Monsoon Cultivation: వ్యవసాయం పూర్తిగా వర్షాధారం పైన ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాకాలం సాగు త్వరలోనే ప్రారంభమవుతుంది. అందువలన రైతులు గత సంవత్సరం వ్యవసాయంలో ఎదుర్కొన్న సమస్యలను అవగాహన చేసుకుని ఈ సంవత్సరం అటువంటి సమస్యలు ఎదురైనట్లయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా సాగుకు సన్నాహాలు చేసుకోవాలి.
ముందుగా నేలను బట్టి, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఎంపిక చేసుకున్న పంటలలో అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవడంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. వీలైనంతవరకు పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. రైతులు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషమేమంటే, వ్యవసాయ ప్రణాళికలను ఎవరికి వారు అనుగుణంగా తయారు చేసుకోవాలి. ప్రతి సారి వేరే రైతులను అనుసరించకూడదు.
. ముందుగా వీలైనంత సేంద్రియ ఎరువులు వేసి నేలను సారవంతం చేసుకోవాలి.
. చౌడు స్వభావం లేని చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవాలి.
. పశువుల ఎరువు ,వర్మీ కంపోస్ట్, కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువును తప్పకుండా పొలంలో వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల పంటకి కావలసిన స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి.
. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు ఆ నీటిని సద్వినియోగం చేసుకొని వేసవిలో పచ్చి రొట్ట పంటలైన (జీలుగ /పెసర / జనుము) వేసి అవి పూత దశకు చేరుకునే ముందు రోటావేటర్ సహాయంతో నేలలో కలిసే విధంగా కలియదున్నినట్లయితే నేల యొక్క చౌడు స్వభావం కొంత వరకు తగ్గి నేల సారం పెరుగుతుంది.
పంటల ఎన్నిక : ఏక పంట సాగుకి బదులు (బహుళ పంటలు) పలు పంటలను సాగు చేయాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 3-4 స్వల్పకాలిక పంటలు పండిరచుకోవడం ఉత్తమం. అదేవిధంగా తక్కువ కాలపరిమితి, తక్కువ పెట్టుబడి అవసరమున్న పంటలను ఎన్నుకోవాలి.
. రైతులు అంతర పంటల సాగు చేసినట్లయితే రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంట సాగు చేయడం వల్ల నేలసారం తగ్గడంతో పాటు, ఆ పంటను ఆశించే చీడపీడల ఉదృతి అధికమగును. కావున రైతులు తప్పనిసరిగా పంట మార్పిడిని అవలంభించాలి.
. ఎండాకాలంలో పొలంఖాళీగా ఉంటుంది కావున రైతులు మట్టి నమూనా సేకరించి భూసార పరీక్షలు చేయించాలి. భూసార పరీక్ష ఫలితాల అనుగుణంగా ఎరువుల మోతాదును తెలుసుకొని వాడాలి.
. భవిష్యత్తు వాతావరణ సూచనలు, ముందస్తు వర్ష సూచనలు తెలుసుకొని సాగుకి సన్నదం కావాలి. సాగు సమాచారం కొరకు తరచుగా కిసాన్ కాల్ సెంటర్ లేదా మండల వ్యవసాయ అధికారులను, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా ఏరువాక కేంద్రాలను లేదా కృషి విజ్ఞాన కేంద్రం లేదా వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సంప్రదించాలి.
. రైతులు విత్తనాలను అధీకృత డీలర్లు మరియు ధృవీకరించబడిన విత్తన కంపెనీల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే తప్పనిసరిగా రశీదు తీసుకొని పంటకాలం పూర్తి అయ్యేవరకు దానిని భద్రపరచుకోవాలి.
. ప్రతి పంటను విత్తుకునే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. ఇలా చేసినట్లయితే పంటలకు తొలి దశలో ఆశించే వివిధ రకాల చీడపీడల మరియు తెగుళ్ల బారి నుండి పంటను కాపాడవచ్చు
. సమగ్ర వ్యవసాయంలో భాగంగా పందిరి కూరగాయలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం,పెరటి కోళ్ళు పెంపకం, పాడిగేదెల పెంపకం మొదలగునవి చేపట్టాలి.
ఈ విధంగా రైతులు సరైన ప్రణాళికలను వర్షాకాలం ముందుగా రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం సాగు చేపడుతూ పంటలపై పెట్టుబడిని తగ్గించుకొని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచుకున్నట్లయితే రైతులకు కొంత వరకు అదనపు ఆదాయం చేకూరుతుంది.
Also Read: ఖరీఫ్ పంటలకు రుతుపవనాలు పుష్కలం