Orange Harvesting and Packaging – కాయలు కోయడం: కాయలు పూర్తిగా ముదిరిన తరువాతనే కొయ్యాలి. పక్వానికి వచ్చిన కాయలో రంగు మార్పు వచ్చి తియ్యదనం పెరుగుతుంది. పూత కాలం నుంచీ కాయలు ముదరడానికి తియ్య నారింజకయితే 8-9 నెలలు, నిమ్మకాయలకయితే 4 1/2 నెలలు పడుతుంది. చీనీ పళ్లు ఆకుపచ్చరంగు నుంచి లేత పసుపు రంగుకు మారగానే కోస్తారు. నిమ్మ కాయలు పూర్తి పరిమాణానికి పెరిగాక ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోయాలి. పసుపు రంగు లోకే వచ్చే వరకు నిలువ చేసి మార్కెట్టుకు పంపిస్తారు.
కాయకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ప్రత్యేకమైన చాకులతోగాని, కత్తిరింపు సాధనంతోగాని, సికేచర్ గాని కొయ్యాలి. కోసేటప్పుడు కాయ చర్మానికి దెబ్బ తగలకుండా జాగ్రత్తపడాలి. కాని రైతులు ఒక వెదురు కర్రకు చివర కొక్కెం కట్టి, దానితో కొమ్మలను ఊపి కాయలను దులుపుతూ ఉంటారు. అది అంత మంచి పద్ధతి కాదు.
దిగుబడి: చీనీ చెట్లలో సాధారణంగా 4వ సంవత్సరం నుంచి కాపు ప్రరాంభమవుతుంది. అయితే 6వ సంవత్సరం నుంచి మాత్రమే వాణిజ్యపరంగా మంచి దిగుబళ్ళు వస్తాయి. నిమ్మలో విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసినప్పుడు 4వ సంవత్సరం నుంచే మంచి దిగుబడి వస్తుంది. యాజమాన్యం బాగున్న చీనీ తోటల్లో ఒక్కొక్క చెట్టు నుంచీ సగటున 800 నుంచి 1200 కాయల వరకు దిగుబడి వస్తుంది. బాగా ఎరువులు వేసి, తగినంత నీటిని అందించి, సకాలంలో చీడపీడలను నివారించే తోటల్లో చెట్టు ఒకటికి 2000 కాయల దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉoది. నిమ్మలో 2000 నుంచి 3000 వేల పండ్ల వరకు దిగుబడి వస్తుంది.
Also Read: Orange Crop: నారింజ పంటకు బ్లాక్ ఫంగస్
గ్రేడింగ్, ప్యాకింగ్, నిలువ చేయడం: చీనీ, నిమ్మ పండ్లను చెట్టు నుంచి తెంపిన తరువాత వాటిని పరిమాణాన్ని (సైజును బట్టి, నాణ్యతను బట్టి జాగ్రత్తగా గ్రేడింగ్ చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన గ్రేడింగ్ ప్రమాణాలను 1,2 పట్టికల్లో ఇవ్వడమైనది. పండ్లను చెట్టు నుండి తెంపిన వెంటనే ప్యాకేజీ షెడ్లకు పంపించాలి. పరిమాణం, నాణ్యతలను బట్టి గ్రేడింగు చేసి గంపల్లోగాని, అట్ట పెట్టెల్లోగాని పెట్టి జాగ్రత్తగా ప్యాకింగు చెయ్యాలి.
మన రాష్ట్రంలో పండ్లను ప్యాకింగ్ చెయ్యకుండానే బండ్లలోను, ట్రక్కుల్లోను, లారీల్లోను పోసి ప్రాంతీయ మార్కెట్లకు రవాణా చేస్తారు. కాలిఫోర్నియాలో పండ్లను 5 నిమిషాలపాటు క్రిమిసంహార మందుల్లో ముంచి శుద్ధి చేస్తారు. శు ద్ధిచెయ్యడానికి 0.5 నుంచి 1.0 శాతము సోడియం ఫినైల్ ఫీనేట్ ద్రావణాలను కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన తరువాత పండ్లను నీడలో ఆరబెట్టి మైనం ద్రావణంలో కరిగించిన మైనంలో) ముంచి ఆరబెడతారు.
పండ్లు మంచి రంగుకు రాకపోతే 24 నుంచి 72 గంటల పాటు ఇథలీన్ వాయువుకు గురిచేసిన మంచి రంగు వచ్చేలా చెయ్చొచ్చు. తాజా పండ్లను 14 డిగ్రీలను సెంటిగ్రేడు వద్ద 5-6 వారాలు చెడిపోకుండా నిలవ చెయ్యొచ్చు. 2,4-డి + మైనం మిశ్రమంలో ముంచిన పండ్లను యింకా ఎక్కువ కాలం నిలవ చెయ్యొచ్చు. 2,4-డి 50 పి.పి.యం. + 3 శాతం శిలీంధ్ర సంహారక మందుల మిశ్రమంలో ముంచి, మైనం పూత వేసి 20 రోజులు నిలవ చేసినప్పుడు, నిమ్మ పండ్లలో నష్టం 76 శాతం తగ్గిపోయిందని ఒక పరిశీలనతో వెల్లడైంది. అదే విధమైన పద్ధతి నవలంభించి సాల్గుడి పండ్లను నిలవచేసినప్పుడు, 50 శాతం పండ్లు తాజాగా ఉన్నట్లు గమనించడమైనది. నేపాలీ ఒబ్లాంగ్ రకం లెమన్ పళ్ళు 24 రోజుల తరువాత 63 శాతం వరకు చెడకుండా తాజాగా ఉన్నాయి. ఈ విధంగా పండ్లను శుద్ధి చెయ్యడం, ముఖ్యంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు చాలా అవసరం.
Also Read: Sweet orange cultivation: చీనీ నిమ్మలో అంట్ల ఎంపిక మరియు నాటే సమయంలో రైతులు తీస్కోవాల్సిన జాగ్రత్తలు