తెలుగు రాష్ట్రాలలో పండిస్తున్న కూరగాయ పంటలలో టమాట, మిరప, బెండ, వంగ, తీగ జాతి కూరగాయలు మొదలైనవి ముఖ్యమైనవిగా గుర్తించవచ్చు. ప్రస్తుతం టమాట పంటలో వచ్చే శిలీంధ్రపు తెగుళ్ళు , తీసుకోవలసిన నివారణ చర్యల గురించి తెలుసుకుందాం…
మొదట ఆకు మాడు తెగులు (అర్లీ బ్లైట్):
తేమ ఉన్న చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్ సీజనులో ఎక్కువగా ఆశిస్తుంది. జూన్-ఆగష్టు మాసాలలో ఈ తెగులు ఉధృతంగా కనిపిస్తుంది. పంట వేసిన 30-35 రోజుల్లో ఈ తెగులు రావడం జరుగుతుంది. ముదురు ఆకుల మీద ముదురు రంగు లేదా నల్లటి వలయాకారపు లేదా అండాకారపు మచ్చలు ఏర్పడి దీని చుట్టూ పసుపుపచ్చని వలయాలు ఏర్పడతాయి. వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నపుడు ఈ మచ్చలన్ని కలసిపోయి ఆకులు మాడిపోతాయి. ఈ నల్ల మచ్చల మధ్యలో వలయాలు ఏర్పడటం ఈ తెగుళ్ళ ముఖ్య లక్షణం. ఈ తెగులు ఆకులపైన, కాడలు, కాండం మరియు కాయల మీద కనిపిస్తుంది.
నివారణ: పంట అవశేషాలను, తెగులు శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను నిర్మూలించాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ 3గ్రా. లేదా థైరమ్ 3గ్రా. వంటి శిలీంధ్ర నాశకాలుతో విత్తన శుద్ది చేయాలి. మొక్కలను నాటే ముందు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. ద్రావణంలో వేర్లు తడిచేలా ముంచి నాటాలి. నాటిన 30-35 రోజుల్లో మాంకోజెబ్ 3గ్రా./కాపర్ హైడ్రాక్సైడ్ 2గ్రా./మెటిరిమ్ 2గ్రా./క్లోరోథాలోనిల్ 2గ్రా./పారక్లోస్ట్రోబిన్ + మెటిరిమ్ 2గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ శిలీంధ్ర నాశకాలను ఒకదాని తరువాత ఒకటి మారుస్తూ పిచికారి చేయాలి. పంట మార్పిడి చేయాలి.
తరువాత ఆకు మాడు తెగులు (లేట్ బ్లైట్):
జూలై-డిసెంబరు మాసాల్లో ఈ తెగులు ఉధృతంగా కనిపిస్తుంది. దీనివల్ల నూరుశాతం పంట నష్టం కలిగే అవకాశం ఉంది. ఆకుల చివరన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండి పోవడం ఈ తెగులు ముఖ్యలక్షణం. కాయలు మీద మరియు కాండము మీద గోధమ రంగు మచ్చలు ఏర్పడి ఉధృతి ఎక్కువైనప్పుడు కాయలు అన్ని గోధమ రంగు వర్ణంలో మారి కుళ్ళి పోవడం జరుగుతుంది. ఆకులు మీద గోధమ వర్ణపు మచ్చలు ఒక దానితో ఒకటి కలసి పెద్ద మచ్చలుగా ఏర్పడి ఆకులు ఎండి పోతాయి. మొక్కలు తగలబడినట్లు కనిపిస్తాయి. ఈ మచ్చలకు ఒక నిర్దిష్టమైన ఆకారము ఉండదు.
నివారణ: టమాట పంటను బంగాళదుంపను పండిస్తున్న పొలాలకు దగ్గర్లో సాగు చేయకూడదు. ఇతర పంటలతో పంటమార్పిడి చేయాలి. బిందు సేద్యం ద్వారా నీరు అందించాలి. తుంపర్లు సేద్యం ద్వారా అందిస్తే ఆకులపై తడి ఎక్కువై తెగులు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారణకు డైమిథోమార్ఫ్ 1గ్రా + మాంకోజెబ్ 2గ్రా. మిశ్రమము/డైమిథోమార్ఫ్ 1గ్రా. + మెటిరిమ్ 2గ్రా. మిశ్రమము/అజాక్సిస్ట్రోబిన్ 1గ్రా./సైమొక్సనిల్- మాంకోజెబ్ 2గ్రా./క్లోరాథాలోనిల్ 2గ్రా./ఇప్రొవెలికార్బ్- మాంకోజెబ్ 4గ్రా./పారక్లోస్ట్రోబిన్ + మెటిరిమ్ 2గ్రా./చొప్పున 1 లీటరు నీటికి 7-10 రోజుల వ్యవధిలో ఒకదాని తరువాత ఒకటి మారుస్తూ పిచికారి చేయాలి.
బూడిద తెగులు:
జూన్-జులై మరియు నవంబరు-ఫిబ్రవరి మాసాల్లో పొడి మరియు వేడి వాతావరణము ఉన్న సమయములో ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలు ముదురు ఆకులపై భాగాన తెల్లని బూడిద వంటి మచ్చలు కనిపిస్తాయి. శిలీంధ్రపు పెరుగుదల ఆకు అంతటా వ్యాపించి ఆకు రంగు కోల్పోయి ముడుచుకొని ఎండిరాలిపోతాయి.
నివారణ: మొక్క వయస్సు 25-30 రోజుల మధ్యలో ఉన్నపుడు మొక్క క్రింద భాగంలో నేలకు తాకుతున్న ఆకులను మరియు ముదిరిన ఆకులను కత్తిరించాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వేయకూడదు. ఇలా చేయడం వలన తెగులు వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం నుండి తప్పించవచ్చు. తెగులు శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను నిర్మూలించాలి. ఈ తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం 3గ్రా. లేదా హెక్సోకోనోజోల్ 1 మి.లీ. లేదా ట్రైడిమార్ఫ్ 1గ్రా. లేదా డైఫెనకొనజోల్ 0.5 మి.లీ. లేదా మైక్లోబ్యూటనిల్ 1గ్రా. కార్బండిజిమ్ 1గ్రా. లేదా డైనోకాప్ 1మి.లి. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.