Management of Dairy Cattle by Farmers:
ఆరోగ్య సంరక్షణ :
1. దూడలకు మరియు గొర్రెలకు నట్టల మందులు త్రాగించాలి.
2. పశువులు, గొర్రెల పాకలలో వేపాకుతో పొగవేసి ఈగలు, దోమలు ఆశ్రయించకుండా జాగ్రత్త పడాలి.
3. గొర్రెలకు చిటుక రోగం నివారణ టీకాలు వేయించాలి.
4. నీలి నాలుక వ్యాధి వచ్చు కాలం కావున ముందుగా టీకాలు వేయించుకోవాలి.
పశుగ్రాసాల సాగు :
1.వర్షాధారంగా వేసిన జొన్నజాతి మేతలు చివరి కోతకు సమయము, విత్తనాలు తయారు చేసుకోవచ్చు.
2.పచ్చి మేత అధికంగా లభిస్తుంది కావున సైలేజి మావుడుగడ్డి తయారు చేసుకోవాలి.
పశువుల ఉత్పాదకత పెంపు :
1. గేదెలు ఎదకు వచ్చే మాసం, గర్భధారణ చేయించాలి.
2. పాడి పశువులకు చూడి పరీక్షలు చేయించాలి.
3. గొర్రెలను జతకట్టించాలి.
4.పాడి పశువుల మేతగా అజోల్లా.
భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. వ్యవసాయంతో పాటు పాడి పశువుల పోషణ కూడా వ్యవసాయానికి మంచి ఊతమిస్తుంది. కానీ ఇటీవల కాలంలో పాడి పశువుల పెంపకం చాలావరకు తగ్గింది. వర్షాలు సరిగా పడకపోవడం, నీటి సదుపాయం లేకపోవడం, భూగర్భజలాలు ఇంకిపోవడం వంటి దుర్భర పరిస్థితులు పశుపోషణ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కానీ రైతులు పశుసంపదను జీవనోపాధిగా తీసుకొని మంచి లాభాలను పొందవచ్చును.
కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గం ఆధ్వర్యంలో, దాసంపల్లి గ్రామంలో పశుపోషణలో భాగంగా అజోల్లా పెంపకాన్ని చేపట్టడం జరిగింది. గ్రామంలోని చిన్న సన్నకారు రైతులకు ఈ అజోల్లా పెంపకంపై అవగాహన కల్పిస్తూ, వారి జీవనోపాధిని పశుపోషణ ద్వారా మెరుగుపరచడం జరుగుతుంది.
అజోల్లా : అజోల్లా అనేది నీటిలో తేలియాడే ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన మొక్క శాస్త్రీయ నామం అనిబీనా అజోల్లా. ఇది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, నత్రజనిని తీసుకొని పిండి పదార్థాలుగా తయారు చేసుకుంటుంది. దీనిని పశువులు, మేకలు, గొర్రెలు, పందులు, కుందేళ్ళు, చేపలు వంటి వాటికి కూడా అజోల్లాను మేతగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా రోజూ ఒకటిన్నర నుండి రెండు కిలోల అజోల్లాను పాడిపశువులకు దాణాగా పెడితే పాల దిగుబడి 15-20 శాతం పెరగడమే కాక పశువుల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. తాజా అజోల్లాను 1:1 నిష్పత్తిలో పశువుల దాణాలో కలిపి వాడవచ్చు. అజోల్లాను పశువులకు నేరుగా కూడా తినిపించవచ్చు. దీనిలో పశుదాణా సగానికి సగం తగ్గించవచ్చు. అజోల్లాను దాణాగా వాడటం ద్వారా ఖర్చు 20-25 శాతం తగ్గించవచ్చు. అజోల్లాను. దాణాగానే కాకుండా జీవ రసాయన ఎరువుగానూ, దోమల నివారిణి గానూ, పాశ్చాత్య దేశాల్లో కొన్ని రకాల పంటల్లో ముఖ్యంగా సలాడ్ తయారీలో ఉపయోగిస్తున్నారు.
సిమెంట్ తొట్టిలో అజోల్లాను ఉత్పత్తి చేయడం : ముందుగా చెట్ల నీడలో సూర్యరశ్మి అంతంత మాత్రమే ప్రసరించే ప్రాంతంలో భూమిపై కలుపును పూర్తిగా తొలగించి సమానంగా చదును చేసుకోవాలి. నాలుగు అడుగుల వైశాల్యం, ఒక అడుగు లోతు గల ఒరలను తీసుకొని క్రిందిభాగంలో మూతపెట్టి, పైన ఒరపెట్టాలి. తొట్టి నుండి నీరు బయటికి పోకుండా తొట్టి లోపలి భాగంలో సిమెంట్‌తో గచ్చు చేసుకోవాలి. తర్వాత 5-10 కిలోల మంచి సారం గల మట్టిని జల్లెడపట్టి, ఆ మొత్తం మట్టిని ఒరలో ఒకే విధంగా, సమానంగా ఉండేటట్లు పోయాలి. తరువాత 4-5 కిలోల పరిమాణం గల 2-5 రోజుల నిల్వ ఉంచిన పశువుల పేడను 15-20 లీటర్ల నీటిలో కలిపి గుజ్జుగా తయారుచేసి, దీనికి 40 గ్రా.
