Hydroponics or Plant Grass System: పాడికి ఆధారం పచ్చి మేతలు పుష్కలంగా ఉన్నప్పుడే పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉంటుంది. సాధారణంగా పచ్చి మేత ఆగస్టు నుండి నవంబర్ వరకు విరివిగా లభిస్తుంది. కానీ డిసెంబర్ నెల మొదలుకొని మరిసటి సంవత్సరం జూలై నెల వరకు అధిక ఉష్ణోగ్రతల వలన పచ్చి మేత ఎద్దడిగా ఉంటుంది. ఈ పరిస్థితులలో పశువులకు తగినంత మేత లభించక వాటి యొక్క ఉత్పత్తి తగ్గుతుంటుంది. అలాగే పచ్చి మేత కొరత వలన పశువులకు సరైన పోషకాలు లభించక వ్యాధుల భారినపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో రైతులు పచ్చి మేత కొరతను అధిగమించడం కొరకు ముఖ్యంగా తమ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువ భాగాన్ని పశుగ్రాసాల సాగు కొరకు కేటాయించడం మరియు సైలేజ్ పాతర గడ్డి వంటి సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఉంటారు.
ఈ రెండు పద్ధతులలో ఎక్కువ మొత్తంలో స్థలం అవసరం అవడమే కాకుండా, అధిక మొత్తంలో కూలీ పని దినాలు మరియు ఎక్కువ సమయం అవసరం ఉంటుంది. కానీ నూతనంగా అభివృద్ధి పరిచిన హైడ్రోపోనిక్స్ పద్ధతిలో, అతి తక్కువ సమయంలో దాదాపు పది రోజుల వ్యవధిలోనే మట్టితో పని లేకుండా పూర్తిగా నీటి సహాయంతోనే అధిక పోషక విలువలు కలిగిన మొలక గడ్డిని పెంచుకొని పచ్చిమేత కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది.
సాంప్రదాయ పశుగ్రాసాల సాగులో వేసిన రెండు మూడు నెలలలో కోతకు వచ్చే పచ్చిమేతతో పోలిస్తే పది రోజులలో అంది వచ్చే మొలక గడ్డికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. కావున రైతులు తమ ఇంటి ఆవరణంలోనే ఈ మొలకగడ్డిని పెంచుకోవచ్చు. దీని కొరకు రైతులు తమ పశువుల సంఖ్య ఆధారంగా తగినంత విస్తీర్ణంలో గ్రీన్ నెట్ సహాయంతో షెడ్డుని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మొలకగడ్డి పెంచుకునే షెడ్డు :
ముఖ్యంగా సన్న కారు పాడి రైతులను పరిగణలోకి తీసుకున్నట్లయితే, వీరు 5`6 పశువులను కలిగి ఉంటారు. వీటికి సుమారుగా 100`120 కిలోల పశుగ్రాసం ప్రతిరోజు అవసరం ఉంటుంది. ఇంత మొత్తంలో ప్రతిరోజు గడ్డిని ఈ పద్ధతిలో ఉత్పత్తి చేయడం కొరకు సుమారుగా 12 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు గల షెడ్డుని నిర్మించుకోవాలి. షెడ్డు పైన తడికలను వేసుకోవాలి, ఎందుకంటే వర్షం పడినప్పుడు నీరు లోపలికి రాకుండా ఉంటుంది. ఈ తడికల పైన, పక్కలకు ముందు మరియు వెనుక వైపులకు గ్రీన్ నెట్టును వేసుకోవాలి. దీనివలన షెడ్డు లోపల ఉష్ణోగ్రత 25`35 సెంటిగ్రేడ్లు, తేమ 60 – 65% ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవచ్చు. షెడ్డు లోపల పైపులతో కానీ వెదురు బొంగులతో కానీ అరలుగా అమర్చుకోవాలి. వీటిలో 2I3 అడుగుల కొలతలు గల ట్రేలు అమర్చుకునే విధంగా వెదురు బొంగుల అరలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా సుమారు 80 నుండి 100 ట్రేలు అమర్చుకునే విధంగా షెడ్డుని ఏర్పాటు చేసుకోవాలి.
హైడ్రోపోనిక్స్షెడ్ల నిర్మాణ ఖర్చు :
రైతులకు అందుబాటులో ఉండే వనరులతో షెడ్డును పైన తెలిపిన కొలతలతో ఏర్పాటు చేసుకోవడానికి సుమారు 20,000/- నుండి 25,000/- వరకు ఖర్చు అవుతుంది. సెమీ లేదా పూర్తిగా ఆటోమేటిక్ రకాలైన షెడ్లను ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 60 నుండి 80 వేల మధ్య ఖర్చు అవుతుంది.
హైడ్రోపోనిక్స్ మొలకగడ్డి ఉత్పత్తికి అయ్యే ఖర్చు :
1. మొక్కజొన్న విత్తనాల ఖర్చు – రూ. 22/ కిలో
2. విద్యుత్ వినియోగం – రోజుకి 6 యూనిట్లు
3. విద్యుత్ ఖర్చు యూనిట్ కి – రూ. 55/-
4. ఒక ట్రేకు లేదా ఒక ట్రే లో ఉత్పత్తి అయ్యే 10 కిలోల మొలక గడ్డికి వినియోగమయ్యే విద్యుత్తు ఖర్చు – 5.5I6/80 (ట్రేలు)R 0.4
5. ఒక కిలో మొలకగడ్డి ఉత్పత్తికి అయ్యే మొత్తం ఖర్చు – 2.2 ( విత్తనాలకు)G 0.4R రూ. 2.6/-
Also Read: Healthy Ragi Recipes: రాగి పిండితో ఆరోగ్యకరమైన వంటలు – వాటి తయారీ విధానం
మొలకగడ్డి పెంచుకునే విధానం : సాధారణంగా ఈ మొలకగడ్డిని పెంచుకోవడానికి గింజ జాతి రకాలైన మొక్కజొన్న, గోధుమ, బార్లీ మరియు అలసంద వంటి రకాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొలకగడ్డిని పెంచుకోవడానికి, మొదటి రోజు సుమారు 10 నుండి 12 కిలోల నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలను ముఖ్యంగా పుచ్చులు, బూజులు పట్టనివి, విరిగినవి కాకుండా అధిక దిగుబడి నిచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసిన విత్తనాలను ముందుగా ఒకసారి బాగా కడిగేసి 15 నుంచి 20 లీటర్ల నీటిలో కనీసం 12 గంటల పాటు నాన్న పెట్టుకుని, సాయంత్రం ఆరు గంటల సమయంలో నీరు పారపోసి తడి గోని సంచిలో విత్తనాలను పోసుకొని గాలి చొరబడకుండా గట్టిగా చుట్టి 24 నుంచి 36 గంటలు ఉంచుకోవాలి. తరువాత గోనెసంచి విప్పి చూసినట్లయితే గింజలు మొలకెత్తడం గమనించవచ్చు. ఇలా మొలకెత్తిన విత్తనాలను ఒక్కొక్క ట్రేలో ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల విత్తనాలను వరుసగా పల్చగా పేర్చి, అట్టి ట్రేలను షెడ్డు లోపల అరలలో వరుసగా అమర్చుకోవాలి. ఇట్టి ట్రైలపై తడిచేసిన గోని సంచులను 24 గంటల పాటు కప్పి ఉంచినట్లయితే మొలక చాలా బాగా వస్తుంది.
ఈ షెడ్డులో నర్సరీలలో వాడే చేతి స్ప్రింక్లర్ల ద్వారా కానీ లేదా మైక్రోస్ప్రింక్లర్ల ద్వారా కానీ ప్రతి రెండు గంటలకు ఒకసారి నీరుని తుంపరులుగా ఐదు నిమిషాల పాటు అందించినట్లయితే షెడ్డు లోపల ఉష్ణోగ్రత మరియు తేమ అవసరమైన మేర మెయింటైన్ అవుతుంది. అలాగే ట్రేలడుగు భాగాన 5`10 చిన్న , చిన్న రంధ్రాలు చేసుకున్నట్లయితే ట్రేలలో నీరు ఎక్కువగా నిల్వకుండా నీరు కిందికి కారిపోయి విత్తనాలు చెడిపోకుండా ఉంటాయి. మొలకెత్తిన విత్తానాలను అరలలో అమర్చే ముందు రోజు మరలా 10`12 కిలోల విత్తనాలను నానబెట్టుకొని, మరలా పైన తెలిపిన విధంగా ప్రతిరోజు 10 `12 కొత్త ట్రేలలో విత్తనాలను పేర్చి అరలలో అమర్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా 8 రోజులపాటు చేసినట్లయితే మొదటి రోజు వేసిన విత్తనాల నుండి సుమారు 25`30 సెం.మీ. ఎత్తులో పెరిగిన మొక్కజొన్న గడ్డి లభ్యమవుతుంది. ఇలా పెంపు చేసిన ఒక్కొక్క ట్రేల నుండి సుమారు 10`15 కిలోల మొలకగడ్డి లభిస్తుంది, అనగా 10-12 ట్రేల నుండి సుమారు 120`150 కిలోల పచ్చిగడ్డి లభిస్తుంది. ఈ గడ్డిని ట్రేలలో నుండి బయటకు తీసినప్పుడు అవి ఒకదానికొకటి వాటి వేర్లను పెనవేసుకొని అట్టగా ఏర్పడి బయటకు వస్తుంది. ఇలా లభించిన 120 150 కిలోల పచ్చిగడ్డి సుమారు 5 `6 పశువులకు సులువుగా సరిపోతుంది.
షెడ్డులో నీటి తుంపర్ల కొరకు వాడే మైక్రోస్ప్రింకర్ల స్థానంలో డ్రిప్ ఇరిగేషన్లో వాడే లేటరల్ పైప్స్ కానీ పామాయిల్ సాగులో వాడే స్ప్రింక్లర్లను కానీ వాడుకొని షెడ్డు నిర్మాణ ఖర్చులు మరింత తగ్గించుకోవచ్చు. ఈ విధానంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి నీటిని తుంపర్లుగా అందించడానికి స్ప్రింకర్లలను ఆటోమేటిక్ చేయడానికి టైం కంట్రోల్ యూనిట్లను మరియు విద్యుత్ ఆదా కొరకు సోలార్ పలకలను కూడా అమర్చుకోవచ్చు. ఇలా ఏర్పరచుకున్నట్లయితే మన ప్రమేయం లేకుండానే ప్రతి రెండు గంటలకు ఒకసారి మోటారు తనంతటతానే ఆనై తుంపర్లుగా నీరు స్ప్రింక్లీన్గ్ చేయబడుతుంది.
పెట్టుబడి ఆదా చేసుకోవాలంటే షెడ్ నిర్మాణం మొత్తం వెదురు బొంగులతో లేదా కర్రలతో నిర్మించుకోవచ్చు. కానీ ఈ కర్రలతో నిర్మించిన షెడ్లలో మొలకగడ్డిపై బ్యాక్టీరియా మరియు తెగుళ్ల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా పశువులు వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కావున ఇనుప పైపులు, రేకులతో షెడ్డును నిర్మించుకోవడం ఉత్తమం. అలాగే మార్కెట్లో వివిధ మొత్తంలో మొలకగడ్డిని ఉత్పత్తి చేసే పూర్తిగా ఆటోమేటిక్ లేదా సెమీ ఆటోమేటిక్ రకాలైన వాణిజ్యపరమైన హైడ్రోపోనిక్ షెడ్లను సరఫరా చేసే వివిధ కంపెనీలు కూడా కలవు. వాటిలో కొన్ని ఈ క్రింద తెలుపడమైనది. ఆధ్యా సొల్యూషన్స్, హైదరాబాద్, ఆల్టర్నేటివ్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఘజియాబాద్ ఉత్తర ప్రదేశ్, శ్రీరామ్ హైడ్రోపోనిక్ టెక్, సోలాపూర్ మహారాష్ట్ర, స్టడ్ ప్యాక్ అడ్వాన్స్డ్ ఫామ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దుబాయ్ మొదలగునవి.
సాధారణంగా ఈ హైడ్రోపోనిక్స్ మొలకగడ్డి విధానంలో తలెత్తే సమస్యలలో అతి ముఖ్యమైనది శిలీంధ్రాల బెడద. ముఖ్యంగా షెడ్డు లోపల శుభ్రత లోపించినట్లయితే మరియు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోలేకపోయినట్లయితే మొలక గడ్డిపై శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాలు వృద్ధి చెంది ఆ గడ్డి పశువుల మేతకు పనికి రాకుండా పోతుంది. ఇలా పాడైన మొలకగడ్డిని పశువులకు అందించినట్లయితే అవి వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది, కానీ షెడ్డు లోపల కొన్ని మెలకువలను పాటించి వీటి యొక్క వృద్ధిని అరికట్టవచ్చు. షెడ్డు లోపల భాగంలో మరియు ట్రేలలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రేలను మరల ఉపయోగించే సమయంలో వాటిని జాగ్రత్తగా బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచుకోవాలి. స్ప్రిక్లర్ పౖౖెప్ లైన్లో మురికి పేరుకుపోయినట్లయితే వాటిని కోళ్ల పరిశ్రమలో కోళ్ళు తాగే నీళ్లలో వాడే వాటర్ శానిటైజర్లను వాడి శుభ్రపరచుకోవాలి. ఒకవేళ శిలీంధ్రాలు గింజల నాణ్యత లోపించడం వల్ల వృద్ధి చెందుతున్నట్లయితే గింజలను మొదటిరోజు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మొలకలు వృద్ధి చెందక మునుపే వాటిని కాల్షియం హైపోక్లోరైడ్ లేదా ఉప్పు ద్రావణంలో 10 నిమిషాలపాటు ఉంచి శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ శిలీంధ్రాలు బెడద మొలకగడ్డి పై అధికంగా ఉన్నట్లయితే, ఈ గడ్డి వృద్ధి చెందుతున్న సమయంలో ఒక చెంచాడు తినే సోడాను మూడు లీటర్ల నీటిలో కలుపుకొని రోజుకొకసారి మొలకగడ్డిపై స్ప్రే చేసుకోవాలి లేదా 50 మి.లీ. లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంను ఒక లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి.
మొలకగడ్డి పోషక విలువలు, మేపు విధానం :
ఈ మొలకగడ్డిలో పప్పు జాతి పశుగ్రాసాలకు దీటుగా సుమారు 15-16% మాంసకృతులు, 25% పీచు పదార్థాలు ఉంటాయి అలాగే ఏ,ఈ వంటి విటమిన్లు కాల్షియం వంటి లవణాలు అధికంగా ఉంటాయి. ఈ మొలక గడ్డిని ఒక్కొక్క పశువుకి సుమారు 15`20 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఇలా మేపుకున్నట్లయితే పాల ఉత్పత్తి కూడా 15`20% పెరిగే అవకాశం ఉంటుంది. కానీ రైతులు పశువులను పూర్తిగా మొలకగడ్డి పైన మాత్రమే మేపకూడదు ఎందుకంటే దీనిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. అలా మేపినట్లయితే ఈ మొలకగడ్డి లో ఉండే అధిక తేమ శాతం వలన పశువులు పారుడు రోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కావున ఎండు గడ్డితో పాటుగా లేదా ఇతర పచ్చి గడ్డి రకాలతో పాటుగా ఈ మొలకగడ్డిని అందించాలి. సాధారణంగా ఒక పశువుకి రోజుకి అందించే 20`25 కిలోల పచ్చి మేతలో సగానికి తగ్గించి మొలకగడ్డితో భర్తీ చేయవచ్చు, పైగా పశువులకు ఇచ్చే సమీకృత దానాలు ఒకటి నుంచి రెండు కిలోల వరకు తగ్గించుకోవచ్చు.
ఈ మొలక గడ్డిని పూర్తిగా గింజ జాతి ధాన్యాలైన మొక్కజొన్న, గోధుమ, బార్లీ మరియు అలసంద మాత్రమే కాకుండా వీటితో పాటు పప్పు జాతి గింజలైనటువంటి ఉలవలు, పిల్లి పెసర, జనుము గింజలను 75:25 పాళ్ళల్లో కలిపి మొలక గడ్డిని పెంచుకొని పశువులకు అందించినట్లయితే అధిక మొత్తంలో మాంసకృతులను పశువులకు విరివిగా అందించవచ్చు.
ప్రయోజనాలు :
1. ఈ విధానంలో అతి ముఖ్యమైన ప్రయోజనం తక్కువ సమయంలో మరియు తక్కువ విస్తీర్ణంలో అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసాన్ని పెంపు చేసుకోవచ్చు.
2. నీటి ఎద్దడిగా ఉండే సమయంలో ముఖ్యంగా వేసవికాలంలో తక్కువ నీరుతో పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు.
3. సాంప్రదాయ పశుగ్రాస సాగుతో పోలిస్తే కూలి పని దినాల ఖర్చులను మరియు విద్యుత్తు ఖర్చులను తగ్గించుకోవచ్చు.
4. రసాయన ఎరువులను వాడాల్సిన అవసరం లేదు.
5. ఈ పద్ధతిలో పెంపు చేసిన పశుగ్రాసాలు అధిక పోషక విలువలు కలిగి ఉండడం వలన పాడిపశువులకు అందించడంతో అధిక ఉత్పత్తులను పొంది రైతులు ఎక్కువ లాభాలను గడించవచ్చు.
Also Read: May Gardening To-Do List: మే మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు మరియు సూచనలు.!