Nitrogen fertilizers : హరిత విప్లవంలో మనం ప్రవేశ పెట్టిన హైబ్రిడ్ వంగడములు రసాయనిక ఎరువులు వాడకం నకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడకం భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మ జీవులు పైపడి వాటి సంఖ్య మారుటలోను, ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణించుటకు వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వాడకం వలన భూమిలోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం అగుటయేగాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుచున్నది.
ఈనేపధ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించటం జరిగింది. దీనిలో సేంద్రియ ఎరువులు వాడకంతోపాటు జీవన ఎరువులు వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా మొక్కలకు పోషక పదార్ధాలనుప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగచే8Gమరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లలను సమకూర్చే సూక్ష్మజీవులు సమదాయం. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనుహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతోపాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం అవదు. పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంత మేర తగ్గును. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చును.
నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు:
1. రైజోబియం
2. అజటోబాక్టర్
3. అజోస్ప్తెరిల్లమ్
4. నీలి ఆకుపచ్చనాచు
5. అజోల్లా అనాబినా
6. అసిటో బాక్టర్
7. ఫ్రాంక్రియా
రైజోబియం : లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాలు (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ సోయాచిక్కుడు వంటి నూనె గింజలు పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించవలెను. దీనిని ఉపయోగించుట వలన మొక్క వ్రేళ్ళపై లేత రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయ. ఈ బుడిపెలలో ఉన్నరైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ప్రత్యేకమైన స్ట్రెన్ ఉండును. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్ధేశించబడిన రైజోబియం మాత్రమే వాడవలెను.
ఉపయోగించు విధానం : 100 మి.లీ. నీటిలో 10 గ్రా.ల పంచదార లేదా గంజి పౌడరును కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కి.ల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా.ల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియకు రైతులు పాలిథీన్ సంచినిగాని, ప్లాస్టిక్ తొట్టినిగాని ఉపయోగించి చేసుకొనవచ్చును. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటుకొనవలెను.
రైజోబియం జీవనఎరువు తప్పనిసరిగా వాడవల్సిన ఆవశ్యకత
1. కొత్తగా లెగ్యూమ్ జాతి పంటను పొలంలో వేసేటప్పుడు.
2. గతంలో లెగ్యూమ్ జాతి పంట వేసినప్పటికి తగినన్ని వేరు బుడిపెలు (నాడ్యూల్స్) ఏర్పడనప్పుడు.
3. పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు మరియు ఏ ఇతర జాతి పంటలను వాడియున్నయెడల.
4. వాతావరణ పరిస్థితులు రైజోబియం (జీవన ఎరువు) బ్రతికి ఉండుటకు అనుకూలించనప్పుడు అనగా..
ఎ. అధిక ఆమ్ల/క్షార భూములు అయన యెడల.
బి. మురుగు నీరు నిల్వ ఉన్న పొలంలో (వరదలు వచ్చినప్పుడు)
సి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో
Also Read: Nitrogen application in soybean: సోయాబీన్ పంట లో నత్రజని పాత్ర
అజటోబాక్టర్ : పప్పుజాతి పంటలను మినహాయంచి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవనఎరువుగా ఉపయోగపడును. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించుటయే కాక మొక్కకు కావల్సిన హార్మోన్లను మరియు విటమిన్‌లను అందించును. ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్ధవంతంగా పనిచేయును. అందువలన ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటలకు సిఫారసు చేయబడుచున్నది.
వాడే విధానం : ఏ పంటకు వాడిన గాని 2 కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లవలెను. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే కాని భూమిలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకొనవలెను.
అజోస్ప్తెరిల్లమ్ : ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది ఈ బాక్టీరియా యొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వ్రేళ్ళలోకి చొరబడి కూడా జీవిస్తాయ.ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెఱకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడును. సేంద్రియ పదార్ధం తక్కువగా ఉన్న నేలలోను కూడా ఇది పని చేయును.
ఉపయోగించే విధానం : తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్ప్తెరిల్లమ్ కల్చర్‌ను 80 ` 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనము క్రింద పడేటట్లు వేసుకొనవలెను. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్ప్తెరిల్లమ్ జీవన ఎరువును బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిముషాలు వ్రేళ్ళను మాత్రమే ముంచి వెంటనే నాటుకొనవలెను. చెఱకు పంట విషయంలో నాటే విత్తనపు చెఱకు ముచ్చెలను 10 నిమిషాలు ముంచి నాటుకోవలెను.
నీలి ఆకుపచ్చనాచు (సైనొబ్యాక్టీరియా) : ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, ఎనాబినా, కెలోర్రిక్స్ మొదలగు సైనో బ్యాక్టీరియాల సముదాయంతో ఉండును. రైతులు వరి పంట కాలానికి ముందుగా చిన్న, చిన్న మడులలోగాని, తొట్టెలలోగాని పెంచుకొని వరినాట్లు వేసిన తరువాత దీనిని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3 ` 4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తరువాత నుండి వేయనవసరం లేదు.
వాడే విధానం : ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన 3`7 రోజుల వ్యవధిలో 4`6 కిలోల ఈ జీవన ఎరువును 40`50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవలెను. ఇది వేసిన 15`20 రోజులలో ఈ నాచు మందముగా, చాపలా అల్లుకుపోయన తరువాత నీరు తీసివేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేయవలెను. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని మొక్కకు అందుటయేగాక ఈ నాచు సేంద్రియ పదార్ధంగా కూడా మొక్కకు ఉపయోగపడును.
రైతులు తయారు చేసుకునే విధానం : ముందుగా తయారు చేసుకున్న నేలను మంచిగా చదునుపర్చుకొని 20I2 మీ. వైశాల్యంగల ప్లాట్‌లుగా తయారు చేసుకొని వాటికి గట్లను, నీటి కాలువలను ఏర్పరచుకోవలెను. 10 సెం.మీ. లోతు నీటిని ఉంచి దీనిలో 2 కిలోలు సూపర్ ఫాస్ఫేట్‌ను వేయవలెను. ఆ తరువాత 5 కిలోల ఖరీదు చేసిన కల్చర్‌ను సమానంగా చల్లుకోవలెను. చీడపీడలు రాకుండా 200 గ్రా.లు కార్బోఫ్యూరాన్ గుళికలను చల్లవలెను. 10 సెం.మీ. నీటి మట్టం ఎల్లప్పుడు ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. 15 రోజులలో మనకు మందమైన నాచు పొర ఈ నీటిపై ఏర్పడును. ఆ సమయంలో నీటిని పూర్తిగా తీసివేసి ప్లాట్‌ను ఎండబెట్టిన మనకు ఎండిన ఆల్గేను పెచ్చులు మాదిరిగా తీసినచో ఒక్కొక్క ప్లాట్ నుండి 30`40 కిలోలు లభ్యమగును.
అజోల్లా`అనాబినా : ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్‌జాతి చిన్న మొక్క అయిన అజోల్లా`అనాబినా అనే సైనో బాక్టీరియాకు ఆశ్రయం కలిపించి స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమేగాక, సేంద్రియ కర్భనం మరియు పొటాషియం వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను, భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి, తగినంత నీటి వసతి, భాస్వరపు పోషకం ఉన్నచోట బాగా పెరుగును.
వాడే విధానం : వరి నాటిన వారం తరువాత సుమారు 200 కిలోల అజోలా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరుగనివ్వవలెను. తరువాత నీటిని తొలగించినచో ఇది 3`4 రోజులలో కుళ్ళిపోయ నత్రజనిని మరియు ఇతర పోషకములను మొక్కకు అందించును. అవకాశమున్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియ దున్నినచో దీని ఉపయోగం మరింత బాగా ఉండును. అంతేకాక చిన్న, చిన్న తొట్టెలలో పెంచిన అజోలాను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాలో కలిపి పశువుకు తినిపించడం వలన పాల ఉత్పత్తి కూడా పెరుగును.
అసిటో బాక్టర్ : ఇది చెఱకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవనఎరువుగా ఉపయోగపడును. ఈ జీవన ఎరువుకు నేరుగా మొక్కల వ్రేళ్ళలోనే గాక మొక్కల పైభాగముల పైనను కూడా జీవించి నత్రజని స్థిరీకరించి మొక్కలకు అందించును. అంతేకాక ఎన్.ఎ.ఎ. అనబడే హార్మోను అధికంగా ఉత్పత్త చేసి మొక్క పెరుగుదలకు దోహదపడును.
వాడేవిధానం : ఒక ఎకరం చెఱకు పంటకు 4 కిలోల జీవన ఎరువును రెండు దఫాలుగా వాడవలెను. ముచ్చెలు నాటేటప్పుడు 2.0 కిలోలు మరియు మోకాలు లోతు పంటైన తరువాత 2.0 కిలోలు, 100 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి వాడవలెను.
ఫ్రాంకియా : ఇది ఎక్టినోమైసిటీస్ జాతికి చెందిన సూక్ష్మాంగ జీవి. దీన్ని సరుగుడు చెట్లకు మాత్రమే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుగా వాడుకోవలెను. ఇది సరుగు చెట్లు వ్రేళ్లపై పెద్ద సైజు బుడిపెలు ఏర్పరచి అధిక మోతాదులో నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించును.
వాడే విధానం : సరుగుడు మొక్కలను భూమిలో నాటేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కల వ్రేళ్ళపై ఉన్న బుడిపెలను సంగ్రహించి, వాటిని ఒక పాత్రలో మెత్తగా నలగగొట్టి నీటితో బాగా కలిపి ద్రావణం తయారుచేసుకోవలెను. ఈ ద్రావణంను క్రొత్త మొక్కలు నాటే ప్రతి మొక్కకు 500 మి.లీ. చొప్పున పోసి నాటుకోవలెను.
జీవన ఎరువు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వచేయవలెను.
2. రైతువాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండవలెను.
3. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్‌పై ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించవలెను.
4. రసాయనంతో విత్తనశుద్ధి చేసుకొనేటప్పుడు విధిగా 24`28 గంటల వ్యవధి ఉండవలెను.
5. రసాయ ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు.
6. సమర్ధవంతంగా పనిచేయుటకు నాణ్యతగల కల్చర్ వాడుకోవలెను.
7. పైరుకు నిర్ధేశించబడిన జీవన ఎరువును వాడుకోవలెను.
8. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవలెను.
జీవన ఎరువులు వాడకం వలన కలిగే ఉపయోగాలు :
1. వాతావరణ కాలుష్యంను అరికట్టవచ్చు.
2. వాతావరణంలోను, నేలలోని, మొక్కలు తమంతతాముఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెచ్చును.
3. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉండును.
4. నేల నుండి సంక్రమించే తెగుళ్ళను కొంతమేర అరికట్టవచ్చును.
5. నేల భౌతిక లక్షణాలు బాగుపడును మరియు భూసారం అభివృద్ధి చెందును.
6. రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అధికమగును.
7. రసాయన ఎరువుల దిగుమతికయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదా అగును.
8. సాధారణ దిగుబడులు 10`20 శాతం వరకు పెరుగును. దీనితోపాటు 20`25 శాతం రసాయనఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు.
అంతేకాకుండా ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన ద్రవరూపంలోని జీవన ఎరువులు, పొడిరూపంలో తయారు అవుతున్న జీవన ఎరువులు కన్నా ఎంతో మంచి ఫలితాలు అందచేయుచున్నవి. ఈ ద్రవ రూప జీవన ఎరువులు సుదీర్ఘమైన కాలపరిమితి కలిగి, అత్యధిక సంఖ్యలో కావల్సిన బాక్టీరియా ఉండి, ఎటువంటి చెడు బాక్టీరియా లేకుండా ఉండును. ఈ జీవన ఎరువులలో వాడే బాక్టీరియా మన భూమి నుండి సేకరించినదైనచో మరింత బాగా పని చేయును. ఈ ద్రవ రూప జీవన ఎరువులను 500 మి.లీ మోతాదును 100 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టుతో కలిపి విత్తిన లేదా నాటిన 5 రోజుల నుండి15 రోజుల సమయంలో పొలంలో సమానంగా వెదజల్లాలి.
-డా.పి. వెంకట రావు, విస్తరణ శాస్త్రవేత్త, డా.జి.చిట్టిబాబు, సస్యరక్షణ శాస్త్రవేత్త,
-డా.జే.జగన్నాధం,సమన్వయ కర్త, ఏరువాక కేంద్రం, శ్రీకాకుళం, ఫోన్ : 97052 09418.
Also Read: Nitrogen Fixing Biofertilizers: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులతో ఎన్నో లాభాలు.!
Also Watch: