Pest Control in Red Gram: అపరాలలో కంది ప్రధాన పంట, మన రాష్ట్రంలో కంది వర్షాధార పంటగా అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడంతో రైతులు కందిని ఆలస్యంగా విత్తుకున్నారు కానీ అంతలోనే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కంది పంటకు చాలా నష్టం వాటిల్లింది పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కంది మొలక కూడా రాలేదు రైతులు రెండవసారి కంది పంట విత్తుకున్నా కూడా తర్వాత కురిసిన అతి భారీ వర్షాల వల్ల పైటోఫ్తోతోరా వడలు తెగులు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లింది. కావున ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది.
తెగులు అనుకూల వాతావరణ పరిస్థితులు : ఈ తెగులు అధిక వర్షపాతం మరియు నీరు నిలువ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. పైరు తొలిదశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా అధిక వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వసతి లేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితులలో ఎక్కువగా కనిపిస్తుంది.
తెగులు గుర్తింపు లక్షణాలు : ముఖ్యంగా తెగులు తొలిదశలో ఆశించినట్లయితే ఆకులు మరియు కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తరువాత గోధుమ రంగుకు మారుతాయి. ఈ మచ్చలు తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలు పోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి.మొక్కల కాండంపై మచ్చలు గోధుమరంగు నుండి నలుపు రంగుకు మారి మాడినట్లుగా కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కనుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్లు కనిపిస్తాయి. ఈ పగుళ్లు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలికగా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదల నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార, విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి కనిపిస్తుంది.
Also Read: Protect Crop From Wild Pigs: అడవి పందులు పొలంలోకి రాకుండా ఉండాలి అంటే ఎలా చేయండి.!
నివారణ పద్ధతులు –
పంట మార్పిడి : శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది కావున రైతులు కచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టాలి అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా అని జీవ సంబంధ రసాయన శిలీంద్రాన్ని చివికిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తరువాత పొలం మొత్తం వెదజల్లాలి.
విత్తన శుద్ధి : మెటలాక్సిల్ ఏ 2 గ్రాములు/ 1 కేజీ విత్తనానికి రెండు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి దాని తరువాత ట్రైకోడెర్మా 10 గ్రా./ 1 కిలో విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఎత్తు మడులు : సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తనం వలన అధిక వర్షాలకు మీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కావున దీనికి బదులుగా ఎత్తు మొదలు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వలన వర్షపు నీరు నిల్వకుండా చేయవచ్చు. దీనికిగాను 4 అడుగుల ఎడంతో బెడ్‌ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి.
రసాయన మందుల యాజమాన్యం : అధిక వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదా మ్యాంగోజబ్ అనే మందులు రెండు గ్రాములు లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసి వేసి చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందు పిచికారి చేసుకోవాలి.
-సి. యమున, శాస్త్రవేత్త మరియ డా. యన్. ప్రవీణ్. ప్రధాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం. తాండూర్, వికారాబాద్
Also Watch :