ఆంధ్రా వ్యవసాయం

కొర్ర సాగు లో మెళుకువలు

0

కొర్రలు ఒక విధమైన చిరుధాన్యాలు.ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమైన ఆహారంగా ఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్దానంలో ఉన్నది.కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. దీని శాస్రీయ నామం సెటేరియా ఇటాలికా. ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనా కాలం నుండి పండిస్తున్నారు. ఈ పంట సాగు వల్ల బెట్ట పరిస్దితులలో కూడా మంచి దిగుబడులుతో పాటు పశుగ్రాసం మరియు అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు.

రాష్ట్రంలో కొర్ర సాగు విస్తీర్ణం 45 వేల ఎకరాలు. ఉత్పత్తి 15 వేల టన్నులు మరియు దిగుబడి ఎకరానికి 331కిలోలు. రాష్ట్రంలోని కొర్ర సాగు విస్తీర్ణం దాదాపు 70% అత్యల్ప వర్షపాత మండలంలోను మిగిలిన 30% మిగిలిన మండలాల్లో విస్తరించి ఉంది.కర్నూల్ జిల్లాలో దాదాపు కొర్ర సాగు విస్తీర్ణం 7వేల ఎకరాలు . జిల్లాలో దిగుబడి ఎకరానికి 329 కిలోలు.
నేలలు :- తేలిక నుండి నల్లరేగడి నేలలు,మురుగు నీటి పారుధలగల నేలలు.
అధిక దిగుబడినిచ్చే రకాలు:
యస్ఐఎ 3085: బెట్టను తట్టుకొంటుంది. అగ్గితెగులును,గింజ బూజు తెగుళ్ళును తట్టుకొంటుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కల్గి ఉంటుంది.
యస్ఐఎ 3088(సూర్యనంది): గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కల్గి ఉంటుంది.అగ్గితెగ్గులు మరియు వెర్రికంకి తెగులును తట్టుకొంటుంది. వివిధ పంటల క్రమంలో పండించుటకు అనుకూలం.
యస్ఐఎ 3156: అధిక గింజ దిగుబడి , వెర్రికంకి తెగులును తట్టుకొంటుంది.
విత్తే సమయం :-
ఖరీఫ్ : జూన్ – జూలై
వేసవి : జనవరి
విత్తనం :- ఎకరాకు 2 కిలోలు
విత్తటం :- విత్తనాన్ని వరుసల మధ్య 22.5 మరియు మొక్కల మధ్య 7.5 సెం.మీ. దూరంలో గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 2 లక్షల 37వేల మొక్కలు ఉండాలి.
ఎరువులు :- ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి . ఎకరాకు 8 కిలోల నత్రజని , 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. నాటిన 3-4 వారాల తర్వాత పైపాటు మరో 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి .
అంతర పంటలు :- కొర్ర : కంది /వేరుశనగ – 5:1
కలుపు నివారణ :- విత్తిన రెండు వారలలోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
సస్యరక్షణ :-
గులాబి రంగు పురుగు : లార్వాలు మొవ్వను తొలిచి తినడం వలన మొవ్వ చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లైతే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ.మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
కాండం తొలుచు పురుగు : ఈ పురుగు కాండాన్ని తొలచడం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి రెండుసార్లు 20 -30 రోజుల మధ్య పిచికారీ చేయాలి.
తుప్పు తెగులు : ఈ తెగులు ఒక రకమైన శిలీంద్రం వలన కలుగుతుంది. ఆకుల మీద రెండువైపులా గోధుమ రంగు కలిగిన చిన్నచిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకుతొడిమ మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువ అయిన ఎడల ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజేబ్ కలిపి పైరుపై తెగులు కలిపించిన వెంటనే పిచికారీ చేయాలి .
అగ్గితెగులు : ఎదిగిన మొక్కల ఆకులపై నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆకులు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. కంకికాడపై మచ్చలు ఏర్పడినప్పుడు కాండం విరిగి,కంకి లో తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు కాప్టాన్ లేక థైరమ్ (3 గ్రా /కిలో) విత్తనశుద్ది చేయాలి.లీటరు నీటికి కార్బెండజిం 1 గ్రా. లేదా మాంకోజేబ్ 2.5 గ్రా. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
వెర్రికంకి తెగులు : తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగువైపు బూజులాంటి శిలీంద్రం పెరుగుదల కనిపిస్తుంది. అట్టి ఆకులు ఎండి పీలికలుగా కనిపిస్తాయి. మొవ్వలోని ఆకులు సరిగా విచ్చుకోవు. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు గింజల ప్రదేశంలో ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారి కనిపిస్తాయి. దీని నివారణకు 3 గ్రా. థైరమ్ లేక కాప్టాన్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి లేదా లీటరు నీటికి మాంకోజేబ్ 2.5 గ్రా. కలిపి పంటపై పిచికారి చేయాలి.
దిగుబడి:- ఎకరాకు 10 – 12 క్వింటాల్ దిగుబడి పొందవచ్చును.

Leave Your Comments

పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్

Previous article

ఒంగోలు ఆవుకు పూర్వ వైభవం

Next article

You may also like