Fertilizers Management During Monsoons: వానాకాలంలో మిద్దెతోటలో మొక్కలకు ఎరువులు ఎలా ఇవ్వాలి. ఇచ్చిన ఎరువుల సారం వర్షపు నీళ్ళతో కలిసి కుండీలలో నుంచి బయటకు వెళ్ళిపోదా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కంటైనర్లకు ఉన్న రంధ్రాలకు మట్టి బయటకు పోకుండా కొబ్బరి పెంకులో, రాళ్ళో అలా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటాం. కాబట్టి మట్టి బయటకు పోదు. ఎరువుల సారాన్ని మట్టి పట్టి ఉంచుతుంది. అందుకని నీటిలో ఎరువుల సారం బయటకు పోదు. మట్టితో పాటుగానే ఎరువుల సారం పోతుంది. మట్టి బయటకు పోదు కాబట్టి ఎరువుల సారం బయటకు పోదు.
వర్షాకాలం ప్రారంభంలోనే మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఎరువులు అంటే వర్మీకంపోస్టు, మెన్యూర్స్, కిచెన్ కంపోస్టు, లీఫ్ కంపోస్టు ఏది ఉంటే అది లేకపోతే అన్ని కలిపి అయినా మట్టి, ఎరువులు సమపాళ్లలో కలుపుకోవాలి. వీలయితే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరొసెన్స్, %హూవీ% కలుపుకోవాలి. సూడోమోనాస్ ఫ్లోరొసెన్స్ వాడటం వలన తెగుళ్ళు మరియు వ్యాధులను అరికడుతుంది. నెమటోడ్స్ నిర్వహణలో కూడా పనిచేస్తుంది. మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ట్రైకోడెర్మా విరిడి మొక్కలపై వ్యాధులను కలిగించే శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించడానికి అవరోధాన్ని కలిగిస్తుంది.
మొక్కలు నాటేటప్పుడు నేరుగా అడుగున మట్టిలో కలపవచ్చు.
%హూవీ% భాస్వరం లభ్యతను పెంచడమే కాకుండా వ్యాధి క్రిములు మరియు అననుకూల వాతావరణ పరిస్థితులను నిరోధించడానికి అవసరమైన శక్తిని మొక్కలకు ఇస్తుంది. వేప పిండి కూడా కొంచెం కలుపుకోవాలి. దీనిని వాడటం వలన నేల ఆధారిత వ్యాధి కారకాలను, నెమటోడ్‌లను, తెల్ల చీమలను, గ్రబ్స్‌ను నియంత్రిస్తుంది. ఇవి అన్ని మట్టి మిశ్రమంలో వాడితీరాలి అని ఏమీ లేదు.
అందుబాటులో ఉంటే వాడుకోవచ్చు. పాత మట్టి ఉంటే దానికి మట్టి తప్ప పైన చెప్పినవి అన్ని కలుపుకోవచ్చు. పండ్ల మొక్కలకు కూడా మట్టి తప్ప మిగిలినవన్నీ కలుపుకుని ఒక్కో మొక్కకు మొక్క వయసును బట్టి మూడు నాలుగు కిలోల వరకు ఇవ్వవచ్చు. ఇవి అన్ని కలుపుకుని నారు మొక్కలు పెట్టుకున్న తర్వాత అవి పెరిగేటప్పుడు నెల నెలన్నర వరకు ఇంకా ఎలాంటి ఎరువులు అవసరం లేదు. పూత, కాత దశలో పల్చగా వర్మీ కంపోస్టు వేసుకోవాలి.
ఈ దశలో మొక్కలకు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అవసరం ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్ కొరకు బోన్ మీల్ వాడుకోవచ్చు. పొటాషియం కొరకు అరటి తొక్కల ద్రావణం కానీ బూడిద కానీ వాడుకోవచ్చు. బూడిద ఎక్కువగా వాడకూడదు. కొంచెం వేసుకోవాలి. బూడిద ఎక్కువగా వాడడం వలన మట్టి పీహెచ్ లెవెల్స్ మారిపోతాయి. అందుకని కొంచెంగా వాడుకోవాలి.
అరటి తొక్కల ద్రావణం వర్షాకాలంలో వాడుకోలేము. దానికి బదులుగా కంటైనర్లులో బాగా మగ్గిన అరటిపండ్లు కంటైనర్ సైజును, మొక్క సైజును బట్టి ఒకటి లేదా రెండు పండ్లు మట్టిలో పెట్టవచ్చు. వర్షాలకు ఎరువుల సారం పోతుందని అనుకోకుండా నెల రోజులకు ఒకసారి ఏదైనా ఎరువులు ఇవ్వాలి. వర్మీ కంపోస్టు ఇవ్వడం వలన మొక్కలు వెంటనే పోషకాలను తీసుకో గలుగుతాయి.
Also Read: Cotton Cultivation Techniques: అధిక సాంద్రత ప్రత్తి సాగులో మెళకువలు.!
మెన్యూర్స్ వాడడం వలన మొక్కలు నెమ్మదిగా వాటిలోని పోషకాలను తీసుకుంటాయి. మట్టి మిశ్రమంలో మెన్యూర్స్ కలిపి ఉంటాము కాబట్టి వర్మీ కంపోస్టు ఒకటి నెలకు ఒకసారి కంటైనర్లలో పలుచగా ఇస్తే చాలు. వర్షాకాలంలో ఘనజీవామృతం బాగా పనిచేస్తుంది. కంటైనర్ సైజును, మొక్క సైజును బట్టి ఒక్కో కంటైనర్ కు ఒకటి లేదా రెండు ఘనజీవామృతం ఉండలు వేస్తే మొక్కలు నెమ్మదిగా పోషకాలను గ్రహించగలుగుతాయి. వర్షాకాలంలో కిచెన్ కంపోస్టు తయారుచేయడం కష్టంగా ఉంటుంది. కిచెన్ కంపోస్టును వీలైనంత ఎక్కువగా ఎండాకాలంలో తయారు చేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది.
ఘన జీవామృతం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం…
10 కిలోల ఆవుపేడ, 10 లీ. గోమూత్రం, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు ధాన్యాల పిండి, పిడికెడు పుట్టమన్ను లేదా రసాయన పురుగు మందులు కలవని మట్టి పిడికెడు తీసుకోవాలి.ఆవు పేడను ఉండలు లేకుండా బాగా కలపాలి. దానిలో పప్పుల పిండి, బెల్లం, పుట్టమన్ను వేసి బాగా కలిపి ఆవు మూత్రం చల్లుకుంటూ ఉండలు చేసుకోవాలి లేదా ఆవు మూత్రం కూడా ఒకేసారి కలిపేసి మొత్తం పలుచగా పరిచి నీడలో ఎండబెట్టాలి. ఉండలు చేసిన వాటిని కూడా నీడలోనే ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత సంచులలో నిలువ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇది భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టులకు చక్కని ప్రత్యామ్నాయం.
వర్షాకాలంలో ఘనజీవామృతం వేసుకున్నట్లయితే మొక్కలకు పోషకాలు సరిగా అందుతాయి. మనం తయారు చేసుకుంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. బయట కొంటే చాలా ఖర్చవుతుంది. కాబట్టి ఇలాంటివి ఎండాకాలంలో తయారు చేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. కిచెన్ కంపోస్టును కూడా ఎండాకాలంలో ఎక్కువగా చేసి నిల్వ ఉంచుకోవాలి.
కిచెన్ కంపోస్టును తయారు చేసే విధానం:
ఒక బకెట్ తీసుకుని దానికి చుట్టూ రంధ్రాలు చేయండి. పెద్ద రంధ్రాలు అవసరంలేదు. 6 ఎం.ఎం ఇనుప చువ్వతో చేస్తే చాలు. దానిలో అడుగున బ్రౌన్ కలర్ అట్టముక్కలు కానీ, ఎండిన ఆకులు కానీ, గార్డెన్ సాయిల్ కానీ రెండు మూడు ఇంచులు వేసుకోండి. ఏమీ లేకపోతే ఆఖరు ఛాయిస్ పేపర్స్ వేసుకోండి. దానిమీద కిచెన్ వేస్ట్, పండ్ల వేస్ట్ ఏది ఉంటే అవి వేసుకోండి. ఉడికించిన పదార్థాలను వేయవద్దు. గుడ్డు పెంకులు నలిపి వేసుకోవచ్చు.
