శనగ పంట ప్రధానమైన పప్పు దినుసుల పంట. ఈ పంట అది పెరిగే వాతావరణ పరిస్దితుల వలన చీడపీడలు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కావున ఈ చీడపీడలు నివారించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఎండు తెగులు:
ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేయు శిలీంధ్రం విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగపంట లేకున్నా పొలంలో 6సంవత్సరములు బ్రతికి ఉండగలదు.
యాజమాన్యం:
ఎండుతెగులును తట్టుకొనే రకాలను సాగుచేయడం.
వేసవిలో లోతుగా దుక్కి దున్నుట వలన మరియు ముందు పంట అవశేషాలు తీసివేయడం వలన తెగులు తీవ్రత తగ్గించవచ్చు.
జొన్న పంటతో పంటమార్పిడి చేయడం.
విత్తనశుద్ధి చేసి పంట విత్తుకోవడం.
వేరు కుళ్ళు తెగులు:
బెట్ట పరిస్దితులలో మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పూత మరియు కాయ దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి. తల్లి వేరు తేలికగా ఊడిపోతుంది.
యాజమాన్యం:
పంట మార్పిడి అవలభించడం.
శిలీంద్ర నాశినులతో విత్తనశుద్ది చెయ్యడం.
సకాలంలో విత్తుకోవడం వల్ల పంట చివరిదశలో బెట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా చూసుకోవడం వల్ల తెగులు తీవ్రతను తగ్గించవచ్చు.
శనగపచ్చ పురుగు:
తల్లి పురుగు లేత ఆకులపై లేదా లేత కొమ్మలపై లేదా పిందెల పై ఒక్కొక్కటిగా పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల లద్దె పురుగులు ఆకులను తొలిదశలో తిని నష్టపరుస్తాయి. కాయలు ఏర్పడిన తరువాత కాయలను తిని విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తాయి. కాయలోనికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. పురుగు ఆశించిన కాయకు గుండ్రటి రంధ్రాలు ఉంటాయి.
కాబట్టి ఈ పురుగు నివారణకు అంతరపంటగా ధనియాలు సాగు చేయాలి. చుట్టుపక్కల నాలుగు వరుసల జొన్న పంట వేయాలి. 50 – 100 బంతి మొక్కలు నాటాలి. పురుగు ఉధృతిని బట్టి తొలిదశలో వేప నూనె ఒక లీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. పురుగు తొలిదశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంద్రానిలిప్రోల్ 60మి.లీ. లేదా ఫ్లూబెండామైడ్ 40మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి.
రబ్బరు పురుగు:
తల్లి రెక్కల పురుగు ఆకులపై గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు మొక్క దగ్గర పత్రహరితాన్ని గీరి తిని నష్టపరుస్తాయి. పైరు తొలిదశలో ఉన్నప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులను పూర్తిగా తిని నష్టపరుస్తాయి. పంట తొలిదశలో అనగా 20 – 25 రోజుల దశలో బెట్ట వాతావరణ పరిస్దితుల తర్వాత అధిక వర్షపాతం నమోదైతే ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. లేదా నోవాల్యురాన్ 200మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.