Cucumber Cultivation: తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట. ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం. వేసవి పంటగా మార్చి నెల చివరి వరకు విత్తుకోవచ్చు.
రకాలు:
దోసలో కూరదోస, పచ్చిదోస రెండు రకాలున్నాయి.
కూరదోస రకాలు:
ఆర్.ఎన్.ఎస్.ఎం – 1 నీటి ఎద్దడికి తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. వేసవికి కూడా అనువైనది. ఈ రకం పంటకాలం 130 నుంచి 140 రోజులు. దిగుబడి ఎకరాకు 60 నుంచి 72 క్వింటాళ్లు వస్తుంది.
హైబ్రిడ్ రకాలు:
నాంధరి, 910, అభిజిత్, గోల్డెన్ గ్లోరీ, మల్టీస్టార్ మొదలైన రకాలున్నాయి.
పచ్చిదోస :
జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో – 1, పూసా సంయోగ మొదలైనవి అందుబాటులో వున్నాయి. ఈ రకంలో కో – 1 దోసను పూత పూసిన 7 నుంచి 8 రోజులకు కోసి సలాడ్ గా వాడుకోవచ్చు. పూత పూసిన 16 రోజులకు కోసి కూరదోసగా వాడుకోవచ్చు. దీని దిగుబడి ఎకరాకు 100 నుంచి 112 క్వింటాళ్లు వస్తుంది.
Also Read: కీరదోస పంట సాగుతో లక్షల్లో లాభాలను పొందుతున్న యూపీ రైతు..
విత్తన మోతాదు:
ఎకరాకు ఒకటి నుంచి 1.4 కిలోలు, హైబ్రిడ్ రకాల్లో ఎకరాకు 250గ్రా. విత్తనం అవసరం. కిలో విత్తనానికి మూడు మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేశాక, మూడు గ్రా. థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.
నేల తయారీ:
పొలాన్ని బాగా దుక్కి చేసి మూడు అడుగుల వెడల్పుతో ఎత్తు బోదెలు చేయాలి. బోదె మధ్యలో గాడి చేసి అందులో ఎకరానికి 5 టన్నుల చొప్పున పశువుల ఎరువు, 200 కిలోల సూపర్ ఫాస్ఫెట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 10 కిలోల బోరాన్ వేసి గాడిని మట్టితో నింపి బోదె పైభాగాన్ని చదును చేయాలి.
విత్తే విధానం:
రెండు వరుసల మధ్య 1.5 నుంచి 2.5 మీటర్ల దూరం ఉండేలా 80 సెం.మీ. వెడల్పు గల కాలువలు తయారు చేయాలి. కాలువలో రెండు పాదుల మధ్య 0.5 సెం. మీ. దూరంలో విత్తుకోవాలి.
నీటి యాజమాన్యం:
గింజలు మొలకెత్తే వరకు వెంట వెంటనే నీరు పారించాలి. ఆ తర్వాత నేల స్వభావాన్ని, కాలాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి.
అంతర కృషి:
కలుపు నివారణకు గింజలు విత్తిన 2 నుంచి 3 రోజులకు తేలిక నేలల్లో.. ఎకరాకు ఒక లీటరు మెటలాక్లోర్ 200 లీ. నీటిలో, బరువు నేలల్లో 1.5 లీటరు చొప్పున కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఆ తర్వాత నెల రోజులకోసారి మట్టిని గుల్ల చేయాలి.
ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల దోసలో ఆడ, మగ పూల నిష్పత్తిలో తేడాలు వస్తాయి. అందువల్ల మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో బోరాక్స్ లీటరు నీటికి 3 నుంచి 4 గ్రా. లేదా ఇథరిల్ 10 లీటర్ల నీటికి 2.5 మి.లీ. కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పైరుపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువ వస్తాయి.
కోత :
గింజలు విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది. సలాడ్ కోసం పూత పూసిన 7 నుంచి 8 రోజులకే కోయాలి. వారానికి రెండు కోతలు తీసుకోవచ్చు.
దిగుబడి:
కీర దోసలో ఎకరాకు 28 నుంచి 32 క్వింటాళ్లు, కూర దోసలో.. ఎకరాకు 60 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఆరోగ్యానికి తాటి బంగారం