Turmeric Crop: ఎండ బెట్టడం – ఉడికిన దుంపలను టార్పాలిన్ పట్టాలపైన పోసి ఎండబెట్టాలి. దుంపలన్నీ సమంగా, త్వరగా ఎండటానికి ప్రతిరోజు కలియబెట్టాలి. దుంపలను పల్చగా పరచి ఎండబెడితే రంగు మారుతుంది. ఎక్కువ మందంగా పోస్తే సమంగా ఎండకపోవడంతో పాటు ఎండటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల 5-7 సెం. మీ మందంతో పోసి ఎండబెట్టాలి.
పసుపు పూర్తిగా ఎండటానికి 12-15 రోజులు పడుతుంది. ఎండిన కొమ్ముల్లో తేమ 8-10 శాతం మాత్రమే ఉండాలి,
10 శాతం కన్నా ఎక్కువ ఉంటే నిల్వలో శిలీంధ్రాలు సులువుగా ఆశించి అఫ్లోటాక్సిన్స్ అనే విషపదార్థాలు వృద్ధి చెందుతాయి.
కొమ్ములు విరిస్తే కంచు శబ్ధం వస్తే సక్రమంగా ఎండినట్లు గుర్తించాలి.
మెరుగు పర్చడం (పాలిషింగ్):
ఎండిన పసుపు కొమ్ములు పైనున్న ముడుతలు, పొలుసులు, చిన్న వేర్లు వంటివి తొలగించి ఆకర్షణీయంగా మెరుగు పరిస్తే మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. మెరుగైన పసుపు పొందడానికి విద్యుత్ మోటార్లతో నడిచే పాలిషింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకేసారి 1000 కిలోల దుంపలను మెరుగుపర్చవచ్చు.
వీటిని ఉపయోగించినప్పుడు 6-7 శాతం పాలిషింగ్ జరిగి, ముదురు గోధుమ రంగు నుంచి ఆలివ్ పసుపు రంగుకు మారి ఆకర్షణీయంగా, నునుపుగా ఉంటాయి.
గ్రేడింగ్ :
పసువును 3 రకాలుగా గ్రేడింగ్ చేసి మార్కెటికి తరలించాలి. 2.5 – 7.0 సెం.మీ పొడవు, 1 సెం.మీ మందంతో ఉండే పక్క కొమ్ములు మొదటి రకంగా, తల్లి దుంపలు రెండవ రకంగా, చిన్న కొమ్ములు, విరిగిన కొమ్ములు కలిపి మూడో రకంగా వేరు చేసి ప్యాకింగ్ చేయాలి.
పాలిష్ చేసిన పసుపును సైజుల వారీగా గ్రేడింగ్ చేయడానికి పసుపు కొమ్ముల గ్రేడర్ అందుబాటులో ఉంది.
Also Read: Ladies finger and Cabbage: బెండ మరియు క్యాబేజీలో సస్యరక్షణ.!
ప్యాకింగ్ :
స్థానిక మార్కెట్ లేదా ఎగుమతులకు అనుగుణంగా శుభ్రమైన గోనె సంచులు లేదా పాలిథీన్ సంచుల్లో నింపి నిల్వచేయాలి.
నిల్వ చేయడం తేమ తగలని ప్రాంతంలో సంచుల క్రింద చెక్కలు లేదా మందపాటి ఈత చాపలు లేదా వరిగడ్డి పరచి దానిపై సంచులు అమర్చాలి. ప్రక్క గోడలకు కూడా సంచులు తాకకుండా చెక్కలు లేదా ఈత చాపలు పెట్టాలి.
నిల్వ సమయంలో చీడలు :
దుంపలు, కొమ్ములు సక్రమంగా ఉడికించకపోవడం, తేమ శాతం ఎక్కువగా ఉండటం, పురుగు బట్టిన బస్తాల్లో నిల్వచేయడం వల్ల నిల్వ సమయంలో పలు రకాలు పురుగులు నష్ట పరుస్తాయి. దుంపలు డొల్లలుగా మారిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన పదార్థాలు పసుపుతో కలిసి కలుషితం చేస్తాయి.
నివారణ చర్యలు :
• నిల్వ సమయంలో బూజు పట్టడానికి, ముక్క పురుగులు ఆశించడానికి ప్రధాన కారణం సరిగా ఎండకపోవడమే కాబట్టి పసుపు కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చేవరకు ఎండబెట్టాలి. మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి తయారు చేసుకొన్న ద్రావణంలో గోనె సంచులను ముంచి, ఎండబెట్టి వాటిలో కొమ్ములు పోసి నింపాలి.
• పసుపు నిల్వ చేసే గదులు, గోదాముల గోడలు, నేలపై కప్పులను కూడా మలాథియాన్ 10 మి.లీ. లీటరు
నీటిలో కలిపిన ద్రావణంతో పిచికారి చేయాలి.
• గాలి సోకని గోదాముల్లో నిల్వ చేసేటప్పుడు అల్యూమీనియం ఫాస్ఫైడ్ తో 2-3 రోజులు పొగ పెట్టాలి.
ఈ విధమైన కోతానంతరం నిల్వలో జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన కొమ్ములకు మార్కెట్లో అధిక ధరను పొందవచ్చు.
Also Read: Ragi Laddu Health Benefits: హిమోగ్లోబిన్ పెంపొందిస్తున్న రాగి లడ్డు.!