Sugarcane Pest Control: దూదేకుల పురుగు (పైరిల్లా) ఆశించుట వలన చెరకు దిగుబడులు 28 శాతం వరకు తగ్గటమే కాక చెక్కర శాతం 1. 6 వరకు తగ్గుతుంది. ఈ పురుగు చెరకు ఆకుల అడుగు భాగాన్ని ఆశించి కణద్రవ్యాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి తదుపరి ఎండిపోవటం జరుగుతుంది.
ఈ పురుగు గణనీయంగా పెరుగుటకు గల అనుకూల పరిస్థితులు :
1. అధిక ఎరువులు వాడకం.
2. అధిక మొక్కల సాంద్రత కలిగి ఉండడం.
3. నీటి ముంపు, మురుగు అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలలో ఈ పురుగు ఉధృతికి అనుకూలం.
4. వాతావరణంలో తేమ శాతం అధికంగా (75`80 శాతం) ఉండుట, ఉష్ణోగ్రతలు చేరిన చోట ఈ పురుగు అధికంగా ఆశిస్తుంది.
5. మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అధికమౌతుంది.
Also Read: Sugarcane Seed Development Methods: చెరకు విత్తనాభివృధిలో పద్ధతులు.!
దూదేకుల పురుగు గుర్తింపు చిహ్నాలు :
- తల్లి పురుగు ఆకు పచ్చ నుండి గడ్డి రంగులో ఉండి 7-8 మి.మీ పొడుగు ఉంటాయి.
- తల్లి రెక్కల పురుగు బూడిద రంగులో ఉండి వాటి చివరలు ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి.
- తల ముందుకు పొడుచుకొని వచ్చి కొమ్ములాగా ఉంటాయి. సూటిగా ఉన్న ముక్కుతో వాటి నోటి భాగాలను దాచి వాటి సాయహంతో మొక్కలలో రసాన్ని పీల్చుకుంటాయి.
- మగ తల్లి పురుగుల రెక్కల విస్తీరణం 16-18 మి.మీ. మరియు ఆడ తల్లి పురుగు రెక్కల విస్తీర్ణం సుమారు 19-21 మి.మీ. ఉంటాయి.
- ఆడ రెక్కల పురుగు సుమారు 600-800 గుడ్లలను తమ జీవిత కాలంలో పెట్టే సామర్థ్యం కలిగి ఉంటాయి. గ్రుడ్లు సముదాయంగా పెట్టి తెల్లటి మైనం పొరలతో కప్పి ఉంచుతుంది.
- ఒక గ్రుడ్డు సముదాయంలో సుమారు 30-40 గ్రుడ్లు, 4-5 వరుసలలో కలిగి ఉంటాయి.
- పిల్ల పురుగులు బూడిద రంగులో ఉంటాయి. వీటి చివర తెల్లటి రెండు కాడలుంటాయి.
నివారణ చర్యలు :
1. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలి.
2. తోట పడిపోకుండా సకాలంలో కట్టుడు కట్టాలి.
3. పురుగుల గుడ్లు సముదాయాలను గమనించిన వెంటనే నాశనం చేయాలి.
4. తల్లి పురుగుల ఉనికిని గ్రహించుటకు దీపపు ఎరలను ఎర్పాటు చేసుకోవాలి. ఈ పురుగు రాత్రి పూట 8.00 %జూ ఎ -10.00 జూఎ% సమయంలో చురుకుగా ఉంటుంది. కావున ఈ సమయంలో దీపపు ఎరలను అమర్చుకుంటే మేలు.
5. ఈ పురుగు నిర్ణిత ఉధృతి స్థాయి 3-5 పురుగులు ఒక ఆకుకు గమనిస్తేనే రసాయన చర్యలను వాడుట మంచిది.
6. జీవ నియంత్రణ పద్ధతులలో ఎపిరికేనియా మెలనోల్యూక కోశస్థ దశ పురుగులు 1800-2000 మరియు 1.8 -2.0 లక్షల గ్రుడ్లు ఎకరానికి చొప్పున విడుదల చేసే మంచి నివారణ సాధ్యపడుతుంది.
7. టెట్రాస్దికస్ ఫైరిల్లా అనే గుడ్లు పరాన్నజీవి యొక్క 2 లక్షల గ్రుడ్లలను దూదేకుల పురుగు గ్రుడ్ల దశలో విడుదల చేసి మంచి ఫలితాలు సాధించవచ్చు.
8. సహజ శత్రువుల ఉన్నప్పుడు రసాయన మందుల వాడకం వాయిదా సరైనది.
9. పురుగు ఉధృతి అధికంగా ఉంటే క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ. లేదా డైమిధోయేట్ 1.6 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి.
ఈ విధంగా సూశించిన నివారణ చర్యలను రైతులు చేపట్టినట్లైతే దూదేకుల పురుగు / ఫైరిల్లా పురుగు నుండి చెరకు పైరును కాపాడి అధిక దిగుబడులు పొందవచ్చును.
డా.డి సుధా రాణి , శాస్త్రవేత్త (సస్య రక్షణ విభాగం), చెరకు పరిశోధన స్థానం, ఉయ్యూరు.