పండ్ల తోటల సాగుకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలును సరైన మోతాదులో, సరైన సమయంలో అందించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రధానపోషకాలు మొక్కకి అందుబాటులో ఉన్నప్పటికి, సూక్షపోషకలోపాలు ఉంటే దిగుబడులు తగ్గటాన్ని గమనించవచ్చు. సూక్ష్మపోషకాలులో ముఖ్యమైనటువంటి బోరాన్ లోపించింవినట్లయితే పూత, కాత తగ్గడమేగాక, పండ్ల దిగుబడి, నాణ్యత లోపించి మార్కెట్లో సరైన ధర లభించక రైతులకు నష్టం కలుగుతుంది.
అరటిలో బోరాన్ ధాతు లోపం ఏర్పడినప్పుడు లేత ఆకులు విప్పారుట ఆలస్యమవడమేగాక, అసమానతలు కలిగి ఉంటాయి. ఆకులు గరుకుగా, దళసరిగా మారి పెళుసుబారుటయేగాక, ఆకులపై నిచ్చెనలాంటి పసుపు వర్ణపు మచ్చలు ఏర్పడుతాయి. కాయల్లో నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు గోధమరంగుకు మారి, గట్టిగా ఉండి, తినడానికి పనికి రాకుండా పోతాయి పండు నిల్వ శక్తి తగ్గి త్వరగా చెడిపోతాయి.
నివారణ:
పిలకలు నాటే సమయంలో గుంతల్లో 10 గ్రా. బోరాక్స్ వేసినట్లయితే వేరు వ్యవస్థ బాగా వృద్ది చెందుతుంది. ఒక లీటరు నీటికి 2 గ్రా. సాల్యుబార్ లేదా పోలీబార్ లేదా గ్రాన్యుబార్, 10 గ్రా. యూరియా + అర మి.లీ. సబ్బు బంక కలిపి నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారి చేసినట్లయితే లోపాన్ని నివారించుకోవచ్చు.