ఉద్యానశోభవ్యవసాయ పంటలు

 Sorghum cultivation: యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా అవశేష తేమ పై జొన్న సాగు లాభదాయకం

0
Cultivation of Sorghum
Cultivation of Sorghum

 Sorghum cultivation: ప్రస్తుత వానాకాలంలో వరి సాగు సుమారుగా 62 లక్షల సాగయ్యిందని వ్యవసాయ శాఖ సమాచారం. స్వల్పకాలిక వరి రకాలను సాగుచేసిన తరువాత తక్కువ నీటి పారుదల ప్రాంతాల్లో  తేలికపాటి నీటి తడులతో వికారాబాద్‌ లాంటి జిల్లాల్లో సాంప్రదాయ పంటైన వరికి  ప్రత్యామ్న్యాయంగా జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. వరి అనంతరం అవశేష తేమ పై కూడా జొన్న పంటను వరి పొలాల అడుగులో నిరూపితమైన వంగడాలతో మేలైన యాజమాన్య పద్ధతులతో మంచి లాభాలను ఆర్జించే ఆస్కారం ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో కొన్ని ప్రాంతాలలో కంది, పెసర, మినుము పంటలు అధిక వర్షాల వల్ల దెబ్బతినడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో కూడా జొన్న పంటపై డిమాండ్‌ పెరిగే ఆస్కారం ఉంది కావున రైతులు సెప్టెంబరు రెండవ పక్షం నుండి  అక్టోబర్‌  రెండవ పక్షంలోపు జొన్న పంటను యాసంగి పంటగా విత్తుకోవడానికి అనుకూలం. సకాలంలో విత్తినప్పుడు మొవ్వు ఈగ ఉధృతిని తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. మన దేశంలో బియ్యం, గోధుమ కన్నా ముందే ప్రజలు నిత్యం జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. జొన్న ఆహారంలోని ప్రోటీన్స్‌ నిదానంగా జీర్ణమవుతాయి. ఊబకాయం, మధుమేహం లాంటి జీవన శైలి వ్యాధులతో బాధపడే వారికి చాలా ఉపయోగం.

Cultivation of Sorghum

Sorghum Cultivation

నేలలు : తేమను నిలుపుకొనే లోతైన నల్లరేగడి నేలలు అనుకూలమైనవి. నీతి వసతి ఉన్నచో ఎర్ర చల్కా నేలల్లో కూడా సాగు చేయవచ్చు.చౌడుభూములు మరియు మురుగు నీరు నిలిచే భూములు సాగుకు పనికి రావు.

అనువైన రకాలు : జొన్న పంట సాగు చేసేటప్పుడు తేమను నిలుపుకొనే బరువైన నేలలలో ఒకటి రెండు తడులు ఇచ్చే సదుపాయం ఉంటే హైబ్రీడ్‌లను ఎంచుకొని అధిక దిగుబడులను సాధించవచ్చును. తేలిక పాటి నేలల్లో అయితే సూటి రకాలను ఎంచుకోవడం మంచిది.

విత్తన మోతాదు : ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరమవుతుంది.

విత్తేదూరం : రెండు చాళ్ళ మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 15 సెం.మీ. ఉండేటట్లు, ఎకరాకు 74,000 మొక్కలు ఉండేటట్లు విత్తుకోవాలి.

ఎరువులు : భూసార పరీక్షఆధారంగా సాయిల్‌ హెల్త్‌ కార్డులో సూచించిన మోతాదులో నత్రజని భాస్వరం పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాల్సిందిగా రైతులకు సూచన. అధిక భాస్వరం కలిగిన నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 25-30 శాతం తగ్గించి వేసుకున్న దిగుబడి తగ్గకుండా ఖర్చు అదా చేయబడును. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జింకు లోప నివారణకు గాను 2 కిలోలు ఎకరాకు చొప్పున అడుగులో వేసుకోవాలి.

కలుపు నివారణ, అంతర కృషి : విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేసినట్లయితే 35 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా ఉంటుంది. విత్తిన 30`60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణ మాత్రమే కాకుండా భూమిలో పగుళ్ళు పూడ్చుకొని, తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

నీటి యాజమాన్యం : జొన్న పంటకు సుమారుగా 450-600 మి.మీ.నీరు అవసరం ఉంటుంది. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో వచ్చే వానలకు రైతులు దుక్కి చేసుకొని విత్తుకోవాలి. నీటి వసతి ఉన్న చోట ఎర్ర చెల్కా నేలల్లో 3-4 తడులు (మోకాలు ఎత్తు దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకొనే దశలలో) మరియు నల్ల రేగడి భూముల్లో ఒకటి లేదా రెండు తడులు (పూత దశ, గింజ పాలుపోసుకొనే దశల్లో) ఇచ్చినట్లయితే పంట బెట్టకు గురికాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు.

Also Read: Sorghum Disease Management: జొన్న పంటలో ఎర్గాట్ తెగులును మరియు కుంకుమ తెగులును ఎలా గుర్తించాలి?

సస్య రక్షణ :
కాండం తొలుచు పురుగు : ఈ పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోయి కంకిని వేయదు. కాండాన్ని చీల్చి చూస్తే లార్వాలు మరియు ఎర్రటి కుళ్ళిపోయిన కణజాలం కనిపిస్తుంది. ఈ పురుగు పంట 30 రోజుల దశనుండి పంటకోసే దశ వరకు ఆశిస్తుంది. దీని నివారణకు విత్తిన 30-35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3 జి. గుళికలను కాండం సుడులలో వేయాలి.

Stem Borer

Stem Borer

కత్తెర పురుగు : ఈ పురుగు ఆశించినప్పుడు లార్వాలు మొదట పత్రహరితాన్ని గోకి తినుట వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. తర్వాత సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. పురుగు విసర్జించిన పసుపు పచ్చని గుళికలను సూదులలో గమనించవచ్చును. నివారణకు పురుగు ప్రభావం తీవ్రమైన విషయంలో (దెబ్బతిన్న మొక్కలు 20 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లైతే) పంటపై స్పినెటోరామ్‌ 11.7% %ూజ% ఏ 0.5 మి.లీ / లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5 ఏ 0.3 మి.లీ. / లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి.

పంటకోత : కంకి క్రింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలోనున్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు మరియు గింజ క్రింది భాగాన నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటకోయాలి. గింజల్లో తేమ 9-10 శాతం ఉండేలా ఎండబెట్టుకొని తర్వాత గోనె సంచుల్లో నింపాలి.
పైన సూచించిన విధంగా మేలైన వంగడాలను ఎంపిక చేసుకొని, సరైన సమయంలో నిర్దేశించిన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే రైతాంగం వరికి ప్రత్యామ్నాయంగా జొన్నలో అధిక దిగుబడులను సాధించగలరు.

-కె. శేఖర్‌, డా. కె. సుజాత, డా. సి. సుధాకర్‌, డా. సి. సుధారాణి,
-డా . యన్‌. ప్రవీణ్‌, టి. రాజేశ్వర్‌ రెడ్డి, సి. మాణిక్య మిన్ని,
-డా. ఎస్‌. సందీప్‌, యమున, వ్యవసాయ పరిశోధనా స్థానం,
-తాండూరు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫోన్‌ : 90321 28124

Also Read: Sorghum Health Benefits: పజ్జొన్నల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!!

Also Watch:

Leave Your Comments

Nitrogen fertilizers: నత్రజని జీవన ఎరువులు.!

Previous article

Gladiolus Flower Cultivation : గ్లాడియోలస్‌ సాగు, సస్యరక్షణ.!

Next article

You may also like