Maruteru Rice Varieties: మన దేశంలో సాగుచేసే ఆహారధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను దేశంలో సుమారుగా 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25.5 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతున్నాయి. ఈ పంట మన రాష్ట్రంలో సుమారు 131 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు హెక్టారుకు 5.13 టన్నుల ఉత్పాదకత కలిగిఉంది. వరి పరిశోధనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది.
ఈ పరిశోధనా స్థానం నుండి నుండి 2022 వ సంవత్సరం వరకు 66 రకాలు మరియు 2 హైబ్రిడ్లు విడుదల చేయబడ్డాయి. ఈ రకాలలో ఎం.టి.యు. 7029 (స్వర్ణ), ఎం.టి.యు. 1001 (విజేత), ఎం.టి.యు. 1010 (కాటన్ దొరసన్నాలు) రకాలు మెగా రైస్ వెరైటీస్‌గా ప్రాచుర్యం పొంది దేశవ్యాప్తంగా సాగుచేయ బడుతున్నాయి. తదుపరి విడుదలైన ఎం.టి.యు. 1061 (ఇంద్ర), ఎం.టి.యు. 1064 (అమర), ఎం.టి.యు. 1121 (శ్రీధృతి), ఎం.టి.యు. 1153 (చంద్ర), ఎం.టి.యు. 1156 (తరంగిణి), ఎం.టి.యు. 1224 (మారుటేరు సాంబ) ఎం.టి.యు. 1262 (మారుటేరు మషూరి), యం. టి. యు రైస్ 1318 రకాలు కూడా రైతుల మన్ననలు పొంది అధిక విస్తీర్ణంలో సాగుచేయబడుతున్నాయి.
మారిన కాలమాన పరిస్థితుల కారణంగా ప్రస్తుతం రైతులు, అధిక దిగుబడినిస్తూ, చీడ పీడలను, చౌడును, ముంపును తట్టుకుంటూ, గింజ రాలిక తక్కువగా ఉండే, పడిపోని రకాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. అంతే కాక పచ్చిబియ్యానికి అనువుగా ఉంటూ, పొట్ట తెలుపు లేకుండా, అధిక బియ్యం రికవరి ఉండే రకాలకు మార్కెట్ అధికంగా ఉండటం వల్ల, అటువంటి రకాల రూపకల్పనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీకారం చుట్టింది.
ఈ విశ్వ విద్యాలయం నుండి విడుదలైన వరి రకాలు దేశంలోనే అధిక విస్తీర్ణం సాగుచేయబడుతూ రైతు సోదరులకు ఆర్థిక పరిపుష్టిని కలుగజేస్తున్నాయి. ఇక్కడి నుండి విడుదల చేయబడ్డ వరి రకాలు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 85.05 % విస్తీర్ణంలోనూ, మహారాష్ట్ర లో 11.34% విస్తీర్ణం లోనూ, ఒడిశాలో 8.45% విస్తీర్ణంలోనూ, తమిళనాడు లో 7.95%, పశ్చిమ బెంగాల్‌లో 6.3% విస్తీర్ణంలోనూ, కర్ణాటకలో 6.26% విస్తీర్ణంలోనూ, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4.17% విస్తీర్ణంలోనూ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2.55% విస్తీర్ణంలోనూ సాగుచేయబడుతూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయి.

Maruteru Rice Varieties
అధిక విస్తీర్ణంలో సాగవుతున్న రకాల గుణగణాలు :
1. ఎం.టి.యు`1010 (కాటన్ దొర సన్నాలు) : ఈ రకం 1999వ సంవత్సరంలో విడుదలచేయబడి ప్రస్తుతం 3.2 మిల్లియన్ హెక్టార్లలో భారత దేశంలో సాగుచేయబడుతుంది. ఈ రకం సాగు వల్ల ప్రతి ఏటా దేశానికి 13,700 కోట్ల రూపాయలు ఆదాయం చేకూరుతుంది. ఈ మొత్తంలో 652 కోట్ల రూపాయల అదనపు ఆదాయం దేశ రైతులకు చేకూరుతుంది. దీని పంటకాలం 120 రోజులు. సగటు దిగుబడి హెక్టారుకు 7.5 టన్నులు. గింజ సన్నగా పొడవుగా ఉండి, ఎగుమతులకు అనువుగా ఉంటుంది. సుడిదోమ, అగ్గి తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది.
2. శ్రీధృతి (ఎం.టి.యు`1121) : 2015 వ సంవత్సరంలో విడుదల చేయబడిన ఈ రకం మన రాష్ట్రంలో ముఖ్యమైన స్వల్పకాలిక రకంగా గుర్తింపు తెచ్చుకొని, 5.0 లక్షల హెక్టార్లలో ప్రధానంగా దాళ్వాలో ఉభయ గోదావరి జిల్లాలు మరియు సార్వాలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో సాగులో ఉంది. దీని పంటకాలం 125 రోజులు. గింజ మధ్యస్థ సన్నం అన్నానికి బావుంటుంది. నేరుగా విత్తే విధానానికి అనువైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. సగటు దిగుబడి హెక్టారుకు 7.5 టన్నులు. దోమపోటు మరియు అగ్గి తెగులును తట్టుకుంటుంది.
2015`16 వ సంవత్సరంలో ఎం.టి.యు`1156 మరియు ఎం.టి.యు`1153 అనే రెండు రకాలు స్వల్పకాలిక విభాగం క్రింద విడుదల చేయబడి, సాలీన 200 క్వింటాళ్ళ బ్రీడర్ విత్తన ఇండెంట్లతో బాసుమతియేతర వరి రకాల విభాగం కింద ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఈ రకాలు ఎక్కువగా ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎక్కువగా సాగుచేయబడుతూ రైతులకు అధిక ఆదాయాన్ని చేకూరుస్తున్నాయి.
3.తరంగిణి (ఎం.టి.యు`1156) : పంటకాలం 120 రోజులు. గింజ సన్నగా పొడవుగా ఉండి ఎగుమతులకు అనువుగా ఉంటుంది. కాండం ధృడంగా ఉండి చేనుపై పడిపోదు. నేరుగా విత్తే పద్దతికి అనువైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. సగటు దిగుబడి హెక్టారుకు 7.0 టన్నులు. దోమపోటు మరియు అగ్గి తెగులును తట్టుకుంటుంది.
4. చంద్ర (ఎం.టి.యు`1153) : పంటకాలం 115 రోజులు. గింజ పొడవుగా, లావుగా ఉంటుంది. బియ్యం పొట్ట తెలుపు లేకుండా పారదర్శకంగా ఉండి, గింజ రాలిక తక్కువగా ఉంటుంది. సగటు దిగుబడి హెక్టార్ల 7.0 టన్నులు. దోమపోటు మరియు అగ్గి తెగులును తట్టుకుంటుంది.
5. ఎం.టి.యు. రైస్ 1273 మరియు ఎం.టి.యు. రైస్ 1293 : 2022వ సంవత్సరంలో, కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా అఖిల భారత స్థాయిలో సాగుకొరకు విడుదల చేయబడిన రకములు రెండు రకాలు జీవ సాంకేతిక పరిజ్ఞాన పద్ధతి ద్వారా ప్రాచుర్యంలో ఉన్న ఎం.టి.యు. 1010 రకంతో ఎఫ్. ఎల్ 478 రకాన్ని సంకరపరచి, బ్యాక్ క్రాస్ బ్రీడిరగ్ పద్దతిలో రూపొందించబడ్డాయి. ఎం.టి.యు 1273 రకం 120 రోజుల కాల పరిమితి కలిగి, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో సాగుకొరకు విడుదలచేయబడినది. బియ్యం పారదర్శకంగా ఉండి, గింజ రాలిక తక్కువగా ఉంటుంది. అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.సగటున హెక్టారుకు 6.0 నుండి 6.5టన్నులు దిగుబడి సామర్ధ్యం కలిగిన రకము.
