Pests of Black and Green Gram: ఈ సంవత్సరం అనేక జిల్లాలలో మినుము, పెసర పైర్లను విస్తారంగా సాగుచేయటం జరిగింది. ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పైర్లను వివిధ రకాలైన పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి నష్టాన్ని కలుగజేసే అవకాశం కలదు. కనుక రైతు సోదరులు తమ పైర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైనపుడు సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మినుము, పెసర పైర్లను ఆశించు ముఖ్యమైన పురుగులు- యాజమాన్యం
చిత్తపురుగులు:
ఈ పురుగులు పైరుపై రెండు అకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నపుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. చిత్తపురుగులు పగటిపూట గట్లమీద ఉన్న గడ్డిలో దాగి ఉండి రాత్రివేళ పైరుమీదకు వచ్చి నష్టాన్ని కలుగజేస్తాయి. ఉదయం పూట సూర్యోదయం ముందుగాని లేక సూర్యాస్తమయం తర్వాత గాని నిశితముగా గమనించినట్లయితే చిన్న చిన్న పెంకు పురుగులు ఆకులను తింటూ కనిపిస్తాయి.
నివారణ:
క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేక ఎసిఫేట్ 1.0గ్రా. లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి.
Also Read: Mango Cultivation Techniques: మామిడి తోటలలో పూత, పిందె దశల్లో యాజమాన్యం.!
తామర పురుగులు :
ఈ పురుగు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకులలో రసాన్ని పీల్చటంవలన ఆకులు పైకి ముడుచుకుపోతాయి 10-12% నష్టాన్ని కలుగచేయటమే కాకుండా ఆకుముడత మరియు తలమాడు అనే వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి.. తామరపురుగుల ఉధృతి ఎక్కువైనపుడు మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి.
నివారణ:
1.5 మి.లీ ఫిప్రోనిల్ 5 ఎస్.సి. లేదా 1.0గ్రా. ఎసిఫేట్ 75 ఎస్.పి లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేక స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3 మి.లీ లను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ :
తెల్లదోమలు రెండు రకాలుగా నష్టాన్నీ కలుగుజేస్తాయ. ఇవి ఆకుల అడుగుభాగాన చేరి రసం పీల్చడం. వల్ల మొక్కలు నీరసించి గిడసబారి పోతాయి. అంతే కాకుండా తేనె మంచు లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల భాగాలమీద నల్లటి బూజు ఏర్పడి, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిగే శక్తిని కోల్పోతాయి. తెల్లదోమ అనేక రకాల వైరస్ తెగుళ్ళను వ్వాప్తిచేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి. అపరాల పంటలను ఆశించే పల్లాకు తెగులు, తెల్లదోమ వైరస్ సోకిన మొక్కల నుంచి రసంతోపాటు వైరస్ను కూడా తీసుకొని వాటిని ఆరోగ్యకరమైన మొక్కలమీద రసం పీల్చడం ద్వారా వైరసు వ్యాపింపజేస్తుంది.
నివారణ:
1.5 మి.లీ ఫిప్రోనిల్ 5 ఎస్.సి. లేదా 1.0గ్రా. ఎసిఫేట్ 75 ఎస్.పి లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేక స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3 మి.లీ లను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: International Year Of Millets 2023: తృణ ధాన్యాల ప్రాముఖ్యత మరియు సేద్యం పై అవగాహన ర్యాలీ.!