Wheat Cultivation in Alluri District: ఉన్నత పర్వతశ్రేణి గిరిజన ప్రాంతాల్లో రబీ కాలంలో ఉష్ణోగ్రతలు 25`28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదుఅవుతున్నాయి. అదే విధంగా వర్షపాతం 200`300 మి.మీ నమోదవుతుంది. వీటితో పాటుఈ ప్రాంతాలలో రబీ సీజన్లో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకొని కొన్ని రకాల ఆరుతడి పంటలను సాగుచేసుకోవచ్చు. వీటిలో ఉత్తర భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే గోధుమ పంటను అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో సాగుచేయటానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.
ఏజన్సీ గిరిజన ప్రాంతాల్లో గోధుమ పంటను ఖరీఫ్‌లో సాగుచేసే మొక్కజొన్న, ముందుగా వేసిన మెట్ట వరి, చోడి పంటల తరువాత గోధుమ పంటను సాగుచేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో రబీలో ఆరుతడి పంటగా అక్టోబర్ నెల రెడవ పక్షం నుండి గోధుమ పండిరచటానికి వాతావరణ పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయి. గోధుమ పంటకు 2`3 తడులు పెట్టే నీటి వనరులు ఉన్న ఏజన్సీ ప్రాంతాల్లో అధిక దిగుబడులు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. గోధుమలో పంటనూర్పిడి చేసిన తరువాతవచ్చే గడ్డిని పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు.
వాతావరణం :
గోధుమ మంచును అతిశీతల వాతవరణాన్ని బాగా తట్టుకొని ఎదిగే పంట. గోధుమ పంటకు మొలకెత్తే సమయంలో 20`23 డిగ్రీల సెంటీగ్రేడ్, పిలకదశలో డిగ్రీల సెంటీగ్రేడ్ 16`20 ఉష్టోగ్రత అనుకూలమైనవి. గోధుమ పంట పెరుగుదల సమయంలో కనిష్టంగా 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు పంట తట్టుకుంటుంది.
నేలలు :
గోధుమను ఉదజని సూచిక 6 ` 8.5 వరకు ఉన్న నేలలు అనుకూలమైనవి. ముఖ్యంగా తటస్థ నేలలు గోధుమ పంటకు చాలా అనుకూలం. మురుగునీటి వసతిగల సారవంతమైన ఒండ్రునేలలు గాని బంకనేలలలో కూడా గోధుమను పండిరచవచ్చు. నీరు పెట్టే అవకాశంగల తేలికపాటి నేలలు, మధ్యస్ద ఇసుక నేలల్లో కూడా పండిరచవచ్చు.
నేల తయారీ :
గోధుమ పంటకు సాధ్యమైనంత వరకు నేల చదునుగా ఉండేటట్లు నేలను తయారు చేసుకోవాలి లేని పక్షంలో నీటి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. భూమిని 2`3 సార్లు బాగా దున్ని కలుపు లేకుండా విత్తనం మొలకెత్తెందుకు అవసరమయ్యే మెత్తటి దుక్కిని తయారు చేయాలి.
Also Read: Sri Method in Sugar Cultivation: చెరకు సాగుకు ‘‘శ్రీ’’ పద్ధతి లాభదాయకం.!
విత్తనం :
100% మొలకెత్తటానికి, విత్తేముందు 7`10 రోజుల ముందు నీరు పెట్టడం మంచిది.
విత్త్తే సమయం, విత్తన మోతాదు, విత్తన శుద్ధి మరియు విత్త్తే పద్దతి :
ఏజెన్సీ ప్రాంతాల్లో గోధుమను అక్టోబరు రెండో పక్షం నుండి నవంబరు వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా నాటిన పంటకు రోజుకి 15`20 కిలోల దిగుబడి తగ్గుతుందని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. గోధుమ సాగుకు ఎకరానిక ి40 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరుసల మద్య 22 సెం.మీ మొక్కల మద్య 10 సెం.మీ. ఎడంలో విత్తుకోవాలి. విత్తనాన్ని 5 సెం.మీ కన్నా ఎక్కువ లోతులో పడకుండా చూడాలి. లోతు ఎక్కువయ్యే కొద్ద్దీ గింజ మొలకెత్తే శక్తి తగ్గిపోతుంది. విత్తనాన్ని నాటే ముందు కార్బండిజమ్ అనే మందుతో 2.5 గ్రా. ఒక కిలో విత్తనానికి చొప్పున వాడి విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని వెదజల్లే పద్ధతికన్నా నాగలి వెనక చాళ్ళలో వరుసలలోవిత్తుకోవాలి.
