు.
మొలక శాతం : ప్రతి పంట విత్తనములో కనీస మొలక శాతము ఉండాలి. వరిలో 80%, మొక్కజొన్నలో 90%, ప్రత్తిలో 65%, నువ్వుల్లో 80 %, జొన్నలో 75%, పప్పు ధాన్యాల్లో 75 %, పొద్దు తిరుగుడు, ఉల్లిలో 70 %, మిరపలో 60 % కనీస మొలక శాతం ఉండాలి.
విత్తన వర్గీకరణ :
రైతులకు మంచి విత్తనాలను మంచి ప్రమాణాలతో ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది. విత్తనాలను నాలుగు తరగతులుగా వర్గీకరించవచ్చు.
ప్రజననకారుని విత్తనం : విత్తనం రూపొందించిన పరిశోధనా స్థానంలోనే శాస్త్రజ్ఞులు పర్యవేక్షణలోఉత్పత్తి చేస్తారు. జన్యుస్వచ్ఛత 100 శాతం ఉంటుంది. విత్తనపు సంచులకు పసుపురంగు ట్యాగ్ ఉంటుంది.
పునాది విత్తనం :
బ్రీడరు విత్తనము నుండి పరిశోధనాస్ధానాలలోను, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విత్తనాభివృద్ధి క్షేత్రాలను సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఇవి కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. విత్తనపు సంచులకు తెలుపురంగు ట్యాగ్ ఉంటుంది. జన్యుస్వచ్ఛత 99.5 శాతం ఉంటుంది.
ధృవీకరణ విత్తనం :
ఈ విత్తనం పునాది విత్తనం నుండి రైతుల పొలాల్లో సీడ్ సర్టిఫికేషన్ సంస్థ వారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడినవి. ప్రయోగశాలలో పరీక్షించి నిర్దేశించిన ప్రమాణాలు కలిగిన వాటికి ధృవీకరణ విత్తనం (సర్టిఫైడ్సీడ్) లేబుల్ ఇస్తారు. దీనికి నీలిరంగు ట్యాగ్ ఉంటుంది. జన్యుస్వచ్ఛత 99 శాతం ఉంటుంది
సత్య ప్రమాణ పూర్వక చీటి గల విత్తనం :
మార్కెట్లో ఈ తరగతికి చెందిన విత్తనాలు కూడ లభ్యమవుతాయి. ఉత్పత్తిదారులు స్వంతపూచీతో సత్య ప్రమాణ పూర్వక చీటి గల విత్తనము అనే ట్యాగ్ వేసి మార్కెట్లో పలు రకాల వంగడాలు, హైబ్రీడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి లేత ఆకుపచ్చ రంగు ట్యాగ్ కడతారు. ఇవి విత్తన ధృవీకరణ కిందకు రావు. ఉత్పత్తి దారునిపై నమ్మకంతో కొనాల్సి ఉంటుంది.
విత్తన ఎంపిక మరియు కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. పంట దిగుబడి నాణ్యమైన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. కనుక విత్తనం ఎంపిక, కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి.
. రైతు తన అనుభవాన్నిబట్టి లేదా ఆ ప్రాంతపు వ్యవసాయాభివృద్ధి అధికారిని సంప్రదించి అనువైన రకాన్ని ఎంచుకొని విత్తనం కొనాలి.
. 3 సంవత్సరాల కొకసారి తమ వద్ద విత్తనాన్ని మార్చి ధృవీకరించిన విత్తనం వాడాలి.
. విత్తనాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ స్టాల్ నుండి లేదా గుర్తింపు పొందిన, లైసెన్సు పొందిన అధికృత డీలరు నుండి కొనాలి.
. విత్తనం కొనేటప్పుడు దానికి ఉన్న ట్యాగ్ రంగుతో పాటు లాట్ నెంబరు, రకము, తేదీలు చూసుకోవాలి.
. విత్తనానికి నిర్దేశించిన శాతం మొలకెత్తే గుణం ఉండాలి.
. విత్తనం గట్టితనం కలిగి మంచి రంగు కలిగి ఉండాలి.
. చిన్న దబ్బనంతో సంచికి రంధ్రం వేసి గింజలు తీసి మొలకశాతం పరీక్షించుకొని తర్వాత పొలంలో విత్తుకోవాలి.
. విత్తన ఉత్పత్తిదారులు శాస్త్రజ్ఞులు లేదా వ్యవసాయాధికారులు తెలిపిన నిర్వహణ పద్ధతులు పాటించాలి.
. విత్తన డీలరు నుండి బ్రాండ్ పేరు, లాట్ నెంబరు, ధర, రైతు చిరునామా, సంతకం, డీలరు సంతకంతో బిల్లు తీసుకొని పంట కాలం పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలి.
. నాణ్యత లోపం గుర్తిస్తే పరిహారం చెల్లిస్తాము, అవగాహన ఒప్పందంలో చేరిన కంపెనీ డీలరు వద్ద నుండి విత్తనం కొనుగోలు చేయాలి.
నాణ్యమైన విత్తనాలు ధృవీకరణ పొందిన సంస్థల నుంచి పొందవచ్చు.
అవి –
1. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ.
2. జాతీయ విత్తన సంస్థ.
3. వ్యవసాయ విశ్వవిద్యాలయం.
4. రాష్ట్రీయ విత్తన ధృవీకరణ సంస్థచే ధృవీకరించబడి, నీలి పత్రము కలిగి ఉన్న వివిధ ప్రైవేటు విత్తన కంపెనీల నుండి పొందవచ్చు.
Also Read: Monsoon Cultivation: వర్షాకాల సాగుకి సూచనలు.!