Winter Calf Management: నేటి ఆడ లేగ దూడలే రేపటి పాలన ఉత్పత్తి చేసే పాడిపశువులు కనుక డైరీ-ఫార్మ్ యజమానులు, రైతులు మాత్రమే కాక పశువుల నుండి లభించే పాలను అమ్మడం ద్వారా జీవనాన్ని సాగిస్తున్న కుటుంబాలు, దూడలు పుట్టిన తొలినాళ్లలో సరైన మెళకువలను అనుసరిస్తూ వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశువుల జీవితకాలంలో దూడ దశలోని మొదటి మూడు నెలలు చాలా కీలకమైనవి. పుట్టిన తొలినాళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు శారీరక ఎదుగుదలకు దూడలకు ఎక్కువ శక్తి అవసరం కావాలి.
మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో వాటి శరీర ఉష్ణోగ్రత (38.50 సెంటిగ్రేడ్) కాపాడుకోవడానికి దూడలకు, సాధారణ స్థాయి కన్నా అధిక శక్తి కావలసి వస్తుంది. ఇందుకోసం శీతాకాలంలో దూడల శరీరంలో శక్తి నిలువలను పెంచడంతోపాటుగా చలివలన శరీరం నుండి వేడి బయటకు పోకుండా నివారించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా చలి ప్రభావానికి గురైన దూడలు సులువుగా పారుడు రోగం, న్యూమోనియా, ధనుర్వాతం వంటి రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంది కనుక దూడలు కలిగిన రైతులు ఈ క్రింద పొందుపరిచిన అంశాలను పాటించడం ద్వారా వాటిలో సంభవించే మరణాలను అదుపులో ఉంచవచ్చు.
Also Read: RRR Natu Natu Song: ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!
దూడలలో శక్తి నిల్వలు పెంచడం-జాగ్రత్తలు :
దూడకు జన్మనిచ్చే పశువులకు మంచి పోషకాలతో (మాంసకృత్తులు, కొవ్వులు) కూడిన మేతను ప్రసవానికి 2-3 నెలల ముందుగా అందించడం ద్వారా పుట్టబోయే దూడలో శక్తి నిలువలను పెంచవచ్చు. అంతేకాకుండా మంచి పోషణ కలిగిన ఆవుల జున్నుపాలలో ఇతర ఆవుల కన్నా దూడలలో వ్యాధి నిరోధక శక్తి పెంచే ప్రతి రక్షకాలు అధిక మోతాదులో ఉంటాయి. దూడ జన్మించిన 2 గంటల లోపే తల్లి నుండి లభించే జున్ను పాలను తాగించాలి. దీనివల్ల పాలలోని వివిధ పోషకాలు ముఖ్యంగా వ్యాధులను నిరోధించే ప్రతి రక్షకాలు సులువుగా దూడ జీర్ణ వ్యవస్థనుండి రక్తంలోనికి శోషించబడి, దూడ శరీరంలోనికి చేరును. అప్పుడే పుట్టిన దూడలకు ముర్రు పాలను రోజులో ఎక్కువసార్లు అందించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడానికి ముఖ్యంగా కావాల్సిన క్రొవ్వులు అధిక మోతాదులో చేకూరే అవకాశం ఉంటుంది. చలికాలంలో దూడలకు అందించే దానాలో శక్తినిచ్చే పోషకాల స్థాయిని, సాధారణ స్థాయి కంటే అదనంగా 25 శాతం ఉండేటట్టు చూసుకోవాలి.
చలి ప్రభావం నుండి దూడలను రక్షించడం :
చలిగాలుల బారిన పడకుండా దూడలను నాలుగు వైపులా మూసి ఉండి, గాలి ప్రసరణకు ఆటంకాలు లేని గదులలో ఉంచాలి. గదిలో పరిశుభ్రతకై అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి. గదినేలపై ఎండు గడ్డిని 3 అంగుళాల మందం ఉండేటట్టుగా పరవటం మరియు దూడ శరీరం అంతటినీ (తల మినహాయించి) మందమైన గుడ్డతో కప్పడం ద్వారా దూడ దేహం నుండి వేడిని త్వరితగతిన కోల్పోకుండా నివారించవచ్చు. దూడ శరీర ఉష్ణోగ్రత ఎట్టి పరిస్థితులలో కూడా 37.7 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గకుండా చూసుకోవాలి. గోరువెచ్చటి (40-45 డిగ్రీల సెంటిగ్రేడ్ ) నీటితో శరీర ఉపరితలాన్ని తడపడం ద్వారా దూడ దేహాన్ని వెచ్చగా చేయవచ్చు. అయితే ఎప్పటికప్పుడు శుభ్రమైన వస్త్రంతో దూర శరీరం పొడిగా ఉండేటట్లు తుడవాలి. దూడలకు ఇచ్చే నీరు, పాలను కొద్దిగా వేడి చేసి అందించడం ద్వారా కూడా వాటి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉండటానికి దోహదపడుతుంది.
Also Read: Saline Soils Management: చౌడు భూములు – వాటి పునరుద్ధరణ (యాజమాన్యం)