Plastic Uses in Agri and Horticulture: వ్యవసాయ మరియు ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్ పరికరాల వినియోగ ఆవశ్యకత మనదేశంలో 1970వ దశకం నుండి ప్రారంభమైనది. ఇవి ఇనుము, ఉక్కు మొదలైన పరికారలతో పోలిస్తే తేలికగా ఉండి, ఎక్కువ రోజులు మన్నిక కలిగి, తక్కువ ధరకు లభిస్తున్నందువల్ల మరియు వాటి నిర్వహణ కూడా చాలా అనుకూలంగా ఉండడం వల్ల రైతులలో మంచి అవగాహన కలిగి వీటి వాడుక రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వాణిజ్య సరళీకృత విధానాలననుసరించి వివిధ దేశాలతో పోటీ ఎదుర్కోవాలంటే మనము కూడా అధిక పంటల దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పండించాల్సిన అవసరము ఎంతో ఉంది. దీనికి గాను పై రెండు రంగాల్లో ప్లాస్టిక్స్ వాడుక ఎంతో ప్రాచుర్యము పొందింది.
వీటి వలన నీటి ఆదాతోపాటు, నేలలో తేమ ఆవిరికాకుండా చూసి, నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు మరియు పంటలకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులలో కూడా పంటలను పండించవచ్చు. ఇంక పంట నిల్వకు వీటి పాత్ర ఎంతో ఉంది. కనుక ఈ క్రింద పేర్కొన్న ప్లాస్టిక్ పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా మానవుని దైనందిన జీవితావసరాలకు ఎంతో తోడ్పాటు అవుతున్నది.
సూక్ష్మసాగునీటికి తోడ్పడే బిందు మరియు తుంపర సేద్య పరికరాలు, ప్లాస్టిక్ మల్చింగ్కు వాడే షీట్లు. హరితగృహాలకు మరియు లోటన్నెలుక్కు వాడే పైకప్పుషీట్లు, షేర్నెట్లు మరియు వడగండ్లను నిరోధించేట్లు, చెఱువులు, కుంటలు మరియు కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్ములు, నీటిపారుదలకు ఉపయోగించే పైపులు, గొట్టపు బావుల కేసింగ్ పైపులు, సస్యరక్షణ పరికరాలు, ప్లాస్టిక్ నీటితొట్టెలు, గాదెలు, పూల కుండీలు, ఎరువుల సంచులు, సర్వరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయలు మరియు పండ్ల ప్యాకింగ్ సంచులు మొదలైనవి.
వ్యవసాయ మరియు ఉద్యానవన సేద్య విభాగాల్లో ప్లాస్టిక్స్, బిందు మరియు తుంపర సేద్యాలతో పాటు, మల్చింగ్, హరిత గృహాలు మరియు కుంటలు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్ములు ఎంతో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి.
మల్చింగ్: మొక్కల చుట్టూ ఉండే వేళ్ళ భాగాన్ని ఏవేని పదార్ధాలతో కప్పి ఉంచడాన్ని “మల్చింగ్” అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపపు పొట్టు, చెఱకు పిప్పి, ఎండిన ఆకులు మరియు చిన్న చిన్న గులక రాళ్ళు. మొదలైనవి వాడేవారు. కాని వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థలలో పెరుగుతూ ఉన్నందువల్ల (ఉదా॥ ఇటుక బట్టీలు మొ॥) మరియు వాటి లభ్యత రానురాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ షీట్ తో మల్చింగ్ వేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని “ప్లాస్టిక్ మల్చింగ్” అంటారు.