Stiff Sickness in Cattles: ఆవులలో దోమ కాటు వలన కలుగు ఒక వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా తీవ్రమైన జ్వరం, కీళ్ళు పట్టుకుపోవడం, కుంటుతూ నడవడం, కండరాల వణుకు వంటి లక్షణాలుండి పశువులు మూడు రోజులలో కోలుకుంటాయి.
ఇది రాట్టో విరిడే కుటుంబానికి చెందిన అన్నోన్ వైరస్ వలన కలుగుతుంది. ఈ వైరస్ బుల్లెట్ ఆకారంలో ఉండి, సుమారు 70-80 నానో మీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఈ పైరస్ వెసిక్యూలార్ స్టొమటైటిస్ మరియు డెంగ్యూ ఫీవర్ వైరస్ల ను పోలి ఉంటుంది.5 నెలలు కంటే తక్కువ వయస్సు వున్న పశువులలో వ్యాధి తీవ్రత తక్కువగా, 6 నెలలు పై బడిన మగ పశువులలోను మరియు తెల్ల పశువులలోను వ్యాధి తీవ్రత ఎక్కువ గా ఉంటుంది.కొన్ని రకాల ఈగలు మరియు క్యూలెక్స్ జాతికి చెందిన దోమల కాటు వలన ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- ఈ వైరస్ కొన్ని రకాల ఈగలు మరియు క్యూలెక్స్ జాతికి చెందిన దోమల లాలాజల గ్రంథులలో చేరి వాటి యొక్క కాటు వలన ఆరోగ్యంగా ఉన్న పశువుల శరీరంలో ప్రవేశించి రక్తంలో కలుస్తుంది. రక్తం ద్వారా కీళ్ళు, కండరాలు, లింఫ్ గ్రంథులు, ఊపిరితిత్తులలో చేరి వాటిని నాశనం చేయుట వలన ఆ అవయవాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి.
Also Read: Calf Management: దూడను తల్లి నుండి వేరు చెయ్యడం వలన కలిగే లాభాలు.!

Stiff Sickness in Cattles
వ్యాధి లక్షణాలు:- ఇంక్యుబేషన్ పిరియడ్ 2-10 రోజులు వరకు ఉంటుంది. వ్యాధి మొదటి దశలో తీవ్రమైన జ్వరం ఉంటుంది. లింఫ్ గ్రంథులు వాచి ఉంటుంది. ఆకలి వుండదు. కండరాలు బిగుసుకుపోయి కదలకుండా ఉంటుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది. ముక్కు నుండి నీరు, నోటి నుండి లాలాజలం ఎక్కువగా కారుతుంటుంది. సాధారణంగా ఈ లక్షణాలు 2-3 రోజుల వరకు ఉండి తర్వాత తగ్గిపోయి పశువులు కోలుకుంటాయి. అందుకే దీనిని మూడు రోజుల అస్వస్థత అని అంటారు. కొన్ని సార్లు అతి తక్కువ సంఖ్యలో పశువులు చనిపోతాయి.లింఫ్ గ్రంథులు వాచిపోయి ఉంటాయి. గుండెలో నీరు చేరి ఉంటుంది. కీళ్ళవాపు, కండరాల శోధం ఉంటుంది. ఊపిరితిత్తులలో న్యూమోనియను గమనించవచ్చు.
చికిత్స:- ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు. కండరాల నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించడానికి అనాల్జెసిక్స్ (డైక్లోఫెనాక్ సోడియం /సోడియం సాలిసిలేట్) లాంటి ఔషధములను ఉపయోగించాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా అంటిబయోటిక్ ఔషధo ఇవ్వాలి. పశువులు క్రింద పడిపోయిన యెడల కాల్షియం బోరో గ్లూకోనేట్ వంటి ఔషధo ఇచ్చిన యెడల మంచి ఫలితం ఉంటుంది. పశువులకు సులభంగా జీర్ణం అయ్యే పదార్థాలను ఇవ్వాలి. తగినంత విశ్రాంతి చాలా అవసరం.
నివారణ:- పశువుల పాక చుట్టు నీళ్ళు నిలవకుండా చూడడం వలన దోమలను నివారించవచ్చు. పశువుల పాకలో పొగ పెట్టడం వంటివి చేయుట ద్వారా దోమలను నివారించవచ్చు.
Also Read: Tuberculosis Disease in Cattle: పశువులలో క్షయ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది.!