PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బ్రీడర్ విత్తనోత్పత్తి మరియు చిరు సంచుల పరీక్షలపై సదస్సు ఈ రోజు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వరి మరియు ప్రతి 85% విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు తెలిపారు. దీనితోపాటు యూనివర్సిటీ HDPS (హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం) ప్రత్తి సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు అన్నారు. వాటికి అనువైన రకాలపై కూడా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.
పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ వర్సిటీలో ఉత్పత్తి చేసిన విత్తన వివరాల గురించి తెలిపారు. విశ్వవిద్యాలయ ఆవిర్భావం నుండి (2014) వివిధ పంటలలో 61 వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. డైరెక్టర్ సీడ్స్ డాక్టర్ పి. జగన్మోహన్ రావు మాట్లాడుతూ 2022-23 కు గాను వర్సిటీ నుండి 15,648 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని వివిధ పంటలలో ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.
మేనేజింగ్ డైరెక్టర్, TSSDC మరియు డైరెక్టర్ TSSDCA డాక్టర్ కేశవులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ ప్రణాళికల వలన గత 5 సంవత్సరాలలో సుమారు 52% పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. దీనిలో 85% విస్తీర్ణంను కేవలం నాలుగు పంటలు (వరి, ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు) మాత్రమే సాగు చేస్తున్నారు అని తెలిపారు.
యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల కృషి వలన 61 కొత్త వంగడాలు విడుదల అవడాన్ని అభినందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీడ్ మెన్ అసోసియేషన్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాన్ని నిర్దేశించిన సమయానికే అందించినందుకు డైరెక్టర్ సీడ్స్ ను మరియు శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సహా పరిశోధన సంచాలకులు వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు మరియు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
Also Read: Heavy Rains in Telangana: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. అన్నదాతకు తప్పని కష్టాలు