Colibacillosis in Cattle Symptoms: ఇ.కోలై రకపు బ్యాక్టీరియాలలో కొన్ని మాత్రమే పశువులలో నిజమైన వ్యాధిని కలుగజేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు ఎక్కువగా ప్రేగులలో ఉండి, ఎండోటాక్సిన్ విషపదార్థాలను ఉత్పత్తి చేస్తూ, ప్రేగులలో ఇన్ఫ్లమేషన్ ను కలుగజేస్తుంటుంది. అందుకే దీనిని ఎంటిరోటాక్సిజెనిక్ (లేదా) ఎంటిరోటాక్సిక్ ఇ-కోలై అని కూడా అంటారు. ఈ వ్యాధి మనుషులతో పాటు అన్ని రకాల పశువులలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, పందులు, కోళ్ళలో విరోచనాలు, సెప్టిసీమియా లక్షణాలను కనబరుస్తుంటుంది.
Also Read: Age Determination in Cows: పాడి పశువుల వయస్సు నిర్ధారించుట.!
వ్యాధి కారకం:– ఇది ఒక గ్రామ్ నెగిటివ్ వ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో 4 రకాల అంటిజెన్లు కలవు.
అవి:
1. సోమాటిక్ అంటిజెన్
2. క్యాప్పుల్లార్ అంటిజెన్
3. ఫ్లాజెల్లార్ అంటిజెన్
4. ఫింబ్రియల్ అంటిజెన్.
ఈ ఆంటిజన్స్ బ్యాక్టీరియాల పెరుగుదలకు మరియు వ్యాధిని కలిగించుటకు తోడ్పడును. ఇవి కర్ర ఆకారంలో ఉండి, ఎండోటాక్సిన్‌లను విడుదల చేస్తుంటాయి. ఈ బ్యాక్టీరియాలు సహజంగా అన్ని జంతువులు మరియు పక్షుల జీర్ణాశయంలో ఉంటాయి, కాని పశువులలో ఈ క్రింది కారణాల చేత వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే పెరిగి వ్యాధిని కలిగిస్తుంటాయి.
దూడలు పుట్టిన వెంటనే జున్ను పాలు త్రాగించకపోవుట వలన
పశువులకు సరియైన పోషక ఆహారం ఇవ్వకపోవుట వలన
అధిక క్రొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తినిపించుట వలన
తక్కువ ప్రదేశంలో అధిక పశువులను కట్టివేయుట వలన
సరియైన పాక, గాలి, నీటి సౌకర్యం లేకపోవుట వంటి కారణాల వలన
వాతావరణ ప్రతికూల పరిస్థితుల ఫలితంగా బలహీనమైన దూడలు పుట్టుట
ఇతర వ్యాధుల ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుట
కలుషితమైన ఆహారం మరియు నీరును త్రాగించుట వంటి కారణాలు ఇ.కోలై క్రిములు పెరుగుటకు కారణమగును.
వ్యాధి బారిన పడు పశువులు:- అన్ని రకాల జంతువులు అనగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు, కోళ్ళలోను మరియు మనుషులలో ఈ వ్యాధి కల్గుతుంది.
వయస్సు:- దూడలు, చిన్న గొర్రె పిల్లలు మరియు పంది పిల్లలు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడి చనిపోతుంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో కలుగుతుంటుంది.
వ్యాధి వచ్చు మార్గాలు:-
(1) కలుషితమైన ఆహారం మరియు నీరు ద్వారా
(2) వ్యాధి సోకిన పశువు యొక్క పాలను త్రాగించడం ద్వారా
(3) శరీర గాయాల ద్వారా
(4) దూడలకు ఎక్కువ పాలను త్రాగించుట ద్వారా వ్యాధి కలుగుతుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానము:- కలుషితమైన ఆహారం మరియు నీరును నోటి ద్వారా తీసుకోవడం వలన ఈ బ్యాక్టీరియాలు పొట్ట ప్రేగులలో చేరి, వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు పెరిగి ఎండోటాక్సిన్ అను విషపదార్థాలను విడుదల చేయుట వలన ప్రేగు కణాలలో శోధం ఏర్పడి, విరోచనాలు కలుగును.
ఫలితంగా వ్యాధి బారిన పడిన పశువుల శరీరం నుండి నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళి పోయి, డీ-హైడ్రేషన్’ లక్షణాలు కలిగి, రక్తంలో హిమోకాన్సెంట్రేషన్ ఉత్పన్నమై పశువుల రక్త సరఫరాలో అడ్డంకు ఏర్పడి, షాక్‌కు గురి అయి చనిపోవును. ప్రేగులలో అభివద్ధి చెందిన ఈ బాక్టీరియాలు రక్తంలో కలిసి సెప్టిసీమియా ఏర్పడి వివిధ అవయవాలలో (పొదుగు, గర్భకోశం, ఉపిరితిత్తులు, గుండె) ప్రవేశించి వాటిని నాశనం చేస్తాయి. ఫలితంగా పశువులు చనిపోతుంటాయి.
లక్షణాలు:-
విరోచనాలు ఎక్కువ అవటం వలన పశువుల శరీరం నుండి నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళి పోవడం వలన పశువులు నీరసంగా ఉంటాయి.
- తీవ్రమైన జ్వరం వుంటుంది.
- కళ్ళు లోపలికి గుంతలు పడిపోయి, పాలిపోయి ఉండును.
- శరీర ఉష్ణోగ్రత, నాడీ, శ్వాస పెరిగి వుంటుంది.
- పశువులు సరిగ్గా నడవలేవు మరియు నిలబడలేవు.
- కొన్ని సార్లు రక్తంతో కూడిన చెడు వాసన కలిగిన విరోచనాలు ఉంటాయి.
వ్యాధి కారక చిహ్నములు:-
(1) అన్ని అవయవాలలో సెప్టిసీమియా లక్షణములు వుంటాయి.
(2) ప్రేగులలో హిమరేజిక్ కండిషన్ మాడవచ్చును.
వ్యాధి నిర్ధారణ:-
వ్యాధి చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నములు మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించగలము.
చికిత్స:- వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స :- గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పై పనిచేయు ఆంటి బయోటిక్స్ అయిన సల్ఫనమైడ్ గ్రూప్, సెఫలోస్పోరిన్ గ్రూప్, మెట్రానిడజోల్, ప్యూరాజోలిడిన్, ఓరినిడజోల్ గ్రూపు అంటీబయోటిక్ ఔషధములను 5-7 రోజులు ఇచ్చినట్లైతే ఫలితం ఉంటుంది. ఈ వ్యాధిలో పశువులు ఎక్కువగా నీరు కోల్పోతాయి. కావున సిరల ద్వారా సెలైవ్ ద్రావణములు ఇవ్వవలసిన అవసరం.
నివారణ:- ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు. పశువుల పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం మరియు నీరు ఇవ్వాలి. దూడలు పుట్టిన వెంటనే బొడ్డు కత్తిరించి, అయోడిన్‌తో శుభ్రపరచాలి. పాకలో పశువులు కిక్కిరిసి లేకుండా గాలి వెలుతురు సోకేలా మాడాలి. ఒక కి. లో శరీరం, బరువుకు కనీసము 50-75ml చొప్పున జున్నుపాలను దూడలకు త్రాగించాలి.
Also Read: Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!