Chemical Fertilizers for Rabi Pears: విచక్షణారహితంగా వాడే రసాయన ఎరువుల వల్ల, పంట భూములు కాలుష్యమవ్వటం, సాగు ఖర్చు పెరగటం మరియు పెద్దమొత్తంలో రసాయ ఎరువులపై ఇచ్చే రాయితీల భారం ప్రభుత్వం పై పడటం వంటి నష్టాలు కలుగుతాయి. రసాయన ఎరువుల వాడకంలో క్రింది సూచనలు పాటిస్తే అవి సమర్థంగా వినియోగింపబడి, సాగు ఖర్చు తగ్గి నేల ఆరోగ్యం సంరక్షిగుబడుతుంది. రసాయన ఎరువులను ఆయా పంటలకు సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. వివిధ పంటలకు రసాయన ఎరువుల సిఫార్సు పట్టికలో ఇవ్వబడ్డాయి.
పట్టిక : ప్రాంతాల వారీగా రబీ సీజను పంటలకు సిఫార్సు చేసిన ఎరువులు మోతాదు.
పైరు ప్రాంతం రబీ సీజనుకు సిఫార్సుచేసిన ఎరువులు ఎకరాకు కిలో..
నత్రజని, భాస్వరం, పొటాష్
వరి గోదావరి డెల్టా 72 36 24
కృష్ణా డెల్టా 72 36 24
ఉత్తరకోస్తా 48 24 20
దక్షిణ మండలం 48 24 16
తీపి మొక్కజొన్న 80 24 20
రాగి అన్ని ప్రాంతాలు 24 12 08
శనగ అన్ని ప్రాంతాలు 20 50 –
వేరుశనగ అన్ని ప్రాంతాలు 12 16 20
నువ్వులు అన్ని ప్రాంతాలు 16 08 08
ప్రొద్దుతిరుగుడు 30 36 12
అందుబాటులో ఉండే రసాయన ఎరువులో ప్రధానంగా యూరియ (46 శాతం నత్రజని), సూపర్ ఫాస్ఫేటు (16 శాతం భాస్వరం), ఎమ్.ఒ.పి. (60 శాతం పొటాష్) డి.ఎ.పి. (18 శాతం నత్రజని మరియు 46శాతం భాస్వరం), గ్రోమోర్ (28 శాతం నత్రజని మరియు 28 శాతం భాస్వరం), ఇతర కాంప్లెక్స్ ఎరువులైన 14-35-14, 20-20-0-13, 19-19-19, 15-15-15, 15-0-45 వంటివి మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
ఎకరాకు సిఫార్సు చేయబడ్డ ఎరువు మోతాదు బట్టి మరియు ఆయా ఎరువులో పోషకశాతం బట్టి కావలసిన ఎరువుల పరిమాణాన్ని లెక్కకట్టాలి. ఉదాహరణకు, 72 కిలోల నత్రజని సిఫార్సుచేయబడితే, 157 కిలోల యూరియ అవసరమవుతుంది. 36 కిలోల భాస్వరం కావాలంటే 225 కిలోల సూపర్ఫాస్ఫేట్ అవసరం. ప్రత్యామ్నాయంగా 36 కిలోల భాస్వరానికి 78 కిలోల డి. ఎ.పి. ఎరువు సరిపోతుంది. కాంప్లెక్స్ ఎరువులు వాడేటప్పుడు వీటిలో ఉన్న ఇతర పోషకాలను కూడా లెక్కకట్టాలి, తదనుగుణంగా ఆయా ఎరువుల మోతాదును తగ్గించాలి.
భూసార పరీక్ష 3 సంవత్సరాలకొకసారి విధిగా చేయించి, ఆఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదు నిర్ణయించాలి. ఉదాహరణకు భూసార పరీక్షలో భాస్వరం అధిక స్థాయిలో ఉంటే, సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మోతాదుకు 25 శాతం తగ్గించి వాడాలి. తక్కువస్ధాయిలో ఉంటే 25 శాతం ఎక్కువ ఎరువు వాడాలి. సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం ఎరువు ఒకే సారి పంట విత్తేటప్పుడే వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగాను, పొటాష్ ఎరువు 2 దఫాలుగా వేయాలి.
. భాస్వరం ఎరువును విత్తనానికి దగ్గరగా 3 అంగుళాల లోతులో వేస్తే వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.
. ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే వేయాలి.
. జింకు ఎరువు భాస్వరం ఎరువుతో కలిపి వేయరాదు.
. చౌడు భూములకు మరియు నూనె గింజల పైర్లకు వేరుశగ పంటకు ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువు రెండో దుక్కి సమయంలో (45 రోజులకు) మొక్క మొదళ్ళలో వేసి మట్టిని మొక్కల మొదళ్ళకు ఎగదోయాలి.
. పంటల ఎదుగదల దశలో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తే ఆయా పోషకాల ఎరువులను పైరు మొక్కలపై పిచికారీ చేయాలి.
. చౌడు భూములకు సిఫార్సు చేసిన ఎరువు మోతాదుకంటే 25 శాతం అధికంగా వాడాలి.
. పైరు బెట్టకు గురైనట్లయితే 1.0 శాతం యూరియా ద్రావణం వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసి బెట్టను అధిగమించవచ్చు.
డా. పి. గురుమూర్తి, డా.డి. శ్రీనివాస్, డా.వి జగ్గారావ్, డి. వి. భాస్కర్,
డా.డి. చిన్నం నాయుడు, వ్యవసాయ కళాశాల, నైర, శ్రీకాకుళం జిల్లా