Minister Niranjan Reddy: నేడు తెలంగాణా సుస్థిర వ్యవసాయానికి ఆనవాలుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుబంధు, రైతు భీమా, సాగునీరు, నిరంతర విద్యుత్తు, మిషన్ కాకతీయ, వంటి ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు దినోత్సవం సందర్భంగా సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సుమారు 58 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. రైతుబంధు వంటి ప్రోత్సాహకాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి, భూమికి విడదీయరాని బంధం ఉందన్నారు. భూమికోసం సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణదని మంత్రి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం చిద్రమైందన్నారు. అందుకే వ్యవసాయం, నీళ్ల కేంద్రంగా ఏళ్ళ పాటు ఉద్యమాలు సాగాయని వివరించారు. వీటన్నింటిలోనూ ప్రత్యేక సంబంధం ఉన్న KCR ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం అభివృద్ధి కోసం ఇన్ని కార్యక్రమాలు చేపట్టారన్నారు. తనకి చిన్నప్పుడు రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో చదవాలన్న కోరిక ఉండేదని కానీ అప్పుడు సీటు రాలేదన్నారు. ఇప్పుడు మంత్రి హోదాలో విశ్వవిద్యాలయానికి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందన్నారు. వ్యవసాయం కేంద్రంగా తీసుకుంటున్న చర్యల వల్ల నేడు తెలంగాణలో సామాజిక పరివర్తన సాధ్యమైందని నిరంజన్ రెడ్డి వివరించారు.
ఒకనాడు నెర్రెలు పాచిన తెలంగాణలో నేడు వ్యవసాయపరంగా సంబరాలు చేసుకోవడం హర్షనీయం అని TSPSC మాజీ చైర్మన్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు, వ్యవసాయం చుట్టూ తిరిగిందన్నారు. గొలుసుకట్టు చెరువులతో అలరాడిన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయయం దారి తప్పిందన్నారు. కరువు నిత్యకృత్యంగా ఉండేదని అన్నారు.
రైతాంగం అవసరాలు తీర్చడంలో కాలేశ్వరం ప్రాజెక్టుది కీలక భూమిక అని చక్రపాణి అభిప్రాయపడ్డారు. ఒకనాడు మూడేళ్లకోసారి కూడా పంటలు పండని భూముల్లో నేడు మూడు పంటలు పండడం అభినందనీయం అన్నారు. భావితరాలకు కూడా విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని చక్రపాణి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
Also Read: Spirulina: మట్టి అవసరం లేకుండా ఎండలో పెరిగే స్పిరులినా సాగు..
ఒకనాడు భూగర్భ జలాల కోసం ఎన్నో అడుగులు బోర్లు వేసి, వచ్చీరాని కరెంట్ తో తెలంగాణ రైతాంగం చాలా ఇబ్బంది పడేదని వ్యవసాయ శాఖ కార్యదర్శి PJTSAU ఇన్చార్జి ఉపకులపతి ఎం. రఘునందన్ రావు IAS అన్నారు. కానీ ఈ పదేళ్లలో తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశంలోనే రాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందని అన్నారు. సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలలో తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ఉందని తెలిపారు. సాగునీరు, రైతుబంధు, రైతు బీమా, విస్తరణ, గోదాంల నిర్మాణం, పంటల కొనుగోలు తదితర అంశాలలో ఈ పదేళ్లలో సాధించిన అభివృద్ధిని గణాంకాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ప్రతి 5 ఎకరాలకి ఒక AEO ని నియమించి, రైతు వేదికలని నిర్మించామన్నారు. నేడు రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రఘునందన్ రావు వివరించారు.
ఈ సందర్భంగా కొందరు రైతులు, విద్యార్థులు గత పదేళ్లలో వ్యవసాయ రంగం సాధించిన అభివృద్ధి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ హనుమంత రావు, ఆయిల్ పామ్ సలహాదారు శ్రీనివాసరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, PJTSAU ఇన్చార్జి రిజిస్ట్రార్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.