చీడపీడల యాజమాన్యం

Castor Bean As A Pest Host: ఆముదంను ఆశించు చీడపీడలు యాజమాన్యం.!

0
Castor Beans
Castor Beans

Castor Bean As A Pest Host: మనదేశంలో సాగులో ఉన్న నూనెగింజల పంటలలో ఆముదం చాలా ముఖ్యమైనది. ఆముదం సాగులో మనదేశం అగ్రస్థానంలో ఉన్నది. ఆముదం నూనెను పారిశ్రామికంగా అనేక ఉత్పత్తుల తయారీలో వాడతారు. ఈ నూనె ఎగుమతి ద్వారా మన దేశం అధిక మొత్తంలో విదేశీ మారకాన్ని ఆర్జిస్తున్నది.సాధారణంగా ఆముదం పంట నుండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడిని పొందవచ్చు. కానీ సమగ్ర సస్యరక్షణ పద్ధతులనుపయోగించి చీడపీడల యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఆముదమును ఆశించు పురుగులు –
నామాల పురుగు/ దాసరి పురుగు :
సాధారణంగా ఈ పురుగు ఆగష్టు నుండి నవంబరు వరకు ఎక్కువగా కనిపిస్తుంది. తొలిదశలో ఈ పురుగు ఆకుల అడుగు భాగంలో చేరి పత్రహరితాన్ని గీకి తింటుంది. తరువాత ఆకును పూర్తిగా తినేసి ఈనెలను మాత్రమే మిగుల్చుతుంది. లార్వాలు భూమిలో లేదా ఆకుల ముడతలలో కోశస్థ దశకు చేరతాయి.
సస్యరక్షణ :

  • ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఎకరానికి 50 వేల చొప్పున వదిలి పురుగు ఉధృతిని నియంత్రించవచ్చు.
  • పురుగు తొలిదశలో ఉన్నప్పుడు అజాడిరక్టిన్‌ 1500 పిపియం 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  •  ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ లేదా నొవాల్యురాన్‌ 1 మి.లీ లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
    పొగాకు లద్దె పురుగు :పంట అన్ని దశలలోనూ ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. తొలి దశ లార్వాలు ఆకుల అడుగు భాగంలో చేరి గోకి తినడం వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారుతాయి.
Castor Bean As A Pest Host

Castor Bean As A Pest Host

సస్యరక్షణ :

  • వేసవిలో లోతు దుక్కులు చేసినట్లయితే కోశస్థ దశలు నాశనమవుతాయి.  గుడ్ల సముదాయాన్ని మరియు పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి.
  • మొదటి దశ లార్వాల నివారణకు అజాడిరక్టిన్‌ 1500 పిపియం 5 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  •  ఎకరానికి 4-8 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం ద్వారా పురుగు ఉధృతిని గమనించవచ్చు.
  • ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఇందుకుగాను 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం, 500 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరిపైరిఫాస్‌ కలిపి చిన్న ఉండలుగా తయారు చేసుకుని పొలంలో అక్కడక్కడ  సాయంత్రం వేళల్లో చల్లాలి.
  •  పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఫ్లూబెండామైడ్‌ 0.25 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
     కొమ్మ, కాయ తొలుచు పురుగు : పంట పుష్పించే దశ నుండి ఈ పురుగు ఉధృతి ఉంటుంది. ఈ పురుగు లేత పసుపు పచ్చగా ఉండి పై భాగంలో గులాబీ రంగు కలిగి ఉంటుంది. లార్వా కాయలను తొలచి కాయల మధ్య వాటి విసర్జితాలతో గూడును అల్లి అభివృద్ధి చెందుతున్న గింజలను తిని పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది.
    ఈ పురుగు నివారణకు పూత దశలో ఒకసారి మరియు 20 రోజుల తరువాత మరొకసారి ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Also Read:Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!

 పచ్చ దోమ :
తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల నుండి రసం పీల్చడం వలన ఆకులు పసుపుపచ్చగా మారి తరువాత మాడిపోతాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Moth Bean Inscet pest

Moth Bean Inscet pest

ఆముదంను ఆశించు తెగుళ్లు –
 బూజు తెగులు :
ఈ తెగులు సాధారణంగా వానాకాలం సాగు చేసే ఆముదంలో కనిపిస్తుంది. తుఫాను సమయంలో 5-6 రోజులు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల కంటే తక్కువ నమోదైనప్పుడు మరియు గాలిలో తేమ 90 శాతం ఉన్నప్పుడు తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. తెగులు సోకిన కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి బూడిద వంటి శిలీంద్రం పెరుగుతుంది. తరువాత కాయ లోపలికి శిలీంధ్రం వ్యాపించి కాయలు మెత్తబడి కుళ్ళిపోయి రాలిపోతాయి.
తెగులు నివారణకు మొక్కల మధ్య సిఫార్సు చేసినంత దూరం పాటించాలి. సాధారణంగా తుఫాను సూచనలు వెలువడిన వెంటనే 6- 8 గంటల ముందు 1 లీటరు నీటికి 1 మి.లీ. ప్రొపికొనజోల్‌ లేదా 1 గ్రా. కార్బెండజిమ్‌ లేదా 1గ్రా. థయొఫెనెట్‌ మిథైల్‌ కలిపి గెల తడిచేలా పిచికారీ చేసుకోవాలి. తుఫాను తర్వాత కూడా మరొకసారి పిచికారీ చేసుకోవాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియ, 10 కిలోల పొటాష్‌ ఎరువులను పైపాటుగా వేసుకున్నట్లయితే తెగులు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చును.
 ఎండు తెగులు : ఈ తెగులు సాధారణంగా పంట తొలిదశ నుండి చివరి వరకు ఆశిస్తుంది. ఈ తెగులు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కలు పసుపు రంగుకి మారి గిడసబారి పోతాయి. తరువాత మొక్క మొత్తం ఎండిపోతుంది. మొక్క కాండాన్ని చీల్చి చూస్తే లోపల నలుపు రంగుకి మారి తెల్లని బూజు కనిపిస్తుంది.

  • తెగులు నివారణకు ముందుగా కిలో విత్తనానికి 1 గ్రా. కార్బెండజిమ్‌ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి, లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్ర నాశినిని వాడి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
  • పంటను ఒకే నేలలో ప్రతిసారి సాగు చేసినప్పుడు కూడా తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. అందువల్ల రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. లేనిపక్షంలో 2 కిలోల ట్రైకోడెర్మా పొడి మందును 100 కిలోల పశువుల ఎరువులో కలిపి 15 రోజులు మాగబెట్టి ఆఖరి దుక్కిలో చల్లుకోవాలి.
  • తెగులు సోకిన మొక్కల మొదళ్లలో 1 గ్రా. కార్బెండజిమ్‌ లేదా 3 గ్రా. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ పొడిమందును లీటరు నీటికి కలిపి నేల, మొక్క మొదలు తడిచేలా పోసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
Castor Bean

Castor Bean

 మొదలు కుళ్ళు తెగులు : ఈ తెగులు నాటిన 30`40 రోజుల్లోపు వస్తుంది. నేలలో అధిక తేమ, అధిక వర్షపాతం మరియు పంటను ఒకే పొలంలో సాగు చేయడం వంటి సందర్భాలలో ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. విత్తనం మొలకెత్తిన తరువాత బీజ దళాల పై మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతాయి. ముదురు ఆకులపై కాండంపై పెద్ద మచ్చలు ఏర్పడి మొక్క చనిపోతుంది. దీని నివారణకు కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌/ కాప్టాన్‌ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల మొదళ్లలో 1 గ్రా. కార్బెండజిమ్‌ లేదా 3 గ్రా. కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పోసుకోవాలి. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించి చీడపీడల నివారణ చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

-డా. కె.సదయ్య, శ్రీమతి. జి. మాధురి, డా. వి. దివ్యారాణి,
-డా. జి.ఈశ్వర్‌ రెడ్డి, డా. ఎన్‌. నళిని, డా. ఎం.సుజాత, డా. ఎం.గోవర్ధన్‌.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, నాగర్‌ కర్నూల్‌ జిల్లా, ఫోన్‌ : 8885331799

Also Read:Pest Management in Sugarcane: చెరకు పైరునాశించు తెగుళ్లు సమగ్ర యాజమాన్య చర్యలు.!

Must Watch:

Leave Your Comments

Pest Control in Chillies: మిరపలో తెగులు నియంత్రణ.!

Previous article

Coconut and Cocoa Crops in September: కొబ్బరి, కోకో పంటలలో సెప్టెంబర్‌ మాసంలో చేపట్టవలసిన పనులు.!

Next article

You may also like