ఎం.టి.యు. రైస్ 1293 రకం 120 రోజుల కాల పరిమితి కలిగి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సాగుకొరకు విడుదలచేయబడిన రకము. సన్న గింజ నాణ్యత కలిగి చౌడుభూముల్లో సాగుకు అనుకూలం. అగ్గి తెగులు, పొట్ట కుళ్ళు,తుంగ్రో వైరస్ మరియు ఆకు మచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది. గింజ పొడవుగా సన్నగా ఉండి, పొడవు వెడల్పు నిష్పత్తి 3.18 ఉంటుంది. సగటుదిగుబడి సాధారణ పరిస్థితులలోహెక్టారుకు 5.6 %–% 6.0 టన్నులు, అదే చౌడుభూముల్లో సాగుచేసినప్పుడు హెక్టారుకు 3.0 నుండి 3.4టన్నులు. రెండు రకాలు బాసుమతియేతర వరి విభాగం కింద ఇతర దేశాలకు ఎగుమతికి అనువైన రకాలు.
6. ఎం.టి.యు`1001 (విజేత) : ఈ రకం 1995వ సంవత్సరంలో విడుదలచేయబడి ప్రస్తుతం 1.3 మిల్లియన్ హెక్టార్లలో భారత దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో సాగుచేయబడుతుంది. ఈ రకం సాగు వల్ల ప్రతి ఏటా దేశానికి 5,400 కోట్ల రూపాయలు ఆదాయం చేకూరుతుంది. దీని పంటకాలం సార్వాలో 135 రోజులు, దాళ్వాలో 125 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. సగటు దిగుబడి హెక్టారుకు సార్వాలో 6.25 టన్నులు, దాళ్వాలో 8.0 టన్నులు. ఈ రకం మొత్తం వరి ఆదాయంలో 2.89 % వాటా కలిగి ఉంది. అగ్గి తెగులు మరియు సుడి దోమలను బాగా తట్టుకుంటుంది. దీనికి ఆరు వారాల నిద్రావస్థ కలిగి కోత సమయంలో వర్షాలు పడినా గింజ మొలకెత్తదు.
7. ఎం.టి.యు`3626 (ప్రభాత్) : ప్రాంతీయ రైతులు బొండాలు అని పిలిచే ఈ రకం 1976వ సంవత్సరంలో విడుదల చేయబడి, 130 రోజుల పంటకాలం కలుగి ఉంటుంది. ఈ రకం తూర్పు గోదావరి జిల్లాలో 1.0 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతూ కేరళ రాష్ట్రానికి ఎగుమతి చేయబడుతుంది. దీని సగటు దిగుబడి హెక్టారుకు సార్వాలో 6.25 టన్నులు మరియు దాళ్వాలో 8.0 టన్నులు. ముతక బియ్యం గింజ లావుగా ఉండి ఉప్పుడు బియ్యానికి అనువుగా ఉంటుంది. చేను పై పడిపోదు. అగ్గితెగులును తట్టుకుంటుంది.
8. పుష్యమి (ఎం.టి.యు`1075) : ఈ రకం పశ్చిమ బెంగాల్‌లో 30 వేల హెక్టార్లలో, ఒడిశాలో 50 వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ అధిక దిగుబడినిస్తుంది. 2008 వ సంవత్సరంలో విడుదల చేయబడిన ఈ రకం 135 రోజుల పంటకాలం కలిగి, అగ్గితెగులు, దోమ పోటును తట్టుకుంటుంది. సన్న బియ్యం, చేను పడిపోదు. దిగుబడి హెక్టారుకు 6.25 టన్నుల దిగుబడినిస్తుంది.
9. శ్రావణి (ఎం.టి.యు 1239) : 2019 వ సంవత్సరంలో విడుదల చేయబడిన ఈ రకం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 1.30 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతున్నది. పంటకాలం 140 రోజులు. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉండి దోమపోటును తట్టుకుంటుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. సగటు దిగుబడి హెక్టారుకు 7.0 టన్నులు.
10. సుజాత (ఎం.టి.యు`1210) : ఈ రకం తెలంగాణా రాష్ట్రంలో 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలోనూ, పశ్చిమ బెంగాల్‌లో 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, ఒడిశా రాష్ట్రంలో 50 వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ మిక్కిలి ప్రాచుర్యం పొందింది. దీని పంటకాలం 125 రోజులు. గింజ మధ్యస్థ సన్నం. కాండం ధృడంగా ఉండి చేనుపై పడిపోదు. నేరుగా విత్తే విధానానికి అనువైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. సగటు దిగుబడి హెక్టారుకు 7.0 టన్నులు. దోమపోటు మరియు అగ్గి తెగులును తట్టుకుంటుంది.
Also Read: Tikka Leafspot in Rabi Groundnut: రబీ వేరుశనగలో ‘‘తిక్కాకు మచ్చ’’ తెగుళ్ల యాజమాన్యం

Mtu-1282 Paddy Seeds
11. ఎం.టి.యు. రైస్ 1310 : ఎం.టి.యు. 1075 మరియు సి. ఆర్ 3598-1-4-2-1 రకాల సంకరం ద్వారా రూపొందించబడిన రకం. 135`140 రోజుల కాల పరిమితి కలిగి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మరియు పుదుచెరి రాష్ట్రాలలో సాగుకొరకు విడుదలచేయబడిన రకము. అగ్గి తెగులుమరియు మెడవిరుపు తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున హెక్టారుకు 7.0 నుండి 7.5టన్నులు దిగుబడి సామర్ధ్యం కలిగిన రకము.
12. ఎం.టి.యు. రైస్ 1321 : ఎం.టి.యు. 5249 మరియు ఐ. ఆర్ 72 రకాల సంకరం ద్వారా రూపొందించబడిన రకము. 135 `140 రోజుల కాల పరిమితి కలిగి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మరియు పుదుచెరి రాష్ట్రాలలో సాగుకొరకు విడుదలచేయబడిన రకము. అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 6.5 నుండి 7.0 టన్నులు దిగుబడి సామర్ధ్యం కలిగిన రకము.
13. ఎం.టి.యు.రైస్ 1232 : అధిక దిగుబడినిచ్చే ముంపును తట్టుకునే రకము. పంటకాలం సాధారణ పరిస్థితులలో 135 `140 రోజులు, ముంపు సమయంలో 140`145 రోజులు. గోదావరి, కృష్ణ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలోని ముంపు ప్రాంతాలకు అత్యంత అనువైన రకము. నారుమడి నుండి పిలకలు కట్టే దశవరకు సుమారు 10 రోజుల పాటు ముంపును తట్టుకుంటుంది. దోమపోటు, అగ్గితెగులు మరియు మాగుడు తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున దిగుబడి సాధారణ పరిస్థితులలో హెక్టారుకు 6.0 టన్నులు, అదే ముంపు సమయంలో సాగుచేసినప్పుడు హెక్టారుకు 3.8 టన్నులు .
14. స్వర్ణ (ఎం.టి.యు`7029) : 1982 సంవత్సరంలో విడుదలచేయబడిన ఈ రకం దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్, త్రిపుర మరియు అస్సాం రాష్ట్రాలలోని 6.0 మిల్లియన్ హెక్టార్లలో సాగుచేయబడుతుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకము. చౌడు భూముల్లో సాగుకు, ఎండాకు తెగులు ఆశించే ప్రాంతాలకు అత్యంత అనుకూలం, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే చాలా అధిక దిగుబడినిచ్చే రకము. పంటకాలం 150 రోజులు. మూడు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. ఈ రకం మన దేశంలోనే కాక నేపాల్, బంగ్లాదేశ్ లలో కూడా అధిక విస్తీర్ణంలో సాగుచేయబడుతుంది. మనదేశం నుండి బాసుమతి యేతర రకాల విభాగం కింద ఎక్కువ మొత్తంలో మధ్య`తూర్పు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయబడుతూ మొత్తం వరి ఆదాయంలో 3.32% వాటా కలిగి ఉంది.
15. ఎం.టి.యు.రైస్ 1318 : 2022 వ సంవత్సరం లో విడుదల చేయబడిన ఈ రకం, పడిపోని స్వర్ణగా ప్రాచుర్యం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2.0 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతూ ఇతర స్వర్ణ పండిచే ప్రాంతాలకులకు కూడా విస్తరిస్తూ ఉంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే పడిపోని రకము. పంటకాలం 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం, కాండం ధృడంగా ఉండి చేనుపైపడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చిబియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి ఎక్కువ నిండు గింజలు కలిగి అధిక దిగుంబడి ఇస్తుంది. అగ్గితెగులు, మెడవిరుపు మరియు పొట్టకుళ్ళు తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున హెక్టారుకు 7.5 టన్నుల దిగుబడి సామర్ధ్యం కలిగిన రకం.
16. ఇంద్ర ( ఎం.టి.యు 1061) : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని చౌడు ప్రాంతాలలో సాగుచేయబ్డుతున్న రకం. ఈ రకం చేను పడిపోదు. పిలక దశలో 10 రోజుల వరకు ముంపును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకము. సన్న బియ్యం, పచ్చి బియ్యానికి అనుకూలమైన రకం. మార్కెట్ రేటు ఎక్కువగా ఉంటుంది. పంటకాలం 150 రోజులు.
17. అమర (ఎం.టి.యు 1064) : పిలక దశలో రెండు వారాల వరకు ముంపును తట్టుకుంటుంది. చేను పడిపోదు. దోమపోటు, ఎండాకు తెగుళ్లను తట్టుకుంటుంది. పంటకాలం 150 రోజులు.
18. బాండవ మషూరి (పి.ఎల్.ఎ`1100) : నీరు నిలువ ఉండే పల్లపు ప్రాంతాలకు, ముంపు ప్రాంతాలకు అత్యంత అనుకూలం. గింజ సన్నగా మషూరి రకాన్ని పోలి ఉంటుంది. పంటకాలం 160 రోజులు. గింజ రాలిక ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేకపోవడం వల్ల కోత సమయంలో వర్షం వస్తే గింజ మొలకెత్తుతుంది.
19. భీమ (ఎం.టి.యు`1140 ) : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సుమారు 40 వేల హెక్టార్లలో ముంపు ప్రాంతాలలో సాగుచేయబడుతూ మిక్కిలి ప్రాచుర్యం పొందింది. పంట కాలం 145 రోజులు. ఎదిగే దశలో 10 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది. దోమపోటును తట్టుకునే రకం.
ఒడిశా, తెలంగాణా మరియు మన రాష్ట్రంలో సన్న బియ్యం రకాల విభాగంలో సాగుచేయబడుతున్న ఎం.టి.యు`1224 మరియు ఎం.టి.యు`1262 రకాలు 1.20 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతున్నాయి.
20. మారుటేరు సాంబ (ఎం.టియు`1224) : సన్నబియ్యం దీని యొక్క పంటకాలం 135 రోజులు. దోమపోటును తట్టుకుంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి బావుంటుంది.

MTU-1262 Marteru Paddy Seeds
21. మారుటేరు మషూరి (ఎం.టి.యు`1262) : సన్నబియ్యం. పంటకాలం 155 రోజులు. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉండి ఎందాకు మరియు దోమపోటును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ రాలిక తక్కువగా ఉంటుంది.
మారుటేరు వరి రకాలు బాసుమతియేతర వరి ఎగుమతుల విభాగం కింద 30% కన్నా ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. దేశం మరియు రాష్ట్రంలో వరి తినే కుటుంబాలలో ఎక్కువ మంది మారుటేరు నుండి విడుదల చేయబడ్డ రకాలానే ఆహారంగా తీసుకున్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతే కాక మారుటేరు వరి రకాల సాగువల్ల మన రాష్ట్ర రైతాంగం సాలీనా 1200 కోట్ల రూపాయ ఆదాయం పొందుతున్నారు.
Also Read: Green Manure Benefits: పచ్చిరొట్ట పైర్లు – ప్రయోజనాలు