పండుగ అనగానే అనేక ఆనంద స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆనందంగా జీవితాన్ని గడిపే క్రమంలో కొన్ని ఉత్సవాలు జరుపుకుంటాము. సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి దినోత్సవాలు పాటిస్తాము. పుట్టిన రోజు, పెళ్ళి రోజు, అమ్మ నాన్న రోజు, ప్రేమికులరోజు, వివిధ కులవృత్తులు, నాగరిక వృత్తులకు రోజులున్నాయి వాటికి సమాజం ప్రాచుర్యం కల్పించింది. ప్రచార ఆర్భాటాలు, జాతీయ, అంతర్జాతీయ వేదిక ప్రచారం ఉంది. కాని రైతుకు అలాంటి అవకాశంలేదు గుర్తింపూలేదు. అసలు వ్యవసాయరంగం మనుగడే ప్రశ్నార్థకమైన నేపధ్యంలో ఇక రైతు దినోత్సవానికి ప్రాముఖ్యత ఏది?
రైతుకు, వ్యవసాయానికి, సమస్త వృత్తిదారులకు వన్నె తెచ్చిన నేత మన భారత్‌లో ఒకరున్నారు. ఆయనే చౌదరి చరణ్ సింగ్. మనదేశానికి తొలి రైతు ప్రథాని. ఈ అత్యున్నత పదవిలో కొద్దికాలమే ఉన్నా భారతరాజకీయ యవనిక పై చెరగని ముద్రవేసిన చౌదరి సాబ్ రైతు సాధికారతకు నిజమైన చిహ్నం. ఆయన స్మృత్యర్ధం ఆయన జన్మదినాన్ని జాతీయ రైతుదినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అంతర్జాతీయ వ్యవసాయదారు దినాన్ని ఏప్రిల్ 17వ తేదీనే జరుపుకుంటున్న చరణ్ సింగ్‌కు ఆయన నిర్వహించిన రైతాంగ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా డిసెంబర్ 23ను జాతీయ రైతుదినోత్సవంగా జరుపుకుంటున్నాం.
చౌదరి చరణ్ సింగ్ జరిపిన పోరాటాల ఫలితంగా దేశంలో జమీందారీ చట్టం రద్దు కావడం దానిస్ధానంలో కౌలుదారీ చట్టం అమల్లోకి జరిగాయి. చరణ్ సింగ్ పోరాటాలతోపాటు మరికొందరు నేతల దార్శనికత భూసంస్కరణ చట్టం అములోకి వచ్చింది. పేదలకు భూముల పంపిణీ, వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల నుండి రైతులను విముక్తి చేసి బ్యాంకు రుణాలకు అర్హులను చేయడం వంటి ప్రగతిశీ కార్యక్రమాలను అమలు చేయడం వెనుక చరణ్ సింగ్ పాత్ర ఉంది. మరణానంతరం ఆయన జన్మదినాన్ని కిసాన్ దివస్‌గా ప్రకటించారు. చౌదరి చరణ్ సింగ్ 1902 డిసెంబర్ 23న జన్మించారు, 1987మే29న మరణించారు.స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. భూస్వామ్య వ్యవస్ధపై అవిశ్రాంత పోరు జరిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, భారతీయ లోక్‌దళ్ అధ్యక్షుడుగా, జనతాదళ్ నేతగా చరణ్ సింగ్ అన్ని హోదాల్లోనూ రైతు శ్రేయస్సుకే పాటు పడ్డారు. ఒక్క పిలుపుతో లక్షమంది రైతులను సమీకరించి చక్కా, జామ్ ద్వారా ప్రభుత్వాలను స్ధంబింజేసి డిమాండ్లను నెరవేర్చుకున్న నేతగా ప్రసిధ్ధి పొందారు. ఇందిరాగాంధీ హయాంలో ఢిల్లీ బోట్స్ క్లబ్ వద్ద రోజు తరబడీ ప్రదర్శన నిర్వహించి చరితార్ధుడుగా నిలిచిపోయారు