Minister Niranjan Reddy: గోపాల్ పేట మండలకేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హాజరై, జాతరలో తినుబండారాలు కొనుగోలు చేసి, ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు వ్యవసాయం అంటే సమిష్టి శ్రమ అని, పాలమూరు పాడి పశువులు వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినవని, పాడి ఆగినా, కాడి ఆగినా లోకం ఆగిపోతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి పాలమూరు చాలా నష్టపోయిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యంతో పల్లెసీమలు పాడిపంటలు, పశువులు, గొర్రెలు, మేకలు వంటి జీవాలతో వర్ధిల్లుతున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి, వ్యవసాయరంగ స్వరూపం మారడంతో గ్రామీణ సంబరాలకు ఆదరణ పెరిగిందని అన్నారు.
ఈ సందర్బంగా వృషభరాజాల బండలాగుడు పోటీల సంబరాలను నిర్వహిస్తున్న కమిటీకి వారు అభినందనలు తెలిపారు. గోపాల్ పేట కోదండరామస్వామి జాతర భక్తులతో కళకళలాడుతున్నదని, ప్రతి ఏటా ఇలాంటి సంబరాలు నిర్వహించి వ్యవసాయ సంస్కృతి, పని సంస్కృతిని ప్రోత్సహించాలి అని వారు కోరారు. ఎవరు ఎన్ని కోట్లు సంపాదించినా తినేది ఆహారమే … అది రావాల్సింది వ్యవసాయం నుండి, ఈ మట్టి నుండే, ఈ మట్టిని, ఈ రైతును ప్రేమించిన వారే నిజమైన మనుషులు అని ప్రస్తావించారు.
Also Read: Micro Nutrient Management in Mango: మామిడిలో సూక్ష్మపోషకాలు – సవరణ
గ్రామీణ క్రీడలు, పోటీలతో కొత్త తరానికి వ్యవసాయం యొక్క ప్రాధాన్యం, ఆవశ్యకతను తెలియజెప్పాలని, వ్యవసాయం ఉన్నంత కాలం రైతు ఉంటాడు .. రైతు ఉన్నంత కాలమే లోకం ఉంటుంది, అందుకే రైతును కాపాడడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారని, దానికి నిదర్శనం నేటి తెలంగాణ వ్యవసాయం, పల్లెసీమలే అని వారు అన్నారు.
దేశంలో పచ్చదనంలో, పంటలు పండడంలో, గ్రామాలు శుభ్రంగా ఉండడంలో, మంచినీళ్లు ఇంటింటికీ ఇవ్వడంలో, సాగునీళ్లు, కరంటు, రైతుబంధు, రైతుభీమాలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని వారు ఈ సందర్బంగా చెప్పారు. కావున రైతులు పోటీపడి వ్యవసాయంలో రానించాలని వారు అన్నారు.
అనంతరం స్థానిక మజీద్ లో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరై వారికి విందును తినిపించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jasmine Cultivation: సువాసన వెదజల్లే మల్లెల సాగుకు వేళాయె.!