మినరల్ మిక్చర్‌ను కలిపి, తొట్టిలోని మట్టి మీద పోయాలి. 7-10 సెం.మీ. నీటి లెవల్ ఉండేలా చూడాలి. దీని కొరకు మరింత నీటిని కలపాలి. తరువాత బెడ్లోని మట్టిని నీటిని కలియతిప్పాలి. నీటి లెవల్ 7-10 సెం.మీ. ఉండునట్లు చూసి, 1-1.5 కిలోల తాజా మదర్ కల్చర్ అజోల్లాను ఈ బెడ్ మీద సమానముగా ఏడేలా చల్లాలి. తరువాత మంచి నీటిని అజోల్లా పై చిలికినట్లయితే అజోల్లా ప్లాంట్ నిటారుగా నిలుస్తుంది. ‘‘అజిల్లా త్వరగా వారం రోజుల్లో పెరిగి, గొయ్యి మొత్తాన్ని 7-10 రోజులలో ఆక్రమిస్తుంది. (1 కిలో నుండి వారం రోజులలో 8-10 కిలోలు దిగుబడి వస్తుంది). 7వ రోజునుండి అజోల్లాను ప్రతి రోజు వాడుకోవచ్చు. ఆ తర్వాత వారానికొకసారి 1 కిలో పేడను, 20 గ్రా.ల మినరల్ మిక్చర్, 5 లీటర్ల నీటితో కలిపి, గుజ్జుగా చేసి, అజోల్లా తొట్టిలో పోయాలి. మినరల్ మిక్స్చర్ దొరుకు స్థలం : అనిమల్ న్యూట్రిషన్ విభాగము, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యునివర్సిటీ, తిరుపతి.
ఉపయోగాలు : అజోల్లా ఎక్కడైనా సులభంగా పెరిగే నీటి మొక్క. దీన్ని అన్ని కాలాల్లో పెంచవచ్చు. ముఖ్యంగా ఇందులో తక్కువ లిగ్నిన్ ఉండటంతో పశువులు దీన్ని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. పశువుల వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి, పాల నాణ్యత పెరుగుతాయి. కోళ్ళ దాణాగా వినియోగించడం వల్ల కోళ్ళు అధిక బరువు పెరుగుతాయి. ఇవి సాధారణంగా వరి మడిలో పెరుగుతూ నీటిలోని జింక్, ఐరన్, మాంగనీస్ వంటి ధాతువులను, కరిగించి వరి పంటకు బాగా అందించడం ద్వారా వరి పంట బాగా పెరుగుతుంది. వరి పంటలో అజొల్లా సూర్యరశ్మికి నీరు ఆవిరి కాకుండా చేస్తుంది. వరిలో పెరిగే కలుపు మొక్కలను కూడా నివారిస్తుంది. నేరుగా దాణాగా వాడొచ్చు లేదా మామూలు దాణాలో కూడా 1:1 నిష్పత్తిలో వాడుకోవచ్చు. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో మాంసకృత్తులు (ప్రోటీన్లు) 25-33 శాతం ఉంటాయి. ఇంకా అమైనో ఆమ్లాలు, నత్రజని, కాల్షియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, చక్కెర, పిండిపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
అజోల్లా పెంపకంలో మెలకువలు : అజోల్లా మొక్కల పెంపకంలో 20-280 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య సూర్యరశ్మి నేరుగా పడకుండా నీడను ఏర్పాటు చేయాలి. గుంతలో 10-12 సెం.మీ. నీరు ఉండాలి. అజొల్లా గుంట నిర్మాణాన్ని చాలా తక్కువ ఖర్చుతో చేపట్టవచ్చు. అజోల్లా ఉత్పత్తి కోసం 2 గుంటలను నిర్మించుకోవడం మంచిది. ఒకవేళ పశువుల సంఖ్య అధికంగా ఉంటే ఎక్కువ గుంటలను నిర్మించుకోవాలి. ఒకసారి గుంటలను నిర్మించుకుంటే నీటి యాజమాన్యం చాలా సులువుగా చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ ఖర్చుతో పాల దిగుబడులను పెంచుకొని అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
Also Read: Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు
పశువుల దాణాగా అజొల్లా : ఎండబెట్టిన అజోల్లా పొడిలో 25-35 శాతం మాంసకృత్తులు, 10-15 శాతము మినరల్స్, 7-10 శాతం అమైనో ఆమ్లాలు మరియు కెరోటిన్, బి12 విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చును. అజోల్లా వాడకం వల్ల పాల నాణ్యత పెరుగుటయేగాక, పశువుల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్ళు, కోళ్ళకు కూడా అజొల్లా మేతగా ఉపయోగపడుతుంది. తాజా అజోల్లాను 1:1 నిష్పత్తిలో పశువుల దాణాలలో కలిపి వాడవచ్చును. అజోల్లాను పశువులకు డైరెక్టుగా కూడా తినిపించవచ్చు. తద్వారా పశుదాణా వాడకం. సగానికి సగం తగ్గించుకోవచ్చును.
అజోల్లా పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. అజోల్లా పెంపకానికి డైరెక్టుగా సూర్యకాంతి పడే చోటగానీ, మరీ ఎక్కువ నీడగల ప్రదేశం అనుకూలంగా వుండదు.
2. అజోల్లా గుంటలలో ఆకులు రాలినట్లయితే అజోల్లా కుళ్ళిపోయే ప్రమాదముంది. కాబట్టి అజోల్లా పెంచు గుంటలు ఆకులు రాలిపోయే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోకూడదు.
3. గుంటలలో నీటి మట్టం కనీసం 5 సెం.మీ. తగ్గకుండా, గుంట యొక్క ప్రతిమూలలో నీరు సమానంగా ఉండేటట్లు చూడాలి.
4. పోషకాలలో లోపం లేకుండా చూడాలి. అవసరమైతే తెగుళ్ల నిరోధానికి మందులు వాడాలి.
5. 10 రోజులకొకసారి బెడ్లో 4వ వంతు నీటిని తీసివేసి, కొత్త నీటితో మళ్ళీ నింపాలి.
6. 60 రోజుల కొకసారి 5 కిలోల బెడ్ మట్టిని తొలగించి, తిరిగి 5 కిలోల కొత్త మట్టిని బెడ్ అంతా పరచాలి.
7. ప్రతి 6 నెలల కొకసారి మట్టిని, నీటిని అజోల్లాను తొలగించి, క్రొత్తగా తయారు చేసిన నీటిని, మట్టిని,అజోల్లాను క్రొత్తగా వేయాలి.
8. పూర్తిగా పాడైపోయిన అజోల్లాను మరియు తెగుళ్ళ బారిన పడిన అజోల్లాను పూర్తిగా తొలగించి, తాజా అజోల్లాను వేయాలి. చీడ పీడలు ఆశించిన అజోల్లాను, పురుగు మందులు వాడిన అజోల్లాను పశుమేతగా వాడరాదు.
9. ఫంగస్ వలన వచ్చే కుళ్ళుడు వ్యాధి సోకినపుడు అజోల్లాను బెడ్ నుండి తీసి, వేరే చోట పూడ్చి వేయాలి.
పశు మేతగా మేపటం ఎలా ?
- రంద్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో, సేకరించిన అజోల్లాను వుంచాలి. సగం నీరు నింపిన బకెట్ మీద ట్రేసు వుంచి, పైనుండి నీటిని పోసి, ఆవు పేడ వాసన పోయేటట్లుగా కడగాలి. చిన్న అజోల్లా ముక్కలు రంధ్రాల ద్వారా బకెట్లోనికి వెళతాయి. ఆ నీటిని మరల బెడ్లో పోయుటవల్ల అజోల్లా తిరిగి పెరుగుతుంది.
- అజోల్లాను పశువుల దాణాతో 1:1 నిష్పత్తిలో వాడటము రైతులకు చాలా లాభదాయకం. అజోల్లా వాడుతూ రైతులు పశుపోషణ తగ్గించుకోవచ్చును. అధిక పాలఉత్పత్తి చేయవచ్చును.
-డా.ఎమ్.హరణి, ఎస్.ఎమ్.ఎస్.(వెటెరినరి), కె.వి.కె, కళ్యాణదుర్గం
-డా.వి.యుగంధర్, ఎస్.ఎమ్.ఎస్.(హార్టికల్చర్)
-డా.ఇ.చండ్రాయుడు, సమన్వయ కర్త,
-కె.వి.కె, కళ్యాణదుర్గం, ఫోన్ : 91 79816 14152
Also Read: Lumpy Skin Disease in Cattle: లంపీ స్కిన్ వ్యాధి లేదా ముద్ద చర్మ వ్యాధి.!
Must Watch: