నేలల పరిరక్షణ

Jeevamrutham: జీవామృతం

1
Jeevamrutham
Jeevamrutham Preparation

Jeevamrutham: జీవామృతం ఒక సేంద్రీయ ఎరువు మరియు ఇది రసాయన ఎరువులకు గొప్ప ప్రత్యామ్నాయం. ఇది అధిక బయోమాస్‌, సహజ కార్బన్‌, నైట్రోజన్‌, ఫాస్పరస్‌ మరియు కాల్షియం వంటి అవసరమైన పోషకాలు కలిగి మొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి దోహదపడుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం.

అందుకు జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది. మట్టిలో ఉన్నసూక్ష్మజీవులు నేల సారాన్ని మరియు పంటల ఉత్పాదకతను పెంచుతాయి. నేలలో ఉన్న సూక్ష్మజీవులను పెంచేందుకు జీవామృతం ఉపయోగ పడుతుంది. జీవామృతం చల్లిన భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే జీవామృతం తయారు చేయవచ్చు.

జీవామృతం రెండు రకాలు ఒకటి ఘన జీవామృతం మరొకటి ద్రవ జీవామృతం. ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లంలతో ద్రవజీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి తయారు చేసుకొని వాడుకోవాలి. ఘనజీవామృతాన్ని అనుకూలమైన ఎండాకాలంలో తయారు చేసుకోవాలి. భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టులకు ఇది చక్కని ప్రత్యామ్నాయం. ఎకరానికి ఏటా 400 కిలోలు వేస్తే చాలు.
ద్రవజీవామృతం :
ఒక ఎకరం పంట పొలానికి సరిపడా ద్రవజీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు:
1. దేశీఆవుపేడ`10 కేజీలు
2. దేశీఆవుమూత్రం`10 లీటర్లు
3. బెల్లం`2 కేజీలు లేదా చెరుకురసం 2 లీటర్లు
4. పప్పుల(ద్విదళాల) పిండి `2 కేజీలుశనగ, ఉలవ, పెసర, మినుముఏదైనావాడవచ్చు.
5. నీరు`200 లీటర్లు
6. పుట్టమన్నులేదా పొలంగట్టు మన్ను దోసెడు.

Jeevamrutham

Jeevamrutham

ద్రవ జీవామృతాన్ని తయారు చేసే విధానం :
మొదట డ్రమ్ములో 200లీటర్ల (సుమారు 15 బిందెలు) నీటిని తీసుకొని దానిలో 10 లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి, తరువాత 10 కేజీల ఆవుపేడను, 2 కేజీలు పప్పుదినుసుల పిండిని మరియు 2 కేజీల బెల్లంని కూడ డ్రములో వేసి కలుపుకోవాలి. పుట్టమన్నుని గుప్పెడు కలుపుకోవాలి.ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతి రోజు రెండు, మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి.

ఇలా కలిపిన జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది, అప్పట్నుంచి 9 నుంచి 12 రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగాఉంటుంది. కాబట్టి ఆరోజుల్లో వాడుకుంటే మంచి ఫలితం వస్తుంది. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయి. నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతం అవుతాయి. తద్వారా భూసారం పెరగడానికి దోహదపడుతుంది. దీనిని తయారుచేయుటప్పుడు ముందు జాగ్రత్తచర్యలుగా ఆరోగ్యకరమైన దేశీయ ఆవుపేడ, ఆవుమూత్రం తీసుకోవాలి. దీనిలో ఏమియు కలుపకూడదు. ఈ విధంగానే వాడుకోవాలి. మనం పంటకు నీరు పెట్టెకాల్వ దగ్గర లేదా పంటలో దీనిని పోసుకోవాలి.

Also Read: Cattle Management in Winter: చలి కాలంలో పాడి పశువుల మరియు దూడల నిర్వహణలో జాగ్రత్తలు.!

జీవామృతం పంటలకు వాడే పద్ధతులు :

1. నీటి తడులతో పారించటం
నీటి తడులను అందించేటప్పుడు నీటితోపాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒకదఫా 200 లీటర్లు చొప్పున అందించాలి. పంటల వివిధ దశల్లో 3 నుండి 4 సార్లు నీటితో పాటు పారించాలి.
2. జీవామృతం పిచికారీ పద్ధతి
జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒకదఫాకు 200 లీటర్లు పంటల వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొలాల్లో పిచికారీ చేయాలి.
3. డ్రిప్‌, స్ప్రింకర్ల ద్వారా జీవామృతం పారించటం
పండ్లతోటలు, కూరగాయతోటలకు కొన్ని చోట్ల ఆరుతడివరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి డ్రిప్‌ ద్వారా లేదా స్ప్రింకర్ల ద్వారా రైతులు అందించవచ్చు.
4. పైపాటుగా పంటలపై పోయటం
చిన్న, సన్నకారురైతులు, కౌలురైతులు లేదా పెరట్లో కూరగాయలు పండిరచుకునే వారు పంటలపై జీవామృతాన్నిచెంబులు, మగ్గులతో అందించవచ్చు.

జీవామృతం పిచికారి చేసే పద్ధతి :

3 నెలల్లో (60 నుంచి90 రోజుల్లో) పూర్తయ్యె పంటలకు ఎకరానికి
మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి) 5 లీటర్ల జీవామృతం,100 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
రెండోసారి : (మొదటిసారి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత)10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
మూడోసారి : (రెండోసారి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
నాలుగోసారి : (గింజ ఏర్పడుతున్నప్పుడు) 5 లీటర్ల మజ్జిగ, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి. చివరిసారి జీవామృతం అవసరంలేదు.

6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకుఎకరానికి
మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి) 5 లీటర్ల జీవామృతం,100 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
రెండోసారి : (మొదటిసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత)10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
మూడోసారి : (రెండోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
నాలుగోసారి : (మూడోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
ఐదోసారి : (నాలుగోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
ఆరోసారి : (గింజ ఏర్పడుతున్నప్పుడు) 5 లీటర్ల మజ్జిగ, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి. చివరిసారి జీవామృతం అవసరంలేదు.

12 నెలల్లో(300 నుంచి 360 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు ఎకరానికి
మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి) 5 లీటర్ల జీవామృతం,100 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
రెండోసారి : (మొదటిసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత)10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
మూడోసారి : (రెండోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
నాలుగోసారి : (మూడోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 5 లీటర్ల మజ్జిగ, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
ఐదోసారి : (నాలుగోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
ఆరోసారి : (ఐదోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
ఏడోసారి : (ఆరోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
ఎనిమిదోసారి : (ఏడోసారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత)20 లీటర్ల కొబ్బరినీళ్లు, 200 లీటర్ల నీటితో చివరిగా పిచికారి చేయాలి.

ఘనజీవామృతం:
తయారీకి కావాల్సిన పదార్థాలు :
1. దేశీఆవుపేడ(వారం రోజుల్లో సేకరించినది)`100 కేజీలు
2. దేశీఆవుమూత్రం` 5 లీటర్లు
3. బెల్లం`2 కేజీలులేదా చెరకు రసం 4 లీటర్లు లేదా తాటిపండ్ల గుజ్జు తగినంత
4. పప్పుల(ద్విదళాల) పిండి`2 కేజీలుశనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు.
5. పిడికెడు పుట్టమట్టి లేదా రసాయనాలు తగలని పొలం గట్టుమన్ను.

తయారు చేసే విధానం :
చెట్టునీడలో లేదా షెడ్డులో ఈ పదార్థాలన్నిటినీ 100 కేజీలు బాగా చీకిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి, గోనెపట్టా కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీన్ని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారుచేసిన వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని తదనంతరం వాడుకోవాలనుకుంటే, పూర్తిగా ఆరిపోయిన తరువాత గోనెసంచులలో నిల్వ చేసుకోవాలి. పంటలకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘనజీవామృతం వేసుకోవాలి. దానితోపాటు పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. ఇలా వేయటం వలన పంటలకు పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు.

డా.బి. సౌమ్య (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), డా.బి. విద్య (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌),
డా. సురేష్‌ రాథోడ్‌ (ప్రొఫెసర్‌), డా.ఆర్‌.ఎం.వి. ప్రసాద్‌ (ప్రొఫెసర్‌)
పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌

Also Read: Wheat Cultivation in Alluri District: అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయేతర పంటగా గోధుమ సాగు యాజమాన్యం.!

Leave Your Comments

Cattle Management in Winter: చలి కాలంలో పాడి పశువుల మరియు దూడల నిర్వహణలో జాగ్రత్తలు.!

Previous article

Insect Pest Management in Groundnut: యాసంగి వేరుశనగలో సస్యరక్షణ.!

Next article

You may also like