Silage: పచ్చిమేతను పాత మాగుడు గడ్డిగా నిల్వచేసుకోవటానికి కొన్నిరకాల పైర్లు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ మేపుకు అనువైన పశుగ్రాసాలలో మొక్కజొన్న, జొన్న మొదలైన ఏకవార్షిక పశుగ్రాసాలు హైబ్రిడ్ నేపియర్ లాంటి బహువార్షిక పశుగ్రాసాలు బాగా పనికొస్తాయి. మన దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, వాతావరణ పరిస్థితుల దృష్టితో ఆలోచించినట్లైతే భూమిలో గుంట తీసి పచ్చిమేతను నిలువచేయటం తేలికైన పద్ధతి. గుంటను గుండ్రటి ఆకారంలో గాని, చతురస్ర ఆకారంలో గాని తవ్వుకోవచ్చు. మాగుడు గడ్డిని పాడిపశువులకు రోజుకు 20 కిలోల చొప్పున ఇవ్వాలి. ఐదు పాడిపశువులు కనుక ఉన్నట్లైతే 3 నెలల కాలానికి 12,000 కిలోల సైలేజి అవసరం అవుతుంది. 1 ఘనపు అడుగు సైలేజి గడ్డి బరువు 15 కిలోలు ఉంటుంది. 15 టన్నుల సైలేజి తయారు చేయుటకు 1000 ఘనపు అడుగుల పాతర కావాలి. ఇందు కొరకు 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు గల గుంతను ఏర్పాటు చేసుకోవాలి.
Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!
కత్తిరించిన మేతను పాతరలో నింపేటప్పుడు పొరల మధ్య గాలి చొరకుండా చూసుకోవాలి. సైలేజి గుంటను వర్షపునీరు నిల్వని ఎత్తైన ప్రదేశాలలో నిర్మించాలి. ఇటుకలతో పలుచటి గోడను నిర్మించి సిమెంట్‌తో పూత పూయిస్తే పటిష్టంగా ఉండి వర్షపు నీరు లోనికి రాకుండా రక్షణ కల్పిస్తుంది. మాగుడు మేతకు ఉపయోగించదలచిన గడ్డిని పూతకొచ్చే దశవరకు పెరగనిచ్చి కోయాలి. కోసిన మేతలో తేమ 65-70 శాతం మించి ఉంటే అటువంటి మేతను పొలంలోనే ఆరబెట్టవలెను. ఆరిన మేతను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించవలెను. వర్ష సూచనలు లేని రోజులలో మాత్రమే ఈ పనిని మొదలుపెట్టాలి. పాతరలో అడుగు భాగాన చుట్టూ సిమెంటు పూత లేనిచో మందపాటి పాలిథీ¸న్ షీటుతో కానీ, పనికిరాని ఎండుగడ్డితో కానీ కప్పి మట్టి పెళ్ళలు మేతపై పడకుండా నివారించాలి.
పాతరలో కత్తిరించిన మేతను నింపేపనిని ఉదయాన్నే ప్రారంభించాలి. మేతను పొరలు పొరలుగా పేర్చుతూ పొరల మధ్య నిల్వవుండే గాలిని కాళ్ళతో తొలగించాలి. పొరల మధ్య నిలబడిన గాలిని తొలగించని యెడల మాగుడుగడ్డి బూజు పట్టిపోయే అవకాశం ఉంది. గుంట పై భాగంలో అర్ధచంద్రాకారం వచ్చేటట్లు పేర్చి దాని పై మందపాటి పాలిధీ¸న్ షీట్ కప్పాలి. దీనిపైన 10-15 సెం. మీ. మందాన మట్టితో కప్పితే ఆ బరువుకు నిలువ చేసిన గడ్డి త్వరగా రసాయనిక మార్పుకు గురవతుంది. మట్టి పొరపైన పశువుల పేడతో కానీ మట్టితో కానీ అలికితే రంధ్రాలు పూరుకుపోయి మాగుడుగడ్డి తయారీకి బాగా అనుకూలంగా ఉంటుంది.
చొప్పతో పోలిస్తే ఎండబెట్టి నిలవచేసిన గ్రాసాలలో పోషక విలువలు ఎక్కువ. నాణ్యమైన ఎండుమేతలో ఆకులు ఎక్కువగావుండి ఆకు పచ్చని రంగుతో మృదువుగా పశువులకు నోరూరించేవాసన, రుచి కలిగి ఉంటాయి. సైలేజి నిల్వవుంచిన గడ్డిని 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వచేసుకోవచ్చు. మొత్తం కప్పునంత ఒక్కసారిగా తీయకూడదు. అలవాటు పడేవరకు పశువులు సైలేజిని తినకపోవచ్చు. పాలు పితికిన తరువాత లేదా పాలు పితకడానికి నాలుగు గంటల ముందు దీనిని పశువులకు మేపాలి. లేనిచో సైలేజి వాసన వస్తుంది.
సైలేజీ వాడకం:
మంచి నాణ్యమైన సైలేజిని పశువులు మరియు జీవాలు (మేకలు, గొర్రెలు) చాలా ఇష్టంగా తింటాయి. పశువులకు సైలేజిని అలవాటు చెయ్యడం కోసం మెపేటప్పుడు మొదటగా ఆహారంలో 20 శాతం మాత్రమే సైలేజిని ఇవ్వాలి. తరువాత రోజూ 15 శాతం పెంచాలి. పశువులు వాటి శరీర బరువును బట్టి 2,530 కిలోల వరకు సైలేజిని తీసుకుంటాయి. అదే జీవాలకు (మేకలు, గొర్రెలు) వాటి శరీర బరువుని బట్టి 900 గ్రాముల నుండి 2 కిలోల వరకు సైలేజిని తీసుకుంటాయి. మార్కెటింగ్ వయస్సుకి వచ్చిన జీవాలు 2.5-3 కిలోల వరకు సైలేజిని ఒకరోజుకి తినగలవు.
సైలేజి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రతలు:
. కుళ్లిన లేదా పాడైపోయిన సైలేజి పశువుల మేపుకు పనికిరాదు.
. పాతరలో మేతను పొరలు పొరలుగా పేర్చుతూ పొరల మధ్య నిల్వవుండే గాలిని కాళ్ళతో తొలగించాలి. అలా తొలగించని యెడల మాగుడుగడ్డి బూజు పట్టిపోయే అవకాశం ఉంది.
. సైలేజి గడ్డి యొక్క తేమ శాతాన్ని గమనిస్తూ ఉండాలి.
. సైలేజి గుంత తెరిచిన తరువాత నెల రోజులలో వాడుకోవాలి లేకపోతే ఆరిపోయి చెడిపోతుంది.
. ప్రతిరోజూ పశువు తినే మెతలో 55-60 శాతం సైలేజితో మేపి మిగిలిన 40-45 శాతం దాణాతో మేపవచ్చును.
డా.జి.మితుస్
పశుసంరక్షణ శాఖ, డి.డి.ఎస్-కృషి విజ్ఞాన కేంద్ర,
సంగారెడ్డి జిల్లా, ఫోన్ : 7799880400
Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం