ఉద్యానశోభ

బెండ సాగులో మెళుకువలు..

0

రానున్న వేసవిలో కూరగాయల కొరత ఉండే అవకాశం ఉంది. దానిని అధిగమించడానికి బెండ సాగు ముఖ్యం.
వాతావరణం:
బెండ పంట సాగుకు వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. ఈ పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది.
నేలలు :
సారవంతమైన నీరు ఇంకేటి తేలికపాటి నేలలు, మురుగు నీరుపోయే సౌకర్యం గల నల్లరేగడి నేలలు అనుకూలం.
విత్తే సమయం:
వర్షాకాలపు పంటను జూన్ నుంచి జులై వరకు, వేసవి పంటను జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తనాలు విత్తుకోవచ్చు.
విత్తన రకాలు:
పర్బాని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయం ఈ రకాలు 85 – 90 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి. సంకర కోవకు చెందిన వర్ష, విజయ్, నాధశోభ, ప్రియా, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య తదితర రకాలను కూడా సాగుచేసుకోవచ్చు.

విత్తన మోతాదు:
వేసవి పంటకు 7 -8 కిలోలు, సంకర జాతి రకాలకు 2 – 2.5 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తన శుద్ధి:
కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తర్వాత 4గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తనశుద్ధి చేయాలి.

విత్తే పద్ధతి :
నేలను 4 – 5 సార్లు బాగా దున్నాలి. వేసవి కాలపు పంటను నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ దూరం వుండే విధంగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరుపెట్టి తరువాత 4 – 5 రోజులకు రెండో తడి ఇవ్వాలి. పాదుకు ఒక మొక్క ఉంచి మిగిలినవి తీసివేయాలి.

ఎరువుల యాజమాన్యం:
చివరి దుక్కిలో ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నత్రజని ఎరువులు మూడు సమభాగాలుగా చేసి మూడవ వంతు ఆఖరి దుక్కిలో మిగిలిన రెండవ వంతును 2 భాగాలుగా విత్తిన 30 వ, 45 వ రోజున వేయాలి.
కలుపు నివారణ:
పెండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.2 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. విత్తిన 25, 30 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. అలాగే లీటరు నీటికి 5 మి. గ్రాములు సూక్ష్మపోషక పదార్థాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.
నీటి యాజమాన్యం:
వేసవి పంటకు ప్రతి 4 – 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి.
దిగుబడి:
నాలుగు టన్నుల నుంచి 5 టన్నులు ఎకరానికి పంట దిగుబడి వస్తుంది.

Leave Your Comments

సూక్ష్మ సేద్యం చేపట్టాలనుకునే రైతులకు ఊరట..

Previous article

పనస పండు తింటే కలిగే లాభాలు..

Next article

You may also like