చీడపీడల యాజమాన్యం

Pests Control In Rice Crop: వరి పంటలో తెగుళ్ళు, లక్షణాలు, నివారణ.!

0
Rice Crop
Rice Crop

Pests Control In Rice Crop: ప్రధాన ఆహారపంటైన వరిలో అనేక రకాల చీడ పీడలు వివిధ దశలలో ఆశించి పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ చీడపీడల ఉధృతిని గమనిస్తూ, వివిధ దశలలో పంటపై రోగ లక్షణాలను గుర్తించి సరైన నివారణ చర్యలను తీసుకోవాలి.

Pests Control In Rice Crop

Pests Control In Rice Crop

అగ్గి తెగులు / మెడ విరుపు తెగులు:
లక్షణాలు: వరి పంటపై ఏదశలోనైనా ఆశిస్తుంది. వరి ఆకుల మీద, వెన్ను మెడ భాగాల మీద, ఆకులపై నూలుకండె ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఉంటాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలి పోతుంది. తెగులు సోకిన వెన్ను మెడ దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడి వెన్ను విరిగి వేలాడుతూ కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఎక్కువ తాలుగింజలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతి ఖరీఫ్‌ కన్నా రబీలో ఎక్కువగా ఉంటుంది.

నివారణ: పొడి విత్తనశుద్ధికి 1 కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్‌ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులు తట్టుకునే రకాలైన వరం (యం. టి.యు 1190), సుజాత(యం. టి. యు 1210), నెల్లూరు సిరి(ఎన్‌. యల్‌. అర్‌ 4001) నెల్లూరి మసూరి (ఎన్‌. యల్‌. అర్‌ 3449), వంశధార (ఆర్‌.జి. యల్‌ 11414), శ్రీదృతి (యం. టి. యు 1121) వంటి రకాలను వేసుకోవాలి. రాశి, ఐఆర్‌ 64, ఎ స్‌ఆర్‌ 34449, ఎ స్‌ఆర్‌ 3014 మరియు యమ్‌ టియు 1001 రకాలను సాగుచేయాలి. సిఫారసు చేసిన నత్రజనిని 3-4 సార్లు వేయాలి. తెగులు సోకిన పొలంలో 2 `5 శాతం ఆకులు నష్టపోయినచో ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రా/లీ. లేదా కాసుగామైన్‌ 2.5 మి.లీ./లీ. లేదా ఐసోప్రోథయోలిన్‌ 1.5 మి.లీ./లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

మానివండు తెగులు- 
లక్షణాలు: వరి పైరు పూతదశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. శిలీంధ్రం సోకిన మొక్క పూతలో, అప్పుడే ఏర్పడుత ఉన్న విత్తనాల నుంచి ఆకుపచ్చ మరియు పసుపు రంగులో శిలీంధ్ర బీజాలు ముద్దగా స్రవిస్తుంది. తరువాత ఈ ముద్ద నల్లని ముద్దగా మారుతుంది. నల్లని ముద్దలు కాటుకలా మారటం వలన దీనిని కాటుక తెగులు అంటారు. శిలీంధ్ర బీజాలు మిగ తా గింజలకు అంటుకోవటం వలన ధాన్యం రంగు మరియు నాణ్యత తగ్గుతుంది.

Pest Management

Pest Management

నివారణ: పంట ఈనె దశలో ఒకసారి, పది రోజులకు రెండవసారి కార్బెండిజిమ్‌ 1గ్రా/లీ లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ./లీ వీటిలో కలిపి పిచికారి చేయాలి.

Also Read: Mungi Insect in Rice: వరి పంటకు నష్టం కలిగిస్తున్న మొగిపురుగు ను ఇలా నివారించండి.! 

పొట్టకుళ్ళు తెగులు-                                                                                        లక్షణాలు: పైరు పొట్టదశలో ఉన్నప్పుడు పొట్ట దిగువన ఉన్న పత్రాచ్చాదం మీద చాక్‌లెట్‌ రంగులో మచ్చలు ఏర్పడతాయి. పత్రాచ్చాదంలో శిలీంధ్రజాలం చేరడం వల్ల వెన్ను పాక్షికంగానే బయటకు వచ్చి వెన్నులు పొట్టలోనే కుళ్ళిపోతాయి. గింజలు పాలుపోసుకోవు, తాలుగింజలుగా ఏర్పడతాయి. కంకినల్లి మరియు పొట్టకుళ్ళు రెండు ఒకేసారి ఆశించినట్లైతే గింజలు నల్లబడి దిగుబడి తగ్గిపోవును.

నివారణ: వరి మొక్కలు పొట్ట దశలో ఉన్నప్పుడు ఒకసారి, 15 రోజుల తరువాత రెండవసారి, కార్బెండాజిమ్‌ 1 గ్రాము లీటరు నీటికి కలిపి లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ./లీ వీటిలో కలిపి పిచికారి చేయాలి.

పాముపొడ: వరిపైరు పిలకలు వేసి దుబ్బుగా చేసే సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ శిలీంధ్రం వల్ల కాండం పై ఉండే ఆకుల మీద పాముపొడ వంటి మచ్చలు ఏర్పడి ఇవి క్రమేపి ఒక దానితో ఒకటి కలిసి మొత్తం ఆకులు మరియు మొక్క ఎండిపోతుంది. ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. తెగులు వెన్నువరకు వ్యాపిస్తే తాలుగింజలు ఏర్పడుతాయి.

నివారణ: హెక్సాకొనజోల్‌ 2 మి.లీ./లీ లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ./లీ లేదా వాలిడామైసిన్‌ 2.5 మి.లీ./లీ నీటిలో కలిపి రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

-బి. రాజేశ్వరి, ఎం. మాధవి, ఎ. పద్మశ్రీ, పి. జగన్మోహన్‌రావు,
విత్తన పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞానం,
రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 9912655843

Also Read: Wetting and Drying Process in Rice System: తడి-పొడి విధానంతో వరి సాగులో నీటి యాజమాన్యం.!

Must Watch:

Leave Your Comments

Yasangi Maize Cultivation: యాసంగి మొక్కజొన్న సాగు సమగ్ర యాజమాన్యం.!

Previous article

Let’s Prepare For Yasangi Cultivation Like This: యాసంగి సాగుకు తయారువుదాం ఇలా.!

Next article

You may also like