Farmer Success Story: దేశవ్యాప్తంగా 70 శాతానికిపైగా గ్రామీణ జనాభా వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందుతోంది. అయితే వ్యవసాయ విధానంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులతో రసాయనాలు, క్రిమి సంహారక మందుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది భూసారాన్ని దెబ్బతీస్తోంది. తద్వారా నేలతల్లికి తీవ్ర నష్టం జరుగుతోంది. మరోవైపు సాగులో పెట్టుబడులు భారమై.. రైతన్నలు నాగలి వదిలిపెట్టే దుస్థితి తలెత్తింది. దీంతో గతంలో వ్యవసాయాన్ని వారసత్వంగా గర్వంగా స్వీకరించిన యువత నేడు పొలం బాట పట్టాలంటేనే భయపడుతోంది.
ఈ ఆందోళనకర పరిస్థితులకు మనం వేసిన తప్పటడుగులే కారణం. వాటిని సరిదిద్దుకుని ముందడుగు వేస్తే వ్యవసాయాన్ని పండగలా మార్చవచ్చని నిరూపిస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన బాదం శ్రీనివాస్ రెడ్డి.
ఏకకాలంలో నేలతల్లికి, ప్రజలకి, రైతుకు మేలు చేసే ప్రకృతి వ్యవసాయంతో రైతుకి పునర్ వైభవం సాధ్యమని చెబుతున్నారు. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో 5 ఎకరాల్లో ప్రకృతి సేద్యం ద్వారా తక్కువ పెట్టుబడితో పెర కరివేపాకు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. డిగ్రీ చదివినా ఉద్యోగం కోసం పట్టణాలకు వలస వెళ్లకుండా సాగులో స్వేదం చిందిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. తోటి యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి డిగ్రీ చదివారు. నలుగురిలా ఉద్యోగం కోసం నగరాల బాట పట్టకుండా తండ్రి మల్లారెడ్డి నుంచి వ్వవసాయాన్ని వారసత్వంగా స్వీకరించారు. వీరికి ఉన్న 20 ఎకరాల్లో 2010కి ముందు వరకు ఇతర పంటలు సాగు చేశారు. వాటి నుంచి స్థిర ఆదాయం రాకపోవటంతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. ఈ సమయంలోనే శ్రీనివాస్ రెడ్డి కరివేపాకు సాగు గురించి తెలుసుకున్నారు. ఆ తోటలు విరివిగా సాగయ్యే గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడికి వెళ్లి అక్కడి రైతులను కలిశారు. వారి సలహాలు, సూచనలతో తన పొలంలో కరివేపాకు సాగు మొదలు పెట్టారు. ముందుగా ఎకరం విస్తీర్ణంలో తోట వేశారు.
అనంతరం దానిని ఐదు ఎకరాలకు విస్తరించారు. ప్రారంభంలో రసాయనాలతో వ్యవసాయం చేయడంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి. దీంతో ఈ భారం తగ్గించడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులు అందించాలన్న లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. ఏడేళ్లుగా సహజ విధానంలో కరివేపాకు సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ పద్ధతిలో ప్రజలకు మంచి ఆహారం అందిస్తున్నామన్న సంతోషంతో పాటు పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరిగిందని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.
ఎకరానికి 70 కేజీల విత్తనాలు: కరివేపాకు పంటను ఎక్కువగా విత్తనం ద్వారా సాగుచేస్తారు. కొందరు రైతులు ముందుగా నారు పోసి మొక్కలు పెరిగాక ప్రధాన పొలంలో నాటుతారు. ముందుగా ఈ తోటలను సాగు చేస్తున్న రైతులను కలిసి వారి అనుభవాలను తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి విత్తనం ద్వారా సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడి మార్కెట్ నుంచి విత్తనాలు కొనుగోలు చేశారు. ఎకరానికి 70 కేజీల విత్తనాలను జంట సాలు పద్ధతిలో నాటారు. డ్రిప్ ద్వారా నీరు పారించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. “కరివేపాకులో విత్తనం నాటిన దగ్గరి నుంచి ఏడు నెలలకు తొలి పంట చేతికి వస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓ కోత చొప్పున ఏడాదికి నాలుగు కోతలు వస్తాయి. ఈ తోటను ఒక్కసారి నాటుకుంటే కనీసం 20 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు” అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Also Read: Curry Leaves Health Benefits: కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే ఏమోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
సహజ కషాయాలతోనే చీడ పీడల నివారణ: ప్రకృతి సేద్యంలో సుభాష్ పాలేకర్ తనకు స్ఫూర్తి అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఆయన వివరించిన పద్ధతులను పాటిస్తూ కరివేపాకు తోటకి సహజ ఎరువులని అందిస్తున్నానని వివరించారు. సహజ కషాయాలతోనే చీద పీడలను నివారిస్తున్నామని చెప్పారు. “కరివేపాకు తోటకి పోషకాలుగా జీవామృతం, ఘనజీవామృతం వాడుతున్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అందిస్తున్నాం. దీని వల్ల భూమిలో వానపాముల సంఖ్య పెరుగుతుంది.
ఇవి భూమిని గుల్లబార్చి మొక్కలకు పోషకాలు అందేలా చేస్తాయి. వానపాముల ద్వారా ఉత్పత్తయ్యే వ్యర్థాలతో భూమికి 18 రకాల పోషకాలు అందుతాయి. వీటితో కరివేపాకు మొక్కలకు బలం చేకూరి ఏపుగా పెరుగుతాయి. ఆకులు కూడా ముదురు ఆకుపచ్చ రంగులో వస్తాయి. ఈ పంటను ప్రధానంగా మూడు రకాల తెగుళ్లు ఆశిస్తాయి. వర్షాల సమయంలో ఆకులపై మచ్చ వస్తుంది. చలి కాలంలో ప్రధానంగా ఆకుచుట్టు పురుగు కనిపిస్తుంది. తెల్లదోమ కూడా వ్యాపిస్తుంది. సహజ కషాయాలతో ఈ మూడు రకాల తెగుళ్లను నివారించుకోవచ్చు.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Curry Leaf Cultivation: కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు
Also Watch: