మన వ్యవసాయం

వేరుశనగపంటలో పురుగులు – నివారణ చర్యలు

0

 

పేనుబంక:

ఈ పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన, లేత ఆకుల అడుగు భాగాన మరియు కొన్ని సందర్భాలలో పూతపై గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి.దీనీవలన మొక్కలు గిడసబారుతాయి.పూతదశలో ఆశించినపుడు పూత రాలిపోతుంది.ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం స్రవించడం వల్ల మొక్కలపై నల్లని బూజు ఏర్పడుతుంది.

ఆకుపచ్చదోమ :

ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. మొదట ఆకు పైభాగాన మొదటగా “V” ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి,క్రమేపి ఆకులన్ని పసుపు పచ్చగా మారుతాయి.

నివారణ చర్యలు:

పేనుబంక, ఆకుపచ్చ దోమ  నివారణకు డైమిధోయేట్ 400మి.లీ. లేక మిధైల్-ఒ-డెమటాన్ 400మి.లీ. లేక ధయోమిధాక్సాం 40 గ్రా. లేక ఇమిడాక్లోప్రిడ్ 60మి.లీ. లేక ధయోక్లోప్రిడ్ 5౦మి.లీ. మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.  ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ది చేయుట వలన మొక్కలు పేనుబంక,ఆకుపచ్చ దోమ పురుగుల నుండి 20 – 25 రోజుల వరకు రక్షణ కల్పించవచ్చును.

ఆకుముడత:

విత్తిన 15 రోజుల నుండి ఆకుముడత ఆశిస్తుంది. తల్లి పురుగులు బూడిద రంగులో వుంటాయి. తొలి దశ లో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి.వాటిలోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు దాగి వుంటాయి.ఇవి 2,3 ఆకులను కలిపి గూడు చేసి వాటిలోవుండి,పచ్చదనాన్ని తినివేయడం వలన ఆకులన్నీ ఎండి, దూరం నుండి చూస్తే కాలినట్లు కనపడతాయి.దీనినే రైతులు అగ్గి తెగులు అంటారు.

నివారణ:

ఆకుముడత నివారణ కు అంతర పంటలుగా జొన్నలేక సజ్జ 7:1నిష్పత్తిలో వేయాలి. సోయాచిక్కుడు తర్వాత వేరుశనగ వేయరాదు.ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి పురుగు ఉనికిని,ఉధృతి ని గమనించాలి.ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్వినాల్ ఫాస్ 400 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. లేక క్లోర్ పైరి ఫాస్ 500 మి.లీ. మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.

ఎర్రగొంగళి పురుగు :

జూలై మాసం లో పడే వర్షాలకు భూమిలోని కోశస్ద దశలో వున్న పురుగుల నుంచి,వర్షం పడిన రెండవ రోజున తల్లి రెక్కల పురుగులు బయటకి వస్తాయి. తల్లి పురుగులు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగు లో ఉంది పై రెక్కల అంచున ఎర్రటి చార కలిగి,ఒక్కొక్కటి దాదాపు 1000 పైగా తెల్లని గ్రుడ్లని గుంపులు,గుంపులుగా వేరుశనగ ఆకులపైన,వెడల్పు ఆకుల మొక్కలపైన,మట్టిగడ్డలపైన మరియు రాళ్ళపైన  పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపై లేక పొలంలో వున్న గడ్డి మొక్కలను మరియు వేరుశనగ ఆకులనాశించి వాటిపైనున్న పచ్చదనాన్ని గోకి తింటుంది. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకులను తినివేసి రెమ్మలను,మొదళ్ళను మిగులుస్తాయి.కొన్ని సందర్భాలలో పువ్వులను కూడా తింటాయి.

నివారణ:

దీని నివారణకు ఏప్రిల్, మే మాసంలో పడిన వర్షాలకు లోతు దుక్కి చేయడం వలన పురుగు కోశస్ద దశలు బయటపడి సూర్యరశ్మి లేక పక్షుల బారిన పడి చనిపోతాయి.తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత ప్రతి పూట 8-11 గంటల సమయంలో సామూహిక పంటలు వేసి లేదా కాంతి ఎరలు ఏర్పాటు చేసి ఎర్ర గొంగళి రెక్కల పురుగులను ఆకర్షించి అరికట్టవచ్చు.  గుడ్ల సముదాయాలను, పిల్ల పురుగులను గమనించి ఏరివేయాలి. మిధైల్ పారాధియాన్ లేదా క్వినాల్ ఫాస్ పొడిమందుని 10 కిలోల చొప్పున చల్లాలి.పొలం చుట్టూ లోతు సాలు తీసి మీటరు పొడవు సాలుకు 250 గ్రా. ఫాలిడాన్ పోదిమందు చల్లాలి. అలసంద,ఆముదం పైర్లను ఎరపంటలుగా వేయాలి.వెర్రి ఆముదం,జిల్లేడు,కొమ్మలను పొలంలో అక్కడక్కడ ఎరగా వేసి,పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటినన్నింటిని సేకరించి తగుల బెట్టాలి.

Leave Your Comments

పండ్ల తోటల్లో బోరాన్ లోపం ఏర్పడటానికి కారణాలు..

Previous article

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు తప్పని కష్టాలు..

Next article

You may also like