ఆంధ్రా వ్యవసాయం

మిరపలో వైరస్ తెగుళ్ల లక్షణాలు-సమగ్ర యాజమాన్యం

0

మిరపలో వైరస్ తెగుళ్ళ యాజమాన్యం: రాష్ట్రంలో మిరప పంటపై వైరస్తెగుళ్ళ వ్యాప్తి చెందడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైరస్ ను అరికట్టటానికి ప్రత్యేకమైన మందులు లేవు. అందువల్ల రోగ లక్షణాలు, వ్యాప్తికి కారకాలు, అనుకూల పరిస్థితులు, ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగి ఉంటే వైరస్ తెగుళ్ల తీవ్రతను, వ్యాప్తిని అరికట్టవచ్చు.

ఆకుముడత/ జెమిని వైరస్: ఇది తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. వాతావరణంలో అధిక తేమ మరియు వర్షాభావ పరిస్థితులు తెల్ల దోమ ఉధృతికి దోహద పడి ఈ వైరస్ తెగులును అధికంగా వ్యాప్తి చేస్తున్నాయి. తల్లి, పిల్ల పురుగులు మొక్క మధ్య ప్రాంతంలోని ఆకుల అడుగు భాగంలో గుంపులు, గుంపులుగా చేరి రసం పీల్చుట వలన తెల్ల దోమ శరీరంలో ఉన్న వైరస్ లాలాజలం ద్వారా ఆరోగ్యవంతమైన మొక్కకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:

  • లేత ఆకులు చిన్నవిగా మారి, పైకి ముడుచుకొని పడవ ఆకారంలో మారుతాయి.
  • ఆకులు పాలిపోయి, లేత ఆకుపచ్చ రంగుకు మారి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.
  • పెరుగుదల తగ్గుతుంది. పూసిన పిందెలుకాయలుగా మారవు.
  • ఈ తెగులు లక్షణాలు సూక్ష్మపోషక లక్షణాలు వలే కన్పిస్తాయి. సూక్ష్మపోషక లక్షణాలు అయితే పొలంలో కొన్ని ప్రాంతాలలో గుంపులు గుంపులుగా కన్పిస్తాయి. అదే ఆకుముడత వైరస్ సోకిన మొక్కలు అక్కడక్కడ కన్పిస్తాయి.

కుకుంబర్ మొజాయిక్ వైరస్/ వెర్రి తెగులు:

  • ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది
  • తల్లి, పిల్ల పురుగులు గుంపుల గుంపులుగా ఆకుల అడుగుభాగంలో చేరి రసం పీల్చి, తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించుటం వలన బూజు తెగులు ఏర్పడును.

లక్షణాలు:

  • నల్లని మసి/ బూజు తెగులు ఆకులపై, కాయలపై కన్పిస్తాయి.
  • మొక్కలు గిడసబారి, ఎదుగుదల లోపించి పొట్టిగా ఉంటాయి.
  • ఆకుల్లో పత్రహరితం లోపించి, కొనలు సాగి వికృతంగా మారి మొజాయిక్ లక్షణాలు కనబరుస్తాయి.

పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్/ మొవ్వుకుళ్ళు తెగులు:

  • ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • పొలం గట్లమీద వుండే కలుపు మొక్కలైన వయ్యారిబామ, తుత్తుర బెండ మొక్కలలో ఈ వైరస్ వృద్ధి చెందుతుంది. ఈ కలుపు మొక్కలను ఆశించిన తామర పురుగులు మిరప పంటపై రసం పీల్చటం ద్వారా ఈ వైరస్ తెగులు వస్తుంది.
  • అధిక వర్షాలు తరువాత బెట్ట వాతావరణం ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

లక్షాణాలు:

  • నారు మళ్ళు మరియు సాలు తోటలోని ఆశించి మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది.
  • కాండం ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణ వ్యాపించి నల్లని చారులగా మారుతాయి.
  • ఆకులపై నెక్రోటిక్ మచ్చలు ఏర్ఫడి పండుబారి రాలిపోతాయి.

వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం:

  • వైరస్ ఆశించిన తరువాత నివారణ చర్యలు తీసుకొనటం కంటే వైరస్ తెగుళ్ళ లక్షాణాలు తెలుసుకొని ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపట్టడం మంచిది.

వైరస్ తెగుళ్ళ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు:

  • వైరస్ తెగులు సోకని/తట్టుకొనే రకాలను సాగుచేయాలి.
  • అవకాశం ఉంటే తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి.
  • పచ్చిరొట్ట ఎరువును భూమిలో కలియదున్నాలి.
  • చివరి దుక్కిలో లేదా నాటేటప్పుడు 200 కిలోల వేపపిండిని ఎకరానికి వేయాలి.
  • పొలం గట్ల వెంబడి 2-3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పైర్లను పెంచడం ద్వారా రసం పీల్చే పురుగుల ప్రవేశాన్ని అరికట్టవచ్చు.
  • ఎక్కువగా సేంద్రియ ఎరువులైన మాగిన పశువుల ఎరువు, గొర్రల పెంట జీవ నియంత్రణలో వాడే ట్రైకోడెర్మా వంటివి వాడాలి.
  • విత్తన శుద్ది విధిగా చేయాలి. ఒక కిలో విత్తనానికి 8గ్రా. ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందుతో రసంపీల్చు పురుగుల నివారణాకు, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్ తెగులు నివారణకు ట్రైసోడియమ్ ఆర్థోఫాస్పేట్ తో విత్తన శుద్ది చేయాలి.
  • నారు దశలో విత్తిన 2-3 వారాలకు, నాటటానికి 1-2 రోజుల ముందు తప్పకుండా 25 గ్రా. ఎసిఫేట్ లేదా 0.25మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి రసంపీల్చే పురుగులను, వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.
  • పాలీ హౌస్/షేడ్ నెట్ లో రసంపీల్చు పురుగుల తాకిడి తక్కువగా వుంటుంది. అవకాశం వుంటే పాలీ హౌస్/షేడ్ నెట్ లో నారు పెంచి వైరస్ సోకని నారును నాటుకోవచ్చు.
  • నాటేటప్పుడు ఎకరానికి 10-12 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేస్తే ప్రారంభ దశలో రసం పీల్చే పురుగుల తాకిడిని తగ్గించవచ్చు.
  • భూసార పరీక్షకు అనుగుణంగా ఎరువులను వడాలి. కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భాస్వరం ఎక్కువై సూక్ష్మపోషకాలను మొక్క గ్రహించలేదు. తద్వార మొక్కలు బలహీనమైన వైరస్ బారిన పడతాయి. అందుచే సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి.
  • ప్రస్తుతం మార్కెట్ లో విపరీతంగా లభిస్తున్న జీవ ప్రోడక్ట్స్ (బయోస్) వైరస్ తెగుళ్ళు, రసం పీల్చే పురుగులపై ఎటువంటి ప్రభావం ఉన్నట్టు నిర్థారించలేదు. ఈ బయోస్ విచక్షణరహితంగా వాడరాదు.
  • మైక్రో ఇరిగేషన్ ద్వారా తెగుళ్ళను తగ్గించవచ్చు.
  • పంటను ఎప్పటికప్పుడు గమనించి వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి.
  • తెల్లదోమ, పేనుబంక పురుగులను తక్కవ సంఖ్యలో ఉన్నప్పుడేన్నివారించాలి.
  • పొలంలో అక్కడక్కడ ఆముదము/ గ్రీజ్/ వాడేసిన ఇంజన్ ఆయిల్ పూసిన పసుపు రంగు అట్టలను/ రేకులను ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకోవటంతో పాటు కొంత కొంత వరుకు సంఖ్యను తగ్గించవచ్చు.
  • తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి ఎసిఫేట్ 350 గ్రా./ టైజోఫాస్ 250 మి.లీ./ ఎసిటమాప్రిడ్ 60గ్రా/ అడ్మైర్ 30గ్రా./ థయోమితాక్సాం 40గ్రా. మందులు మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. ఇవే మందులను పేనుబంకను కూడా సమర్థనంతంగా అరికడతాయి.
Leave Your Comments

ఒంగోలు ఆవుకు పూర్వ వైభవం

Previous article

ఫలించిన ఆలోచన … పంటకు రక్షణ

Next article

You may also like