కొబ్బరిని మనం చాలా తేలికగా తీసుకుంటాం. పండుగలప్పుడు, శుభకార్యాల్లో దేవుడుకి శుభ సూచకంగా సమర్పించే వస్తువుగా చూస్తుంటాం. కానీ అది ఎన్నో ఔషధ గుణాల మిళితమని, ఆరోగ్య ప్రదాయని అని కొద్దిమందికే తెలుసు. కొబ్బరి చెట్టు నుంచి వచ్చే ప్రతీదీ మన నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. కొబ్బరి కాయ, కొబ్బరి నీళ్ళు, కొబ్బరి కుడుక, కొబ్బరి నూనె, కొబ్బరి పీచు, కొబ్బరి మట్టలతో అనేక లాభాలున్నాయి.
మనం ఉపయోగించే వస్తువులు,ఆహార పదార్దాలు అన్నీ కల్తీ అవుతున్నాయి. కానీ సహజ సిద్దంగా, కల్తీ లేకుండా ఒక్క కొబ్బరి మాత్రమే మనకు లభిస్తున్నది. ప్రకృతి ప్రసాదంగా లభించే కొబ్బరిలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. కొబ్బరినీళ్ళు ఆరోగ్యానికి అమృతంతో సమానం. నీరసంగా, అనారోగ్యంతో వున్న వారు రోజుకో కొబ్బరి బోండం తాగితే త్వరగా కోలుకుంటారు. చిన్న పిల్లలకు కొబ్బరి నీళ్ళు దివ్య ఔషధంలా పని చేస్తాయి. వేసవిలో డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతాయి. దీంతోపాటు కొబ్బరి చెట్టు నుంచి వచ్చే ప్రతీదీ మనకు ఉపయోగపడుతుంది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఆరోగ్య సంరక్షణకు తోడ్పడుతాయి. పండుగలు, ఇతర శుభకార్యాల్లో దేవుడికి శుభసూచకంగా కొబ్బరి కాయలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. కొబ్బరి కాయల అమ్మకం, కొబ్బరి పీచుతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేసి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇక చివరగా కొబ్బరి చెట్టు నుంచి వచ్చే కొబ్బరి మట్టలు కూడా వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడుతున్నాయి. కాగా, ఈ కొబ్బరి చెట్ల ప్రాధాన్యాన్ని చాటి చెప్పడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి 1998సెప్టెంబర్ 2న ప్రపంచంలోని 20 దేశాలు ఇండోనేషియాలోని జకార్తా కేంద్రంగా సమావేశమై, ఆసియా, పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీని ఏర్పాటు చేశాయి.
కొబ్బరితో ప్రయోజనాలు:
- శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోకుండా చూస్తుంది.
- రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.
- శరీరంలో వున్న కొవ్వు, కిడ్నీలోని రాళ్ళను కరిగిస్తుంది.
- శరీరానికి తక్షణ శక్తి ని అందిస్తుంది.
- శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడానికి పోషక విలువలు, ఆమ్లాలను అందించడానికి కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతున్నాయి.
- కడుపులోని నులి పురుగులను నివారిస్తుంది.
- గ్లాసు కొబ్బరి నీళ్ళులో 0.290 గ్రాముల పొటాషియం ఉంటుంది.
- ఎముకలను ధృడంగా చేస్తుంది. వెంట్రుకలు పెరుగడానికి తోడ్పడుతుంది.
- చర్మంపై ముడతలను తగ్గించి వృద్దాప్యం దరి చేరనివ్వదు.
- అత్యవసర పరిస్దితుల్లో వైద్యులు కొబ్బరి నీళ్లను స్లైన్ ద్వారా శరీరంలోకి పంపించి ప్రాణాలను కాపాడుతారు.
- రక్తపోటును అదుపులో ఉంచి, గుండెను కాపాడుతుంది.
- కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ముఖ్య పోషకాలు కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉండడం వల్ల ఇలాంటి రోగాలనైనా నియంత్రిస్తుంది.
- శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
- జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుంది.
- శరీరంలో నీటిశాతం పెంచుతుంది.
- అధిక రక్తపోటు నివారించి,గుండెను సంరక్షిస్తాయి.
- విష జ్వరాల బారిన పడి, నీరసంగా వున్నా వారికి కొబ్బరి నీళ్లు తాగించడం ద్వారా రక్తంలోని తెల్ల రక్త కణాలు పెరుగుతాయి.
- ముఖ్యంగా గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారు.