Poultry Diseases During Monsoon – వైరస్ వలన కలిగే వ్యాధులు:-
కొక్కెర తెగులు (రానికెట్ రోగం): ఈ వ్యాధి మిగతా వ్యాధులన్నింటి కంటే అతి భయంకరమైనది. ఈ వ్యాధి వల్ల ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోతాయి. ఈ వ్యాధి ఏ వయసు కోళ్ళకైనా రావచ్చు. ఈ రోగానికి గురైన కోళ్ళు ముడుచుకొని ఉండి రెక్కలు వ్రేలాడదీస్తాయి. పక్షవాతపు లక్షణాలు కనిపిస్తాయి. మెడ వెనక్కి వాలుతుంది. విరేచనాలు తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
శ్వాసలో కూడా ఇబ్బంది కలుగుతుంది. సన్నని రక్తపు గడ్డల చుక్కలు గిజర్డు మరియు పెరికార్డియంలో కనబడతాయి. ప్రొవెంట్రిక్యులస్ లో సన్నని రక్తపు చుక్కలుంటాయి. ప్రేగులో పొరలు ఎర్రబారటం, సీకా జంక్షన్లో రక్తపు జీరలుంటాయి. ప్రేగుల్లో అల్సర్స్ ఉండవచ్చు. నివారణకు మొదటి వారం, 4వ వారం, ఆ తరువాత 6-8 వారాల మధ్య మరొకసారి, చివరిగా 20వ వారం టీకాలు వేయటం వలన చాలా వరకు కోళ్ళను ఈ రోగం నుండి రక్షించుకోవచ్చు.
కోళ్ళ మశూచి (ఫౌల్ ఫాక్స్) : కోళ్ళ అంటువ్యాధుల్లో ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన గ్రుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం లేదా కోళ్ళు చనిపోవుటం జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద, తుమ్మెలకు, కనురెప్పల చుట్టు పోక్కులు ఏర్పడతాయి. అప్పడుప్పడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. ఇవి 6-7 వారాల వయస్సులో మరలా 16-17 వారాల మధ్య వేయాలి.
కొరైజ : కోడి పిల్లలు సరిగా నీటిని, మేత తీసికొనక బరువును కోల్పోతాయి. ముక్కునుండి, కళ్ళనుండి నీరు కారుట రోగ లక్షణాలు. కళ్ళల్లో ఉబ్బి తెల్లని చీము గడ్డలుగా తయారవుతాయి. మరణసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశించిన, అన్ని బ్యాచ్లకు ఈ రోగం వస్తూనే ఉంటుంది. ఒక బ్యాచ్లో ఈ వ్యాధి వచ్చినప్పడు కొద్ది రోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లో లాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కలిపి జల్లివేయాలి. లిట్టరు ఎల్లప్పడు పొడిగా ఉండేలా చూడాలి. రోగం సోకిన పిల్లలకు యాంటిబయాటిక్ మందులు విటమిన్ల తో కలిపి వారం రోజులు వాడిన తరువాత పూర్తిగా నయమవుతుంది.
బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు-పుల్లోరం: చిన్న పిల్లలు ఎక్కువగా గురికాబడతాయి. ఈ వ్యాధి తల్లి నుండి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడటం, భారంగా శ్వాసతీయడం, రెక్కలు వాల్చడం గమనించవచ్చు. తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. గుండె, గిజర్డ్, కాలేయం మరియు పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయాటిక్ మందులు వాడాలి. ఇవికాక కోళ్ళ కలరా, ఇన్ఫెక్షియస్ కోరైజా అనే రోగాలు కూడా సోకవచ్చు.
ఎశ్చరీషియా కొలై : బ్రాయిలర్ పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రంగా వస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధితో బ్రాయిలర్స్‌లో బరువు సరిగ్గా రాకపోవడం వల్ల నష్టం వాటిలుతుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నీరసంగా ఉండి మేత సరిగా తినకపోవడం జరుగుతుంది. మరణించిన కోడి పిల్లల ప్రేగులు ఉబ్బి ఉంటాయి. యాంటిబయోటిక్స్ మందులు మేతలో మరియు నీటిలో వాడితే ఈ వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు. తాగు నీటితో పాటు సేనిటైజర్ మందును కోళ్ళకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు.
అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధి- కాక్సీడియోసిస్ (రక్తపారుడు రోగం)-ప్రోటోజోవా వలన సోకే ఈ వ్యాధితో తరచు బ్రాయిలర్ కోళ్ళ పరిశ్రమ తీవ్ర నష్టానికి గురవుతుంది. బ్రాయిలర్స్ అధిక సంఖ్యలో మరణించడం, రోగం నుంచి కోలుకున్న పిల్లల్లో బరువు సరిగా రాకపోవడం జరుగుతుంది. మేతలో కాక్సిడియోస్టాట్స్ సరిjైున మోతాదుల్లో వాడనప్పుడు గాని, అసలు వాడక పోవడం వలన గాని ఈ వ్యాధి వస్తుంది. 11వ రోజు నుండి 8వ వారం లోపల ఎప్పుడైనా ఈ వ్యాధి బ్రాయిలర్ పిల్లలకు సోకవచ్చు. రోగం సోకిన పిల్లలు మూలాలకు గుమిగూడి సుస్తిగా ఉంటాయి. ఎరుపు వర్ణం గల రెట్టను చూడవచ్చు. మేత మరియు నీరు తక్కువ తీసుకొంటాయి. మరణించిన పిల్లల ప్రేవులు ఉబ్బి రక్తం కలిగి ఉంటాయి. మేతలో మరియు నీటిలో కాక్సీడియోస్టాట్ మందులు తగు మోతాదులో వాడితే ఈ రోగాన్ని నివారించవచ్చు.
డా. జి. రాంబాబు, పశువైద్యాధికారి, కడప, ఫోన్ : 94945 88885
Also Read: Avian Leukosis Complex in Poultry: కోళ్ళలో ఎవియన్ ల్యూకోసిస్ కాంప్లెక్స్ వ్యాధిని ఇలా నివారించండి.!
Must Watch: