Blue Tongue Disease in Sheep: లక్షణాలు – జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది (104-108°F ). నాలుక వాచిపోయి నీలిరంగులో ఉండవచ్చు. ఈ లక్షణం వ్యాధి యొక్క దశ మీద ఆధారపడి ఉంటుంది. గొర్రెలు పారుకుంటూ (డయేరియా) ఉంటాయి. న్యూమోనియా లక్షణాలు వుండి, గొర్రెలలో శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉంటుంది. ముక్కు నుండి జిగురు లాంటి ద్రవ పదార్థం కారుతుండవచ్చు. కాలిగిట్టల దగ్గర ఎర్రగా వాచి ఉండుట వలన, గొర్రెలు కుంటుతూ నడుస్తుంటాయి. ఆకలి మందగించి ఉంటుంది. పుట్టే గొర్రెపిల్లల తలసైజు పెరిగి (హైడ్రోసెఫాలస్ ) ఉంటుంది. మెడ ఒక వైపు వాచి వుంటుంది. ముక్కు నుండి మరియు కంటి నుండి నీరు కారుతుంటుంది. నోటి నుండి లాలాజలం తీగలు తీగలుగా. కారుతుంటుంది. నోటిలోని మ్యూకస్ మెంబ్రెన్లో అల్సర్లు ఏర్పడి ఉంటాయి. పొదుగు వాచి యుంటుంది.
వ్యాధి కారక చిహ్నములు:- నోటిలో పుండ్లు ఉంటాయి. నాలుక నీలి రంగులో ఉంటుంది. అన్ని అవయవాలలోని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టిపోవడం, రక్తస్రావం వంటి లక్షణాలు గమనించవచ్చు. కాలిగిట్టల దగ్గర ఎర్రగా కందిపోయి ఉంటుంది.
Also Read: Avian Encephalomyelitis in Poultry: కోళ్ళలో ఎవియన్ ఎన్సెఫలోమైలైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!
వ్యాధి చరిత్ర, వ్యాధి లక్షణములు, వ్యాధి చిహ్నముల ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవలసి ఉంటుంది. ఈ వ్యాధిని గాలికుంటు, నోటి పుండ్లు, ఫోటోసెన్సిటైజేషన్, ఈస్ట్రన్ ఒవిస్ లార్వాలతో సరిపోల్చుకొని చూసుకొనవలసి ఉంటుంది.
చికిత్స:- వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు ప్రత్యేకమైన చికిత్స ఏది లేదు.
వ్యాధి లక్షణములు చేయు చికిత్స:- శోధమును, నొప్పులను మరియు జ్వరo తగ్గించుటకు ఆంటి పైరెటిక్, ఆంటి అనాల్జెసిక్, ఆంటి ఇన్ఫ్లమేటరీ గుణములు కలిగిన ఔషదములను 3-5 రోజుల వరకు ఇవ్వవలసి ఉంటుంది. విరోచనాలను తగ్గించుటకు అంటిడయేరియల్ ఔషధములను ఇవ్వవలసి ఉంటుంది. ఈ వ్యాధి మూలంగా సెకండరి బ్యాక్టీరియల్ వ్యాధులు రాకుండా ఉండుటకు ఏదేని ఒక ఆంటి బయోటిక్ ఔషధములను కూడా ఒక మూడు రోజుల ఇవ్వవలసి ఉంటుంది.నోటిలో పుండ్లు ఉంటాయి కనుక, గొర్రెలు ఆహారం సరిగ్గా తీసుకోలేవు, కావున వాటికి సులభంగా జీర్ణం అయ్యే గంజి లాంటి పదార్థాలను కాని, కొద్దిగా ఉప్పు, ఓ. ఆర్.ఎస్ లాంటి ద్రావణములను కలిపి, వ్యాధి తగ్గేవరకు ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. వ్యాధి కారిన పడిన గొర్రెలకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. అవసరమైన యెడల విటమిన్స్, మినరల్స్ ఇంజక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది.
నివారణ:- వ్యాధి వచ్చిన గొర్రెలను మంద నుండి వేరు చేయాలి. గొర్రెల పాకలో దోమలు రాకుండా ఉండుటకు దోమ తెరలు వాడుట, పొగపెట్టడం లాంటివి చేయాలి. ఈ వ్యాధి టీకాలు ప్రయోగదశలో ఉన్నవి.
Also Read: Wanaparthy: ఒక చారిత్రక సందర్భానికి వనపర్తి నాంది పలికింది- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి