Mango Cultivation Techniques: మామిడి మన రాష్ట్రంలో పండించే పండ్ల తోటలో ముఖ్యమైనది. భారత దేశంలో మామిడి ఉత్పత్తిలో 20% వాటాను ఆంధ్రప్రదేశ్ కలిగి యున్నది. మన రాష్ట్రంలో సుమారు 3.63 లక్షల హెక్టార్లలో సాగు అవ్వుతూ 43.73 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో పండించే వివిధ మామిడి రకాలలో సువర్ణరేఖ, బంగినపల్లి, చెఱకురసం, కేసరి మరియు తోతాపురి రకాలు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేయబడుతున్నాయి. మన దేశానికి మామిడి ఎగుమతుల ద్వారా సుమారు రూ.400 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నది . అట్టి విలువైన మామిడి సాగులో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులను పాటించి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలన్నది చాలా ముఖ్యం.
మామిడితోటలలో చీడ పీడల ఉధృతి అధికం కాకుండా ఉండాలి అంటే ముందుగానే జూన్-జులై మాసంలోనే కొమ్మ కత్తిరింపులు, లోతు దుక్కులు చేసుకొని ఉండాలి. చెట్లలలో ఉన్న ఎండు పుల్లను ఎప్పటి కప్పుడు తీసివేయటం వలన నిద్రావస్థలో ఉండే వెంకపురుగు మరియు కాయ తొలుచు పురుగుల ఉధృతి తగ్గుతుంది. మామిడి మొక్కలు ఆరోగ్యంగా ఉంటే చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను జూన్-జులై నెలలోనే కాండం నుండి సుమారు 1.5 మీ – 2 మీ. దూరంలో పాదులలో వేయాలి.
వీటితో పాటు అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులను 250 గ్రా. మరియు ఫాస్ఫేట్ సొల్యుబులైజింగ్ బాక్టీరియాను 100గ్రా. చొప్పున 100 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేప పిండి మిశ్రమానికి కలిపి ప్రతి చెట్టుకు వేయటం వలన భూమి సారవంతముగాను, చెట్లు సూక్ష్మధాతువుల లోపము లేకుండా ఉంటాయి. అధికంగా జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువులు వాడిన తోటలలో కాయల యొక్క నిల్వ సామర్ధ్యం మరియు తీపిశాతం అధికంగా ఉండటం గమనించబడింది.
Also Read: Nutrient Management in Mango: మామిడిలో పోషకాల యాజమాన్యము.!
ప్రస్తుతం తోటలను కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచటం వలన చీడ పీడల బెడద తగ్గుతుంది. అధికంగా చిగురులు లేదా క్రొత్త ఆకులు రావటం జరుగుతుంది. తోటలలో 25% కంటే అధికంగా క్రొత్త చిగురులు గమనించినచో సైకోసిల్ 200 పీ.పీ.యం (1-2 మి.లీ/లీటరు నీటికి) మోతాదులో కలిపి పిచికారి చేసినచో చిగురు. రావటం తగ్గి పూమొగ్గలు పెరుగుతాయి.
ఒక వేళ తోటలలో పూ మొగ్గలు వచ్చి బుడిపెల రూపంలో ఉంటే 19-19-19 లేదా 20-20-20- 10 గ్రా. నీటిలో కరిగే ఎరువులను దానితో పాటు జింక్ 2గ్రా. మరియు బొరాన్ 2 గ్రా. చొప్పున 1 లీటరు నీటిక కలిపి పిచికారి చేసినచో పూత మొగ్గలు త్వరగా బయటకు రావటానికి వీలవుతుంది. అంతేకాక జింక్, బోరాన్ పిచికారి చేయటం వలన అద పూత శాతం పెరిగి అధికంగా పిందెకట్టమేగాక కాయ పగుళ్ళు కూడ నివారించవచ్చు.
పిందె రాలుట :
పిందె కట్టిన తరువాత వివిధ దశలలో రాలుతూ వుంటుంది. ఎక్కువగా పిందె రాలుతున్నట్లయితే 1 మి.లీ నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లాన్ని 4,5 లీ. నీటికి కలిపి లేదా 2,4-డి ని 10 పి.పి.యం (1గ్రా॥ 100 లీ. నీటికి కలిపి) మోతాదులో పిచికారి చేయాలి, పిందె కట్టిన తరువాత నీరందించి నట్లయితే పిందెరాలుట తగ్గి కాయ పరిమాణం పెరుగుతుంది. జనవరి నెల రెండవ పక్షంలో నీరుకట్టు కోవటం మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా పూత, పిందె దశలో తోటలను సంరక్షించు కున్నచో అధికమైన దిగుబడి తోపాటు నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు.
Also Read: International Year Of Millets 2023: తృణ ధాన్యాల ప్రాముఖ్యత మరియు సేద్యం పై అవగాహన ర్యాలీ.!