వార్తలు

ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు..అగ్రి హబ్- పిజెటిఎస్ఎయు ఉపకులపతి ప్రవీణ్ రావు

0

“ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు వ్యవసాయ విశ్వద్యాలయంలో” అగ్రి హబ్” ఏర్పాటు చేసాం. కొత్త ఆలోచనలతో అంకురాలు ఏర్పాటు చేసుకున్నవారు ఇక్కడి రైతులు, పంటలకు సేవలు అందించేలా చేయడానికి ఇది ఒక వేదిక కానుంది. భవిష్యత్తులో అంతా డిజిటల్ సేద్యమే. పొలంలో ఏ మొక్క వద్ద ఎంత తేమ ఉంది. ఎంత నీరు ఇవ్వాలి, ఎప్పుడివ్వాలి.. ఎప్పుడు పంట కోయాలి తదితర వివరాలన్ని సెల్ ఫోన్ కు ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు వస్తాయి. ఇలాంటి ప్రయోగాలు ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రారంభించాం” అని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రవీణ్ రావు చెప్పారు.
మనదేశంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే లెక్కలు పక్కాగ ఉండటం లేదు. ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించి ఉపగ్రహాలతో చిత్రీకరించిన పటాల ఆధారంగా పంట విస్తీర్ణం లెక్కలు సేకరించవచ్చు. ఇలా 5 రకాల పంటలపై ప్రయోగం చేసాం. వీటి ద్వారా కొద్ది సమయంలోనే ఎంతో సమాచారం సేకరించి విశ్లేషించవచ్చు. దీన్ని “బిగ్ డేటా అనాలిసిస్” ప్రాజెక్ట్ పేరుతో “ప్రపంచ ఆర్ధిక వేదిక” సహకారంతో చేపడుతున్నాం. ఇలా ప్రతీ కార్యక్రమంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం.
పంటల దిగుబడి పెంచడానికి ఈ కార్యక్రమం చాలా బాగా ఉపకరిస్తుంది. వేరుశనగ పంటలో మొక్కల వద్ద సెన్సార్లు పెట్టాం. అక్కడ భూమిలో ఎంత తేమ ఉంది, ఎప్పుడు తేమ అందించాలనే సమాచారాన్ని సెన్సార్లు నేరుగా క్లౌడ్ కంప్యూటర్ కు పంపుతాయి. అక్కడి నుంచి రైతు సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం వస్తుంది. రైతు పొలానికి వెళ్లకుండానే సెల్ ఫోన్ ద్వారా సందేశం పంపితే పొలం వద్ద వున్న బిందు సేద్యం పరికరాల ద్వారా నీరు మొక్కలకు ఎంత వెళ్లాలో అంతే వెళుతుంది. ఇలాగే విత్తనం వేయకముందే పొలం అక్షంశాలు , రేఖాంశాల జీపీఎస్ సమాచారాన్ని యాప్ లో నమోదు చేస్తాం. ఆ పొలంలో ఎంత లోతు దుక్కి దున్నాలి. ఎన్ని విత్తనాలు, ఎంత దూరంలో వేయాలి, ఎంత ఎరువు వాడాలి, ఎంత నీరు పెట్టాలి.. ఇలా సాగుకు సంబంధించిన ప్రతి అంశంపై సెల్ ఫోన్ యాప్ లో రైతుకు సమాచారం వస్తుంది. దుక్కి నుంచి కోతల దాకా యంత్రాలే చేయడం వల్ల వృథా వ్యయం తగ్గుతుంది.
దేశంలో తొలిసారి మా వర్సిటీలో అగ్రి హబ్ ఏర్పాటు చేసాం. ఐటీ పరిజ్ఞానాన్ని వ్యవసాయ పరిశోధనల్లో వాడేలా ప్రోత్సహించి ఆర్ధిక సాయం చేస్తున్నాం. డ్రోన్ల తో పంటలపై ప్రయోగాలు ప్రారంభించాం. పూర్తిగా ఐటీ పరిజ్ఞానంతో పంటల సాగుకు డిజిటల్ వ్యవసాయ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం. అత్యాధునిక పరికరాలతో జాతీయ స్థాయి ప్రయోగశాలను ఏర్పాటు చేసాం. ఐటీ పరిజ్ఞానాన్ని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, యంత్రాలు, రిమోట్ సెన్సింగ్ వంటివన్నీ మన పంటలపై ఎలా వాడాలనే ప్రయోగాలను చేస్తున్నాం అని ప్రవీణ్ రావు చెప్పారు.
ప్రస్తుతం 5 రకాల పంటలపై మందుల పిచికారీకి డ్రోన్లతో పలు జిల్లాల్లో ప్రయోగాలు చేస్తున్నాం. డ్రోన్ తో ఏ మందు ఏ మొక్కపై ఎంత చల్లాలనేది కంప్యూటర్ ఆధారంగా సమాచారం ఫీడ్ చేస్తాం. డ్రోన్ తో చల్లిన తరువాత మొక్కపై ఎంత మందు పడింది, నేలపై ఎంత పడిందనే వివరాలు సేకరిస్తున్నాం. దీని వల్ల విచ్చలవిడిగా రసాయనాలు చల్లకుండా నివారించి ఖర్చు తగ్గించవచ్చు. పంటకు సోకే తెగులును ఏ రసాయనం చల్లాలో దాన్నే వాడతాం. దీని వల్ల అవసరం లేని మందుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఇప్పటికే ఒక సీజన్ లో డ్రోన్ల తో ప్రయోగం పూర్తయింది. ఆ సమాచారాన్ని విశ్లేషించి మళ్లీ ఇప్పుడు యాసంగిలో ప్రయోగాలు చేస్తున్నాం. డ్రోన్లకు అనుమతి కోసం కేంద్ర విమానయాన శాఖకు దరఖాస్తు చేసాం. డ్రోన్ల వినియోగంపై గ్రామీణ యువతకు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తాం.
కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలతో రైతుల పొలాల్లోనే ప్రయోగాలు చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని ఫలితాలు వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో పురాతన “సాంబమసూరి సన్న” వరి రకం సాగు అధికంగా ఉండేది. కానీ ఇక్కడి భూములకు, వాతావరణానికి అనుకూలమైన కొత్త రకం “తెలంగాణ సోనా” వరి వంగడాన్ని రైతులకు ఇవ్వడం ప్రారంభించాం. దీంతో ఇప్పుడు సాంబమసూరి మూల విత్తనోత్పత్తి 10 శాతానికి తగ్గిపోయి కొత్త వంగడాల సాగు గణనీయంగా పెరిగింది. ఇలా ప్రతి పంటలో పరిశోధన ఫలితాలను రైతుల పొలాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్ రావు చెప్పారు.

Leave Your Comments

బీన్స్ సాగు లాభదాయకం..

Previous article

వండకుండానే అన్నంగా మారే మ్యాజిక్ రైస్..

Next article

You may also like