Importance of Gypsum In Groundnut: వేరుశెనగ లో అధికోత్పత్తికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. వీటిలో ప్రధానంగా పైరుకు సరైన పోషణ అందించడం. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ లతో పాటుగా వేరుసెనగ పైరుకు సరిపోయినంత సున్నం, గంధకం కాయల అభివృద్ధికి, నాణ్యమైన కాయ దిగుబడికి కావాలి. ఈ రెండు పోషకాలను వృద్ధి చెందుతున్న ఊడలు, అభివృద్ధి చెందుతున్న కాయలు అధిక మొత్తంలో గ్రహిస్తాయి. జిప్సంలో 28 శాతం సున్నం, 18 శాతం గంధకం ఉంటాయి.
వేరుసెనగలో కాల్షియం పాత్ర: వేరుశెనగ లో అధిక దిగుబడి పొందడానికి నాణ్యమైన కాయలను పొందడానికి అధిక మోతాదులో అవసరమైనంత మేరకు సున్నం అవసరం. కాయల్లో గింజ పూర్తిగా నిండుకునేటట్లు సున్నం దోహదం చేస్తుంది. అందువల్ల అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. కాల్షియం అధికంగా ఉండే నేలల్లో వచ్చే దిగుబడిలో గింజ బాగా నిండిన గట్టి కాయలు ఉంటాయి. కాల్షియం. మొక్కల్లో కొన్ని ఎంజైములను ప్రభావితం చేస్తుంది. వేర్ల చివర కాల్షియం ఉండటం వల్ల కొత్తకణాలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. భూమి ఉదజని, ఆమ్ల లక్షణాలను క్రమబద్దం చేసి, మొక్కకు కావలసిన పోషక పదార్థాలు లభించేటట్లు చేస్తుంది. అంతేకాకుండా అల్యూమినియం, ఇనుము, మాంగనీసు మొదలగు పోషక పదార్థాల స్థాయి మొక్కకు హాని కలిగించే స్థాయికి చేరకుండా అరికడుతుంది. వేర్ల అభివృద్ధికి తోడ్పడి తద్వారా బెట్టను తట్టుకొనే శక్తిని కలిగిస్తుంది. ఊడలకు శక్తినిచ్చి పెరుగుదలకు తోడ్పడుతుంది.
కాల్షియం లోప లక్షణాలు: వేరుశెనగ లో తాలుకాయలు ఎక్కువగా ఉంటాయి. ఆకుల కింది భాగంలో కేంద్రీకరించిన గుంతలు ఏర్పడతాయి. ఆకులు రెండువైపుల పెద్దమచ్చలు వచ్చి కంచు రంగుకి మారుతుంది. > ఆకుతొడిమ పచ్చగా మారి, మొక్క చివర్లు ఎండిపోయి వేర్లు నత్రజనిని గ్రహించే శక్తి కోల్పోతాయి.కాల్షియం లోపం వల్ల పూత, ఊడల ఉత్పత్తి తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతుంది.
మొక్కలు కాల్షియం గ్రహించే విధానం: కాల్షియం మొక్కల్లో వేర్ల నుంచి మొక్కల ఇతర భాగాలకు జైలం కణజాలం ద్వారా ప్రవహిస్తుంది. అంటే కాయలు ఉన్న భాగం నుంచి పైకి ప్రవహిస్తుంది. కాయలకు జైలం ఉండదు గనుక కాయలకు కావలసిన కాల్షియం ఊడలు, అభివృద్ధి చెందే కాయలు నేరుగా భూమి నుంచి గ్రహిస్తాయి. కాబట్టి భూమిలో 0-5 సెం.మీ, లభ్యమయ్యేలా చూడాలి.
Also Read: Gypsum: వ్యవసాయంలో జిప్సం పాత్ర
వేరుశెనగ లో గంధకం పాత్ర: గంధకం మొక్కల్లో శ్వాసక్రియకు, వేరుపైబుడిపెల అభివృద్ధికి, పత్రహరిత అభివృద్ధికి, వేరుసెనగ కాలయ రంగు అభివృద్ధికి ఆకులు ముందే రాలకుండా అరికట్టడం, మొక్కలకు కాయలు (ఊడలకు) గట్టిగా అతుక్కొని ఉండటానికి, నూనె తయారుచేసే ప్రక్రియలో ప్రముఖపాత్ర వహిస్తుంది. మొక్కలో తగినంత గంధకం ఉండటం వల్ల మాంసకృత్తులు తయారవడం, ఎంజైములు పనిచేసే సామర్థ్యం పెరిగిమొక్క దృడంగా ఉంటుంది.
గంధ లోప లక్షణాలు: గంధకం లోపిస్తే చెట్టు ఆకులు పసుపు పచ్చగా మారుతాయి. > లేత ఆకులు చిన్నవిగా, రంగు కోల్పోయి నిటారుగా ఉంటాయి. అయితే ముదురు ఆకులు మాత్రమే ఆకుపచ్చగా ఉంటాయి.
మొక్కలు గంధకం గ్రహించే విధానం: పంటకాలంలో సుమారుగా 0.2 శాతం గంధకం వేరుసెనగ ఆకుల్లో ఉంటుంది. ఊడలు, కాయల గంధకాన్ని గ్రహిస్తాయి కాయలు పెరిగే సమయంలో తగినంత గంధకం కాని, లభ్యమయ్యేటట్లు చూడాలి. గంధకాన్ని మొక్కలు భూమి నుంచి గాక వాతావరణం నుంచి ఆకులు సల్ఫర్ డై ఆక్సైడ్గా కూడా గ్రహిస్తాయి.
జిప్సం వేసే పద్ధతి: కాల్షియం, గంధకం లోపం వల్ల వచ్చే లోప లక్షణాలు జిప్సం వేయటం ద్వారా అరికట్టవచ్చు. ఎకరాకు 200 కిలోల జిప్సంను పంట తొలిపూత సమయంలో కలుపు తీసేటప్పుడు, మొక్కల మొదళ్లలో పడేటట్లు వేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో జిప్సంను ఊడలు దిగే సమయం అంటే రెండోసారి కలుపుతీసే సమయంలోగా వేయటం వల్ల ఊడలు కాల్షియంను గ్రహించి, కాయలు బాగా నిండుగా ఊరడానికి దోహదం చేస్తుంది.
జిప్తం వేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఉప్పులను విత్తేటప్పుడు లేదా విత్తిన 25-30 రోజులకు వేయడం వల్ల లేదా 2 దఫాలుగా వేయడం వల్ల వేరుసెనగ మొక్కలు కాల్షియం, గంధకాన్ని ఎక్కువగా గ్రహించడమే గాక నత్రజని, భాస్వరం, పొటాష్ లను కూడా ఎక్కువగా గ్రహిస్తాయి. జిప్సం వేసిన వేరుసెనగలో ఇతర పోషకాలను తీసుకోవడం కూడా ఎక్కువగానే ఉంటుంది.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Importance of Gypsum Bed: సమస్యాత్మక సాగునీటి యాజమాన్యంలో జిప్సం బెడ్ ప్రాముఖ్యత
Also Watch: