Pest Control In Cotton: ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో 18 సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది. ఈ తరుణంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల కాయ దశలో ఉన్న పత్తి లో కాయ కుళ్ళు తెగులు ఆశిస్తున్నట్లు గా గమనించడం జరిగింది. అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున ఈ తెగులు యొక్క లక్షణాలు అనుకూలమైన పరిస్థితులు మరియు యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగింది.
తెగులు యొక్క లక్షణాలు: వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గాత కొన్ని సంవత్సరాల నుండి పత్తిలో కాయ కుళ్ళు తెగులు గమనించడం జరిగింది. పత్తి పంట కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడటం వలన అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల కాయలు కుళ్ళిపోతాయి. శిలీంధ్రాలలో ముఖ్యంగా కొల్లేటోట్రైకమ్ గోసిసి, డిప్లోడియా గోసిసి, అస్కోకైటా గోసిసి మరియు ఫ్యూజేరియం జాతికి సంబంధించిన శిలీంధ్రాలు ఆశించడం వల్ల పత్తి కాయలు కుళ్లి పోతాయి. అదేవిధంగా కొన్ని బ్యాక్టీరియా జాతికి చెందినవి కూడా కాయలను ఆశించడం వలన కాయలు కుళ్ళిపోతాయి.
ముఖ్యంగా వివిధ రకాలైన పురుగులు, కాయలను ఆశించడం వలన కాయల మీద ఏర్పడిన రంధ్రాల ద్వారా లేదా అంతరకృషి, యంత్రాలు వివిధ చర్యల ద్వారా కాయల మీద ఏర్పడిన గాయాలు లేదా సహజంగా కాయలు పగిలినప్పుడు వివిధ రకాలైన శిలీంద్రాలు కాయలోనికి ప్రవేశించి తెగులును కలుగజేస్తాయి. అదేవిధంగా కాయ పెరిగే దశలో కాయలు అంటుకొని ఉన్న పూలరేకులు ఎక్కువ రోజులు తేమను నిలుపుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈ పరిస్థితుల్లో అనేక రకమైన శిలీంద్రాలు ఆశించి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాయ కుళ్ళు తెగులు ఏర్పడడం వల్ల కాయలు పూర్తిగా పరిపక్వతకు రాకముందే పగిలిపోయి కాయల ఆకృతి మారిపోయి అభివృద్ధి చెందక ఎండి పోవడం జరుగుతుంది. కాయలపైన శిలీంద్రాల యొక్క బూజు ఏర్పడే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా ఆశించి కాయకుళ్ళు ఏర్పడిన తరుణంలో తొలిదశలో నూనె రంగు మచ్చలు గమనించవచ్చు. అదేవిధంగా ఫంగస్ శిలీంద్రాల వల్ల కలిగే కాయకుళ్ళులో కాయలపై బూజుని గమనించవచ్చు. కాయలు కుళ్ళి పోవడం వల్ల కాయలో ఉన్న దూది రంగు కూడా మారిపోయి నాణ్యత మరియు దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అనుకూలమైన వాతావరణ పరిస్థితులు`ఉధృతికి దోహదపడే కారణాలు :
పత్తి పంట కాయ పెరిగే దశలో ఉన్నప్పుడు అధిక తేమతో కూడిన వాతావరణంలో ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. మబ్బులతో కూడిన చల్లని వాతావరణం, ఎడతెరిపిలేని వర్షాలు తక్కువ ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఈ దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది.
వివిధ రకాలైన పురుగులు ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగులు గాయాలతో ఉన్న కాయల వల్ల వర్షాలు కురుస్తున్నప్పుడు వర్షాల నీరు రంధ్రాల నుండి కాయ లోపలికి ప్రవేశించి వివిధ రకాలైన శిలీంద్రాలు ఆశించడం వలన కాయ కుళ్ళి పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read: Cotton Harvesting: పత్తి తీతలో పాటించవల్సిన జాగ్రత్తలు.!
యాజమాన్య పద్ధతులు :
- నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడకుండా సూచించిన సిఫార్సు మేరకే వాడాలి.
- కాయ పెరిగే దశలో ఉన్నప్పుడు వివిధ రకాలైన పురుగులు ముఖ్యంగా రసం పీల్చే పురుగులు మరియు కాయతొలుచు పురుగుల బెడద లేకుండా గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
- కాయ పెరిగే దశలో కాయకు అంటుకొని ఉన్న పూల రేకులు వర్షాలు పడ్డప్పుడు తేమను నిలుపుకొని వివిధ రకాలైన శిలింద్రాలు ఆశించడానికి దోహదపడే అవకాశం ఉన్నందున కాయకు అంటుకొని ఉన్న పూల రేకులను తీసివేయాలి. తద్వారా వ్యాధికారక శిలీంధ్రాలు ఆశించకుండా కొంత వరకు తగ్గించుకోవచ్చు.
- కాయ అభివృద్ధి చెందే సమయంలో మొక్క యొక్క కింది ఆకులను తీసివేయాలి. తద్వారా కాయకు మరియు మొక్కకు గాలి బాగా తగిలి తేమ తగ్గే విధంగా కాయకుళ్ళు ఉధృతిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
- కాయ కుళ్ళు ఉధృతిని బట్టి కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు స్ట్రెస్టోసైక్లిన్ లేదా ప్లారిటామైసిన్ లేదా పాపామైసిన్ 1 గ్రా. 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పత్తి కాయ దశలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పంటను పరిశీలిస్తూ ఏదైనా చీడపీడలు ఆశించినప్పుడు సకాలంలో యాజమాన్య పద్ధతులను చేపట్టినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది.
-డా.కె. రవి కుమార్, డా. హేమంత్ కుమార్, డా. బి చైతన్య
-డా. జెస్సీ సునీత, పి.ఎస్.ఎం ఫణిశ్రీ, డా. డి. నాగరాజు, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఫోన్ : 96030 96769
Thanks & Regards
M. Madhubala, Associate Editor
Eruvaaka Magazine
M. 7075751969
Also Read: Black Rot in Cotton: పత్తిని ఆశిస్తున్న బాక్టీరియా నల్ల మచ్చ తెగులుయాజమాన్యం.!
Must Watch: