Seed Mela 2023: తెలంగాణాని ప్రపంచానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికీ రాష్ట్రం కొన్ని రకాల విత్తనాల్ని దిగుమతి చేసుకుంటున్నదని భవిష్యత్తులో దీన్ని అధిగమించాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ లో నిర్వహించిన “విత్తన మేళా – 2023” ని ఆయన ప్రారంభించారు. కొందరు రైతులకి లాంఛనంగా విత్తనాలు అందించారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తున్నదన్నారు.
సాగునీటి వసతి పెద్ద స్థాయిలో కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణ అంతట నీళ్ళే కనపడుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతం విత్తనోత్పత్తికి చాలా అనుకూలమైందన్నారు. రైతాంగం ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణలో తయారయ్యే విత్తనాలకి ఇతర ప్రాంతాల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు. భవిష్యత్ లో తెలంగాణ ప్రపంచానికంతటికి విత్తనాలు సరఫరా చేసే స్థితికి చేరుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు. అదేవిధంగా పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా భూవనరులు పెరగవన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తదనగుణంగా పరిమిత భూవనరుల్లోనే అధునాతన టెక్నాలజీలని వినియోగించి, భూసారాన్ని పరిరక్షిస్తూనే అధిక ఉత్పత్తి, ఉత్పాదకతలను సాధించాలన్నారు.
Also Read: Narendra Singh Tomar: భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది – కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
అదేవిధంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగం తగ్గించి భూసారాన్ని పరిరక్షించాలని మంత్రి సూచించారు. ఈ విషయాలపై శాస్త్రవేత్తలు రైతులకి నిరంతరమూ అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పశుపోషణకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ల ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టిందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ విత్తన మేళా లో PJTSAU తో పాటు ICAR, అనేక జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థలు, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి.
రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రదర్శనల్ని తిలకించి విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర విత్తన సంస్థ కార్పోరేషన్ చైర్మన్ కొండ బాల కోటేశ్వర రావు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ K. హనుమంతు, IAS, PJTSAU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, విత్తన సంచాలకులు డాక్టర్ పి. జగన్ మోహన్ రావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వంగడాలపై విశ్వవిద్యాలయం రూపొందించిన అనేక కరపత్రాలని మంత్రి విడుదల చేశారు.
Also Read: Telangana Rice Varieties: తెలంగాణలో పండిరచడానికి అనువైన వరి రకాలు- వాటి దిగుబడులు`ఇతర లక్షణాలు.!