Vana Mahotsavam: సంవత్సరమునకు ఒకసారి చెట్లు నాటే పండుగను వనమహూత్సవమని అంటారు. వనమహూత్సవమును 1950లో అప్పటి వ్యవసాయ శాఖామంత్రి అయిన శ్రీ.కే.వ్ మున్నీగారు ప్రారంభించారు. వనమహూత్సవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఖాళీగా ఉన్న ప్రతి భూభాగంపైన అంటే పొలాలలోను, ప్రైవేట్, పబ్లిక్ భవనాల కాంపౌండ్లలోను, రోడ్ల వెంబడి, బావుల చుట్టూ చెట్లను నాటుతారు.
సాధారణంగా ఈ కార్యక్రమమును జూలై-ఆగష్టు నెలల్లో నిర్వహిస్తారు.
వనమహోత్సవ కార్యక్రమ ఉత్సాహాన్ని కేవలం మొక్కలు నాటిన రోజుకే పరిమితం కాకుండ తర్వాత వాటి యాజమాన్యము మరియు ఎదుగుటను పర్యవేక్షించే ఉద్దేశముతో కేంద్ర ప్రభుత్వం వారు చెట్లు నాటే వారికి, ఉత్తమ గ్రామానికి, జిల్లాకి, సంస్థకి మరియు విశ్వవిద్యాలయానికి, జవహర్, రాజేంద్ర, సర్దార్ పటేల్, మునీ పేర్లతో ట్రోఫీలను ఉత్సాహకంగా ప్రదానం చేయడానికి స్థాపన చేశారు.
వనమహూత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు:
- పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసం చెట్ల విస్తీర్ణమును పెంచటం
- వంటచెరుకు, పశుగ్రాసము మరియు వ్యవసాయ పనిముట్లకు కావలసిన చిన్న తరహా కలపను ఉత్పత్తి చేయడం కోసం చెట్లను నాటటం
- పనిలేని కాలంలో పనిని కల్పించుకోవడం కోసం వనమహూత్సవమును ఉపయోగించుకోవడం
- చెట్లు నాటడం వల్ల నేలకోతను తగ్గించి భూమిని సంరక్షించడం.
- చెట్లను నాటి క్షీణించిన భూములను అభివృద్ధి పరచడం
- ఆహారమును మరియు ఇతర అడవుల స్వల్ప ఫలములను ఉత్పత్తి చేసి గ్రామ ప్రజల ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేయడం.
చెట్ల పెంపకం:
ముందుగా చెట్లు నాటవలసిన భూముల్లో గల వివిధ రకాలైన ముళ్ళ పొదలను, కలుపు మొక్కలను, శుభ్రం చేసి వీలయిన చోట్ల దున్నాలి. మొక్కలు నాటటానికి ముందు మే-జూన్ మాసాల్లో ఎన్నుకొన్న భూముల్లో గుంతలు (30X30X45 సెం.మీ) త్రవ్వుకోవాలి. ఎకరాకు ఎన్ని గుంతలు తీయాలన్నది పెంచే మొక్కలను బట్టి ఉంటుంది. ప్రతి గుంత షుమారుగా ఎటుచూసినా 2 నుండి 4 మీటర్ల దూరంలో ఉండాలి. త్రవ్విన ప్రతి గుంతలో 4 కిలోల పశువుల ఎరువు, తగినంత నల్లమట్టి, వీలయినచోటల్ల అరకిలో వేపపిండి, 50 గ్రా. డి.ఎ.పి మరియు 50 గ్రా. 3% లిండేన్ వేయాలి. తదుపరి జూన్-జూలై మాసాల్లో ఎన్నుకొన్న మొక్కలను నాటాలి.