రకాలు :
గిరిజన ప్రాంతాలకు సాగరిక అనే రకం బాగా అనువైనది. ఈ రకం ఎకరానికి సగటున 16 `18 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
ఎరువుల వాడకం మరియు మోతాదు :
పంట వేసే 2 వారాల ముందుగా బాగా చివికిన పశువుల ఎరువును ఎకరానికి10 టన్నుల చొప్పున వేయాలి. ఎకరానికి 100కిలోల సూపర్‌పాస్పేట్, 20కిలోల మ్యూరేట్ అఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. గోధుమ పంటకు సూమారు 60 కిలోల యూరియా రూపంలో ఉండే నత్రజని ఎరువును 1/3 వంతు విత్తే సమయంలో, 1/3 వంతు అంతరకృషి చేసిన తరువాత, మిగతా1/3 వ వంతు విత్తిన 50`55రోజులకు వేసుకోవాలి. జింక్ లోపం ఉన్న భూములలో ఎకరానికి 10 కిలోల జింక్ సల్ఫేటును దుక్కిలో వేసుకోవాలి.
అంతరకృషి :
గోధుమ పంటను విత్తిన 40 రోజుల లోపు కనీసం రెండు దఫాలు కలుపును తీసుకోవాలి. దుబ్బు కట్టిన తరువాత కలుపు తీయడం వలన ఎక్కువ ప్రయోజనం ఉండదు.
నీటి యాజమాన్యం :
గోధుమ పంటకు నేల స్వభావాన్ని బట్టి 4`5 నీటి తడులు పెట్టాలి. పంటను విత్తిన 20`25 రోజులకు, 40`45 రోజులకు అంటే పిలకలు తొడిగే దశలో, 60`65 రోజులకు, 80 రోజులకు అంటే పూతకట్టే సమయంలోను, 95 రోజులకు అంటే పాలు గారే దశలో నీటి తడులు అవసరమౌతాయి.
అయితే పంటకు 20`25 రోజులకు ఇచ్చే నీటితడి వీటన్నింటిలోనూ అత్యంత అవసరమైనది. ఈ దశలో నీటితడి ఇచ్చినట్టయితే మొక్క బాగా దుబ్బుకట్టి దిగుబడులుగణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
సస్యరక్షణ :
గోధుమ పంట ఏజన్సీ ప్రాంతాల్లో సాంప్రాదాయేతర పంటగా సాగుచేయడం వలన ఈ పంటపై చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. అయినప్పటికీి ఈ ప్రాంతాలలో పంట విస్తీర్ణం పెరిగేకొద్దీ ఈ పంటను కాటుక తెగులు, తుప్పు తెగులు వంటివి ఆశించే అవకాశం ఉంది.
గోధుమ పంటపై కాటుక తెగులు ఆశించినట్లయితే కంకి మొత్తం నల్లగా మారిపోతుంది. కంకిని వేళ్ళతో కొట్టినట్లయితే నల్లని బూడిదవంటి పొడి రాలుతుంది. దీని నివారణకు తెగులు సోకని పంట నుండివిత్తనాలు సేకరించి నాటుకోవాలి. తెగులు ఆశించిన మొక్కలను తీసి కాల్చి వేయాలి.
ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. అధిక తేమ కలిగిన మబ్బు వాతావరణానికి తోడు స్వల్ప స్థాయి ఉష్ణోగ్రత తుప్పు తెగులు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు సకాలంలో విత్తినట్లయితే తెగులు ఉదృతి అంతగా ఉండదు. మాంకోజెబ్ G మెటాలాక్సిల్ మందును 3 గ్రాములు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి 15 నుండి 20 రోజుల వ్యవధిలో 2`3సార్లు పిచికారి చేసి నివారించవచ్చు.
పంటకోత :
గోధుమలో గింజకట్టే సమయంలో వాతావరణంలో ఉష్టోగ్రత 25 డీగ్రిల సెంటి గ్రేడ్ కన్నా తక్కువగా ఉంటే గింజ బరువు తగ్గే ప్రమాదం ఉంది.పంట పక్వదశ తర్వాత కోసి, ఎండలోఆరబెట్టి కట్టేలతో కొట్టిగాని, పశువులతోతొక్కించి గాని ట్రాక్టర్ సహాయంతో గాని పంటను నూర్పిడి చేసుకొనవచ్చును. గింజలు బాగా ఆరిన తరువాత తేమ శాతం 8`10 వరకు ఉన్నప్పుడునిల్వ చేసుకోవాలి
డా. పి. సీతారాము, సీనియర్ శాస్త్రవేత్త (కీటక శాస్త్రం)
డా. ఎస్. గణపతి, రీసెర్చ్ అసోషియేట్
బి.ఎన్. సందీప్ నాయక్, శాస్త్రవేత్త (సేద్య శాస్త్రం)
పి. జోగరావు, శాస్త్రవేత్త (మృత్తిక విభాగం)
డా. ఎమ్. శ్రీనివాస రావు, శాస్త్రవేత్త (వృక్ష ప్రజననము)
డా. కదిరి. మోహన్, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం),
డా. వి. రాజేంద్ర ప్రసాద్, సీనియర్ శాస్త్రవేత్త (ఆర్ధిక శాస్త్రం)
డా.ఎమ్. సురేష్ కుమార్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం
Also Read: Rotovator and Rotopuddlers Uses: వరిలో రోటోవేటర్ మరియు రోటోపడ్లర్ యొక్క ఉపయోగాలు.!