మామిడిలో బోరాన్ లక్షణాలు ముందుగా లేత ఆకులు, కొమ్మల్లో గమనించవచ్చు. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకుల కొనలు నొక్కుకు పోయినట్లుగా మారుతాయి. ఆకులు పచ్చదనం కోల్పోయి కంచు రంగుకు మారి జీవం లేకుండా పోతాయి. మామిడిలో ఆల్ఫాన్సో రకం బోరాన్ లోపాన్ని తట్టుకోలేదు. ఈ రకం మామిడిలో లేత ఆకుల చివర్లో కణజాలం నశించి నల్లగా మార లేత కొమ్మలు ఎండిపోతాయి. ఆకుల్లో తయారైన పిండి పదార్థాలు, పూత, పిందె, కాయలకు సక్రమ రవాణ లేకపోవడం వాల్ల ఆకులు దళసరిగా మారి, వంపులు తిరగడమేగాక, పూత, పిందె, కాయలు ఎక్కువగా రాలిపోతాయి. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడుట, పండుకండలో గోధమరంగు మచ్చలు ఏర్పడి, కాయలో అంతర్గతంగా కుళ్లు ఏర్పడటం వల్ల పండు నాణ్యత లోపిస్తుంది. పండు లోపలి విత్తనం కూడా గోధమ వర్ణంలోకి మారి పగళ్లు ఏర్పడుతాయి.
నివారణ:
జులై-ఆగష్టు నెలల్లో ఒక్కో మొక్కకి 100 గ్రా. బోరాక్స్ లేదా బోరిక్ ఆమ్లాన్ని పశువుల ఎరువుతో కలిపి పాదులంతా సమంగా చల్లినట్లయితే లోపాన్ని సవరించవచ్చు లేదా సాల్యుబోర్ 2 గ్రా. + సబ్బు బంక అర మి.లీ ఒక లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా నెల రోజుల వ్యవధితో రెండు మార్లు పిచికారి చేసుకొని లోపాన్ని నివారించవచ్చు.