గ్రీన్స్ కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిగడ్డి, చెట్ల ఆకులు ఇలా ఆకుపచ్చనివి వేసుకోవచ్చు. దానిమీద మరల అడుగున వేసినట్లు ఎండు ఆకులు కానీ, అట్ట ముక్కలు కానీ, వరిపొట్టు, ఎండిన గడ్డి, గార్డెన్ సాయిల్ ఇలా ఏది ఉంటే అది తడి చెత్తకంటే ఎక్కువగా వేసుకోవాలి. లేకపోతే తడి చెత్తకు సమానంగా అయినా వేసుకోవాలి. తక్కువ వేసుకోకూడదు. ఇలా పొరలు పొరలుగా వేసుకుని పైన కొంచెం వర్మీ కంపోస్టు కానీ ఏదైనా మెన్యూర్ కానీ కొంచెం వేసుకుని గార్డెన్ సాయిల్ రెండు మూడు ఇంచులు వేసుకోండి. ఇలా చేస్తే పురుగులు రావు. దానిమీద మూత పెట్టుకోవాలి. నీడలో ఉంచుకుంటే మంచిది. వీలుకాకపోతే పర్వాలేదు. ఎండినవి ఏమీ లేనప్పుడు అడుగున గార్డెన్ సాయిల్, కిచెన్ వేస్ట్, పండ్ల వేస్ట్,అలా పైన చెప్పినవి వేసుకోవాలి. దానిమీద మరల గార్డెన్ సాయిల్ ఒక ఇంచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ పైన రెండు మూడు ఇంచులు గార్డెన్ సాయిల్ వేసుకోవాలి.
రెండు నెలలలో కంపోస్టు తయారవుతుంది. అలా కాకుండా కుండీలలో కూడా చేసుకుని పదిహేను రోజుల తర్వాత ఆకుకూరల విత్తనాలు, ఏవైనా విత్తనాలు నేరుగా విత్తుకునేవి వేసుకోవచ్చు. అవి పెరిగే లోపు లోపల కంపోస్టు అవుతుంది. వర్షాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వలన ఉపయోగం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అందుకని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వలన ఉపయోగం ఉండదు. కానీ వర్షం లేనప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకు స్ప్రే చేయవచ్చు. అలా చేయడం వలన మొక్కలు త్వరగా పోషకాలను గ్రహిస్తాయి. అలాగే వర్షం లేనప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వవచ్చు.
లిక్విడ్ ఫర్టిలైజర్స్ లో జీవామృతం మట్టి కొంచెం తేమగా ఉన్నపుడు చాలా బాగా పనిచేస్తుంది.వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలలో సూక్ష్మ పోషకాల లోపం ఉంటుంది. సూక్ష్మ పోషకాల లోపం పోవడానికి మొక్కలకు ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ మొలకల పోషక ద్రావణం ఇవ్వడం ద్వారా మొక్కలకు కావలసిన అన్ని స్థూల, సూక్ష్మ పోషకాల లోపం నివారించవచ్చు. దీనిని లీటరు నీటికి 100 ఎంఎల్ కలిపి మట్టిలో పోయవచ్చు. 50 ఎంఎల్ లీటరు నీటిలో కలిపి మొక్కలకు స్ప్రే చేయవచ్చు.
మొలకల పోషక ద్రావణం తయారీ విధానం:
ఏకదళ బీజానికి చెందిన ఒక రకం, ద్విదళ బీజానికి చెందిన రెండు రకాలు, నూనె గింజలు మూడు రకాలు తీసుకుని వాటిని మొలకెత్తించాలి. (రెండు కేజీల మొక్క జొన్నలు, రెండు కేజీల కందులు, రెండు కేజీల శనగలు, రెండు కేజీల ఆవాలు, రెండు కేజీల పల్లీలు, రెండు కేజీల నువ్వులు తీసుకుని వాటిని మొలకెత్తించాలి). వీటిని పిండిగా రుబ్బుకుని, 100 లీటర్ల ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ లో కలిపి దానిలో రెండు కేజీల తవుడు, ఇనుపవి, తుప్పుపట్టినవి ఏవైనా మేకులు, ఏదైనా రాగి వస్తువు వేసి పదిరోజులు రోజు రెండు పూటలా సవ్య దిశలో కలిపి వాడుకోవచ్చు. వీలయితే రెండు కేజీల వేపపిండి, రెండు కేజీల కానుగ పిండి కలపాలి. ఈవిధంగా తయారు చేసుకున్న ద్రావణం ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది. ఈ విధంగా మిద్దెతోటలో వర్షాకాలంలో ఎరువులు వేసుకోవచ్చు.
Also Read: Sweet Potato Vines as Fodder: పశుగ్రాసంగా చిలగడ దుంప.!