Akarapu Narendra: మహబూబ్ నగర్, పాలమూరు పట్టణానికి చెందిన ఆకారపు నరేందర్ సమాజం కోసం చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వేనోట కొనియాడుతున్నారు. స్వార్థం పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో నరేందర్ వంటి గొప్ప మహనీయుడు ఈ గడ్డన జన్మించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ప్రజలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చింది పరుల కోసం పనిచేయడానికి తప్ప మన స్వార్థం కోసం కాదు అన్న సత్యంతో పాటుగా ఆకలితో బాధపడుతున్న మూగజీవాల వద్ద నుంచి మనుషుల వరకు ఆయన తన చేతనైనంతగా సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం వందలాది మందికి ఆహారాన్ని అందిస్తూ ప్రజల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి లో చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సహాయకులకు ప్రతినిత్యం ఆహారం అందజేయడంతో పాటుగా పాలమూరు పట్టణ శివారులో ఉన్న మూడు గోశాలలకు ఆయన నిత్యం ఫీడ్ అందిస్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలను మంచినీళ్ల మాదిరిగా నరేందర్ ఖర్చు చేస్తూ అపర దాన కర్ణుడిగా పేరు పొందారు.
Also Read: Chamanti Cultivation: ఏడాది పొడవునా దిగుబడి, ఆదాయాన్ని తెచ్చిపెట్టె చామంతి సాగు.!
పాలమూరు పట్టణంలో ఆకారపు నరేందర్ సేవలు గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. పాలమూరు పట్టణానికి చెందిన ఆకారపు వెంకటయ్య, లింగమ్మ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం కాగా నరేందర్ రెండవవాడు. పాలమూరు పట్టణంలో ప్రాథమిక విద్యాభ్యాసం మరియు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన నరేందర్ కు భార్య పద్మావతి తో పాటుగా ఒక కొడుకు కూతురు ఉన్నారు. 1979లో పాలమూరు పట్టణంలో వ్యాపారాన్ని ప్రారంభించిన నరేందర్ అంచలంచెలుగా తన వ్యాపారాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకునేలా నిజాయితీతో కూడిన వ్యాపారాన్ని చేసి ప్రజలచేత శభాష్ అనిపించుకున్నారు. 2008లో పతంజలి రాందేవ్ బాబా బాటలో నడవడం ప్రారంభించిన నరేందర్ రాందేవ్ బాబాను పాలమూరు జిల్లాకు రప్పించి అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో సేంద్రీయ పద్ధతుల ద్వారా తయారుచేసిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక గుడులకు ఆర్థిక సహాయం చేసి ధూపదీప నైవేద్యాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తనవంతుగా ఆయన నిరంతరం సేవలు అందిస్తూ వస్తున్నారు.
మహబూబ్నగర్ పట్టణ శివారులో ఉన్న చిన్నదర్పల్లి మరియు హౌసింగ్ బోర్డ్ వద్ద గల గోశాలలకు నిత్యం వందలాది రూపాయల విలువచేసే కూరగాయలను ఆహారంగా గోవులకు అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ ద్వారా 20 ఏళ్లుగా నరేందర్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎందరికో నీడను ఇచ్చారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా ప్రతినిత్యం పాలమూరు పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద నిత్యం 400 మందికి తగ్గకుండా ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ఆహారాన్ని నరేందర్ తన ఇంట్లోనే పని మనుషులను ఏర్పాటు చేసి ఉదయం ఎనిమిది గంటలకల్లా వేడివేడి ఆహారాన్ని తయారుచేసి ఆసుపత్రి వద్ద పేదలకు పంపిణీ చేస్తూ వస్తున్నారు.
గోవుల సంరక్షణ కోసం 50 ఎకరాల్లో మామిడి తోటను లీజుకు తీసుకుని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని నరేందర్ నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. పాలమూరు పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ అందుల పాఠశాలకు నరేందర్ నిరంతరం తన సహాయ సహకారాలను అందిస్తూ అంద విద్యార్థులకు అండగా నిలుస్తూ వస్తున్నారు. నరేందర్ సేవా కార్యక్రమాలను ప్రజలు ఘనంగా కీర్తిస్తున్నారు.
Also Read: Murrah Buffaloes: తక్కువ వయసులోనే ముర్రా జాతి గేదెల్లో గర్భధారణ – సరికొత్త పరిశోధనలో వెల్లడి..!